కొత్త సార్లొస్తున్నారు..

10 Jul, 2019 10:07 IST|Sakshi

అభ్యర్థుల నిరీక్షణకు తెర 

నేడు జాబితా ప్రదర్శన 

ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలలకు కొత్త ఉపాధ్యాయులు రానున్నారు. పెండింగ్‌లో ఉన్న టీఆర్టీ(టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌) పోస్టులను భర్తీ చేసేందుకు రెండు రోజుల క్రితం జీఓ రాగా, అనంతరం షెడ్యూల్‌ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటివరకు టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వలంటీర్లతో నెట్టుకురాగా.. ఆయా పోస్టుల్లో కొత్త టీచర్లు భర్తీ అయ్యే అవకాశం ఉంది. జిల్లాలో 130 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు భర్తీ కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017లో టీఆర్టీ ప్రకటన చేసింది. 2018 ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించింది. అదే ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి.. విడతలవారీగా సెప్టెంబర్‌ 2018, ఏప్రిల్‌ 2019లో జాబితా విడుదల చేసింది. అయితే టీఆర్టీ నియామకాలపై మార్గదర్శకాలు జారీ చేసి.. అభ్యర్థుల ఎంపిక చేపట్టకపోవడంతో దాదాపు 20 నెలలపాటు అభ్యర్థులు నిరీక్షించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ప్రభుత్వం నియామక పత్రాలపై జీఓను విడుదల చేయడంతో త్వరలోనే అభ్యర్థులు టీచర్లుగా బాధ్యతలు చేపట్టనున్నారు.

 జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు.. 

ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి జిల్లాకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా కలెక్టర్‌ ఆర్వీ.కర్ణన్‌.. కార్యదర్శిగా డీఈఓ మదన్మోహన్‌ వ్యవహరించనున్నారు. పలువురు జిల్లాస్థాయి అధికారులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. పాఠశాల విద్యాశాఖ టీఆర్టీ జాబితాను ఇప్పటికే జిల్లా కమిటీకి సమర్పించింది. రోస్టర్, మెరిట్‌ ఆధారంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో జిల్లా కమిటీలు తమ పరిధిలోని సబ్జెక్టులవారీగా ఖాళీలను గుర్తించి.. వారం రోజుల్లోగా నియామక ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది.

 షెడ్యూల్‌ ఇలా..  

టీఆర్టీ నియామకాలకు సంబంధించి షెడ్యూల్‌ ఇలా ఉంది. ఎంపికైన అభ్యర్థుల లిస్టును కేటగిరీ, మీడియంవారీగా ఈనెల 10న ప్రదర్శించనున్నారు. 11న జిల్లాస్థాయి కమిటీ సమావేశమై ఖాళీల పరిస్థితిని తెలుసుకొని కేటగిరీ, మీడియంలవారీగా ఖాళీలను వెల్లడిస్తారు. 13, 14వ తేదీన అభ్యర్థులకు కేటగిరీ, మీడియంవారీగా కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. పోస్టింగ్‌ పొందిన కొత్త టీచర్లు ఈనెల 15న పాఠశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 17న జాయిన్‌ కానీ, రిపోర్టు చేయని అభ్యర్థుల వివరాలను గుర్తిస్తారు. 19న ఎంపికైన టీచర్లు జాయినింగ్‌ రిపోర్టును ఎంఈఓలు, హెచ్‌ఎంలకు అందజేయాలి.  
 

వేగవంతం చేస్తున్నాం..  

టీచర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పూర్వ ఖమ్మం జిల్లా నుంచి ఖాళీల వివరాలు సేకరిస్తున్నాం. కలెక్టర్‌ ఆర్వీ.కర్ణన్‌ ఆదేశాల మేరకు త్వరలోనే నియామకాలు చేపట్టనున్నాం. మొత్తం 130 పోస్టులను భర్తీ చేయనున్నాం.  – పి.మదన్మోహన్, జిల్లా విద్యాశాఖాధికారి  

మరిన్ని వార్తలు