డిగ్రీలో మేనేజ్‌మెంట్‌ కోటా!

7 Feb, 2019 01:54 IST|Sakshi

 ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించిన ప్రైవేటు యాజమాన్యాలు

కొత్త విద్యాసంవత్సరం ప్రవేశాలకు కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ కాలేజీల్లోనూ మేనేజ్‌మెంట్‌ కోటా తెచ్చేందుకు కసరత్తు మొదలైంది. కన్వీనర్‌ ద్వారా భర్తీ చేస్తున్న ఇంజనీరింగ్‌ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో యాజమాన్య కోటాను అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఇటీవల డిగ్రీలోనూ కన్వీనర్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రవేశాలను చేపడుతోంది. ఈ నేపథ్యంలో డిగ్రీలోనూ మేనేజ్‌మెంట్‌ కోటాను అమలు చేయాలని డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు కోరుతున్నాయి. రాష్ట్రంలో 1,100 డిగ్రీ కాలేజీలుంటే అందులో డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్‌) కన్వీనర్‌ నేతృత్వంలో 1,084 కాలేజీల్లో దాదాపు 4 లక్షల సీట్లను ఉన్నత విద్యా మండలి గత రెండేళ్లుగా భర్తీ చేస్తోంది.  

30% యాజమాన్య కోటాకు డిమాండ్‌ 
ఆన్‌లైన్‌లో దోస్త్‌ కన్వీనర్‌ ద్వారా ప్రవేశాలను చేపడుతున్నందున తమకు 30 శాతం మేనేజ్‌మెంట్‌ కోటా విధానాన్ని అమలు చేయాలని యాజమాన్యాలు డిమాండ్‌ చేస్తున్నాయి. లేదంటే కన్వీనర్‌ నేతృత్వంలో కౌన్సెలింగ్‌ ద్వారా ప్రవేశాలు పూర్తయ్యాక మిగిలిపోయే సీట్లను స్పాట్‌ అడ్మిషన్ల కింద యాజమాన్యాలే భర్తీ చేసుకునేలా అవకాశం కల్పించాలని కోరుతున్నాయి. అయితే గత రెండేళ్లుగా స్పాట్‌ అడ్మిషన్లను యాజమాన్యాలు చేపట్టేందుకు ప్రభుత్వం అవకాశమివ్వడం లేదు. ఈ నేపథ్యంలో 30 శాతం యాజమాన్య కోటా విధానం లేదా స్పాట్‌ అడ్మిషన్లకు అవకాశం కల్పించడం.. ఈ రెండింటిలో ఏదో ఒకదానికి అంగీకరించాలని యాజమాన్యాలు పట్టుపడుతున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే అనేక సార్లు డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వం, కళాశాల విద్యాశాఖ, ఉన్నత విద్యా మండలికి విజ్ఞప్తి చేశాయి. 

ప్రవేశాల కసరత్తు నేపథ్యంలో.. 
2019–20 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం మళ్లీ కసరత్తు ప్రారంభమైన నేపథ్యంలో యాజమాన్యాలు తమ డిమాండ్‌ను మళ్లీ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చాయి. దీంతో ప్రభుత్వం కూడా యాజమాన్యాలు కోరుతున్న విధానాలపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ రెండింటిలో ఏదో ఒకటి అమలు చేయాలన్న భావనకు వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే త్వరలోనే జరిగే డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో సీటు రాకపోతే అంతే..
డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలను ఆన్‌లైన్‌లో చేపడుతున్నందున ప్రస్తుతం విద్యార్థికి ఏ కాలేజీలో సీటొస్తే అదే కాలేజీలో చేరాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు, మూడు దశల కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నా కోరుకున్న కాలేజీలో సీటు రాకపోతే చివరగా వచ్చిన కాలేజీలోనే చేరాల్సి వస్తోంది. ఇష్టం లేకపోయినా అందులో చేరటం లేదంటే మానేయడమే ప్రత్యామ్నాయంగా ఉంది. మరోవైపు చాలా కాలేజీల్లో సీట్లు మిగిలిపోతున్నాయి. ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో వస్తే వచ్చినట్లు లేదంటే లేదు. దీంతో యాజమాన్యాలు మిగిలిన సీట్లను కూడా తమ వద్దకు వచ్చే విద్యార్థులకు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ప్రైవేటు డిగ్రీ అండ్‌ పీజీ కాలేజీ మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రకాశ్, ఎ.పరమేశ్వర్‌ తెలిపారు. మేనేజ్‌మెంట్‌ కోటా అమలు చేస్తే విద్యార్థులు కోరుకున్న కాలేజీలో ఆన్‌లైన్‌ ద్వారా కన్వీనర్‌ కోటాలో.. సీటు రాకపోతే కోరుకున్న కాలేజీలో మేనేజ్‌మెంట్‌ కోటాలో చేరే అవకాశం ఉంటుందని వెల్లడించారు. లేదంటే మిగిలిపోయిన సీట్లను యాజమాన్యాలు స్పాట్‌ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసే అధికారం ఇచ్చినా విద్యార్థులు కోరుకున్న కాలేజీలో చేరే అవకాశం ఉంటుందని వారు వివరించారు.
 

మరిన్ని వార్తలు