రైతు కుటుంబాలను ఆదుకుంటాం

2 Nov, 2014 23:21 IST|Sakshi
రైతు కుటుంబాలను ఆదుకుంటాం

రామాయంపేట: ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మెదక్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆమె రామాయంపేటలో విలే కరులతో మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలకు సంబంధించి గతంలోఉన్న ప్యాకేజీకి అనుగుణంగా చర్యలు చేపడతామని, ఇందుకోసం సీఎం కేసీఆర్ సబ్‌కమిటీ నియమించారన్నారు.

 రైతు సంక్షేమంకోసం కృషి చేస్తామని, గ్రామాలు, పట్టణాల అభివృద్ధికిగాను ప్రతిపాదనలు తయారు చేసి సీఎంకు అందజేశామన్నారు.   మెదక్- సిద్దిపేట రోడ్డు, వడియారం- మెదక్ రోడ్డు విస్తరణతోపాటు రూ.20 కోట్లతో ఇంటర్నల్ రోడ్లను మరమ్మతు చేయిస్తామన్నారు.  మండలంలోని శివ్వాయపల్లి, సుతారిపల్లి, కోమటిపల్లి, తదితర గ్రామాల రహదార్లకు మహర్దశ పట్టనుందన్నారు.  

రామాయంపేటలోని మల్లెచెరువుకు మొదటి విడతలోనే మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. వ చ్చే మూడేళ్లలో ప్రతి ఇంటికి తాగునీటి వసతి కల్పిస్తామన్నారు. ఆహార భద్రత కార్డులు, పింఛన్ల విషయమై ఎవరూ ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు.  పాలమద్దతు ధర పెంపుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపే ప్రసక్తే లేదని, ఈవిషయమై అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.

కార్యక్రమంలో ఎంపీపీ అధ్యక్షురాలు పుట్టి విజయలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు బిజ్జ విజయలక్ష్మి, టీఆర్‌ఎస్ మండలశాఖ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, పట్టణ శాఖ అధ్యక్షుడు పుట్టి యాదగిరి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు జితేందర్‌గౌడ్, పార్టీ జిల్లా కార్యదర్శి అందె కొండల్‌రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మానెగల్ల రామకిష్టయ్య, ఎంపిటీసీ సభ్యులు శ్యాంసుందర్, మైసాగౌడ్, సర్పంచులు పాతూరి ప్రభావతి, సంగుస్వామి, మాజీ ఎంపీపీ సంపత్, ఇతర నాయకులు కొండల్‌రెడ్డి, చంద్రం, నవాత్ కిరణ్ తదితతరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు