రోగాలకు నిలయం

26 Jun, 2019 10:27 IST|Sakshi
నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆస్పత్రి

అపరిశుభ్రంగా ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణం 

నిండిన చెత్తాచెదారం, పందుల స్వైరవిహారం  

సాక్షి, నాగర్‌కర్నూల్‌ : జిల్లా కేంద్రంలోని పభుత్వ ఆస్పత్రి అపరిశుభ్రతకు నిలయంగా మారింది. నిత్యం పందుల సంచారంతో రోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రోగుల బంధువులు వంట చేసుకునే క్రమంలో పందుల సంచారంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రి ప్రాంగణం వెనక భాగంంలో మురుగు పూర్తిగా పేరుకుపోవడంతో ముక్కు పుటలు అదిరేలా వాసన వస్తోంది.

మున్సిపల్‌ అధికారులు చెత్తను తొలగించి డ్రెయినేజీని శుభ్రం చేయాలని ఎన్ని వినతులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆస్పత్రి వైద్యాధికారులే చెబుతున్నారు. దీంతో రోగం నయం చేసుకునేందుకు వస్తే కొత్తరోగాలను కొని తెచ్చుకునే పరిస్థితి తయారైందని రోగులు మండిపడుతున్నారు. లక్షల నిధులున్నా అధికారులు, ప్రజాప్రతినిదులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. 

ఆస్పత్రిలో వైద్యుల కొరత  
జనరల్‌ ఆస్పత్రిలో దాదాపు 28 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, కేవలం 8 మంది మాత్రమే కాంట్రాక్ట్‌ పద్ధతిన పనిచేస్తున్నారు. ప్రసవాలు చేయడానికి సరిపడ వైద్యులను నియమించకపోవడంతో గర్భిణులను ఇతర దవాఖానలకు రెఫర్‌ చేస్తున్నారు. 

జాడలేని అభివృద్ధి కమిటీ 
జిల్లా కేంద్రంగా మారి జిల్లా ఆస్పత్రిలా పేరు మారిందే తప్పా పనితీరులో మార్పు రాలేదని పట్టణ వాసులు అంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధికి కమిటీని ఏర్పాటు చేయాలి కాని నేటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. వచ్చిన నిధులన్నీ ఎక్కడ ఖర్చు చేస్తున్నారే అడిగే నాథుడే లేడు. దీంతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది.

ఏళ్ల తరబడి నిర్మించిన తాగునీటి పైపులైన్‌ ప్రస్తుతం పూర్తిగా మూసుకుపోవడంతో వార్డుల్లో నీరు అందడం లేదు. దీంతోపాటు ఆస్పత్రిలోని మరుగుదొడ్లు శుభ్రపరచడంలో శానిటరి సిబ్బందిసైతం అలసత్వం కారణంగా దుర్వాసన వస్తు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రోగులు మండిపడుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్‌ వ్యాధులు రోగులపై విజృంభించి ప్రతిరోజూ ఇన్‌పేషెంట్లు 80కి పైగా ఉండగా ఔట్‌ పేషెంట్లు 2,100 పైచిలుకు వస్తున్నారని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో అపరిశుభ్రంగా ఆస్పత్రి ఆవరణం ఉంటే కొత్త రోగాలు వచ్చే పరిస్థితి లేదా అని ప్రశ్నిస్తున్నారు.

మున్సిపల్‌ అధికారులకు విన్నవించాం 
ఆస్పత్రి ఆవరణలో చెత్త తొలగింపు, మురుగు శుభ్రతం చేయాలని పలు మార్లు మున్సిపాలిటీ అధికారులకు విన్నవించాం. వారు స్పందించడం లేదు. ఆస్పత్రి వెనక భాగంలో మురుగు చాలా పేరుకుపోయింది. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించాం. 
– ప్రభు, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి    

మరిన్ని వార్తలు