కోతులకు కు.ని. ఆపరేషన్లు

3 Apr, 2018 02:43 IST|Sakshi

బెడదను నివారించటానికి ప్రభుత్వ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: కోతుల బెడదను నివారించేందుకు ప్రభుత్వం సరికొత్త ఉపాయం కనిపెట్టింది. దశలవారీగా కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని నిర్ణయించింది. హిమాచల్‌ ప్రదేశ్‌ మాదిరిగా కోతులకు ఇంజెక్షన్లు ఇచ్చి సంతతి పెరగకుండా నివారించే విధానం చర్చకు వచ్చింది. ఈ మేరకు సోమవారం ఇక్కడ కోతుల బెడద నివారణపై నిపుణుల కమిటీ అరణ్యభవన్‌లో సమావేశమైంది. పంటలను ధ్వంసం చేయటం, గ్రామాల్లో వీటి ఆగడాలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిపుణుల కమిటీని నియమించారు. అటవీ, వ్యవసాయ, మున్సిపల్, హార్టికల్చర్, అధికారులతోపాటు అటవీ జంతువులపై పరిశోధనలు చేస్తున్న సంస్థల ప్రతినిధులకు కమిటీలో చోటు కల్పించారు.

వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో రానున్న నెల రోజుల్లో కోతుల బెడద, తీవ్రతపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఏఏ ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి.. ఏ రకమైన పంటలను కోతులు నాశనం చేస్తున్నాయి.. వాటి నివారణ, మానవ ఆవాసాలపై కూడా కోతుల బెడద ఏ మేరకు ఉందన్న విషయాల ఆధారంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించారు. అటవీ ప్రాంతంతోపాటు, జనావాసాల్లో కూడా కోతులకు తినే పదార్థాలు పెట్టడం వల్ల అడవులను వదిలి బయటకు వచ్చేందుకు మక్కువ చూపుతున్నాయని, ప్రజలు కోతులకు ఫీడింగ్‌ పెట్టకుండా ఉండటం మంచిదని నిపుణులు అభిప్రాయపడ్డారు.

కోతులపై అధ్యయనం, కుటుంబ నియంత్రణ చర్యలకు ఉద్దేశించిన ప్రత్యేక సెంటర్‌ నిర్మల్‌లో త్వరలోనే ప్రారంభమౌతుందని, స్టెరిలైజేషన్‌ చేసిన కోతులను విడతలవారీగా అడవుల్లోకి వదిలిపెట్టేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. తదుపరి కార్యాచరణపై మరో వారం, పదిరోజుల్లో మరోసారి కమిటీ సమావేశం జరగనుంది. సమావేశంలో ప్రధాన అటవీ సంరక్షణ అధికారి పి.కె.ఝా, పీసీసీఎఫ్‌లు పృథ్విరాజ్, పశు సంవర్థక శాఖ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు, జీహెచ్‌ఎంసీ చీఫ్‌ వెటర్నిటీ అధికారి వెంకటేశ్వర రెడ్డి, సీసీఎంబి డైరెక్టర్‌ డాక్టర్‌ ఉమాపతి, వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్‌ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు