‘కాళేశ్వరం’పై వాస్తవాల వక్రీకరణ 

30 Jun, 2019 14:34 IST|Sakshi
మాట్లాడుతున్న కూనంనేని సాంబశివరావు

రాష్ట్రానికి భారంగా మారనున్న ప్రాజెక్టు నిర్వహణ 

ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలకు గోదావరి జలాలు కష్టం 

విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని  

ఖమ్మం, వ్యవసాయం : కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరిస్తోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. శనివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్మాణ వ్యయం, నీటి లభ్యత, ఆయకట్టు తదితర అంశాల్లో ప్రభుత్వం వాస్తవాలను వెల్లడించడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదించిన ప్రాజెక్ట్‌ డిజైన్‌ను మార్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భవిష్యత్‌లో కాళేశ్వరం ద్వారా పెనుభారాన్ని మోపనుందని, నిర్వహణకు ఏటా రూ.10 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని, ప్రాజెక్ట్‌ వ్యయాన్ని రూ.35 వేల కోట్ల నుంచి రూ.80 వేల కోట్లకు పెంచారని, తద్వారా అదనపు సాగు ఏం లేదని విమర్శించారు. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు 60 శాతం మాత్రమే పూర్తయ్యాయని పేర్కొన్నారు. అన్నారం, సుందేళ్ల, మేడిగడ్డ ఎత్తిపోతల పథకాలకు అయ్యే విద్యుత్‌కు ఏటా వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

మొత్తం ప్రాజెక్టులో సాగునీటికి 164 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించనున్నారని, ఆ నీటిని ఎన్ని లక్షల ఎకరాలకు ఇస్తారని ప్రశ్నించారు. నూతన ఆయకట్టు, స్థిరీకరణ రెండు అంశాల్లో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలకు గోదావరి జలాలు అందే అవకాశం లేదన్నారు. ఈ ఏడాది నీరు లేక అశ్వాపురం భారజల కర్మాగారం పనిచేయలేదని, భవిష్యత్‌లో ఇదే పరిస్థితి ఎదురవుతుందని స్పష్టం చేశారు. రూ.13 వేల కోట్ల అంచనాలతో నిర్మించనున్న సీతారామ ప్రాజెక్టు కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందన్నారు. సముద్రంలో ఏటా వందల టీఎంసీల నీరు చేరుతోందని, మేడిగడ్డ దిగువ భాగం, సీతారామ ఎగువ భాగంలో రిజర్వాయర్‌ను నిర్మించి నీటిని నిల్వ చేయాలని డిమాండ్‌ చేశారు. ఖమ్మం జిల్లాకు సాగునీటి అవసరాలను విస్మరిస్తే సీపీఐ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ల పేరుతో వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. రాముడు ఇటు, రామయ్య ఆస్తులు అటు ఉన్నాయన్నారు. సమావేశంలో బాగం హేమంతరావు, పోటు ప్రసాద్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు