ప్రైవేట్‌ ‘సేవ’లో

29 Oct, 2018 12:45 IST|Sakshi
జిల్లాకేంద్ర ఆసుపత్రి

ఈ ఫొటోలో కనిపిస్తున్నది జిల్లాకేంద్ర ఆసుపత్రి.. ఆవరణలో నిలిచి ఉన్న వాహనాలు ప్రైవేటు ఆసుపత్రుల అంబులెన్స్‌లు. ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలో ఈ వాహనాలేంటి..? అనుకుంటున్నా రా.. ప్రమాదంబారిన పడిన రోగులను తీసుకొచ్చే 108 సిబ్బంది కోసం.. ప్రభుత్వ వైద్యులు రెఫర్‌ చేసే కేసుల కోసం ఇలాంటి వాహనాలు ఇక్కడ నిలిపి ఉండడం ఆసుపత్రి వద్ద నిత్యకృత్యం. 

కరీంనగర్‌హెల్త్‌: పెద్దపల్లి బ్రిడ్జి సమీపంలో ఇటీవల ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. మంథని రోడ్డువైపు ప్యాసింజర్లతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న వ్యాన్‌ ఢీకొట్టింది. ఆటోలో డ్రైవర్‌ పక్కన కూర్చున్న ప్రైవేటు ఉద్యోగి కటుకూరి చందుకు తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన సిబ్బంది మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు రెఫర్‌ చేశారు. అదే వాహనంలో కరీంనగర్‌కు బయలుదేరారు. దారి మధ్యలో.. ముఖానికి చాలావరకు గాయాలయ్యాయని.. రక్తంకూడా ఎక్కువగా పోయిందని.. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే అంతంత మాత్రంగానే వైద్యసేవలు అందుతాయని సదరు అంబులెన్స్‌ సిబ్బంది రోగి బంధువులను భయపెట్టారు. దీంతో హైరానాపడిన బంధువులు ఏదైనా మంచి ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని కోరారు.

‘మనకు తక్కువ ఖర్చులో వైద్యంచేసే మంచి హాస్పిటల్‌ ఉంది. కానీ.. 108లో ప్రభుత్వ ఆస్పత్రికే తీసుకెళ్లాలి. అక్కడినుంచి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ ఏర్పాటు చేస్తాం. అంతా మేం చూసుకుంటాం..’ అని ప్రభుత్వ ఆస్పత్రికి చేర్చారు. అక్కడికి చేరుకోగానే అప్పటికే ఓ ప్రైవేటు ఆస్పత్రి అంబులెన్స్‌ సిద్ధంగా ఉంచారు. వెంటనే అక్కడి నుంచి వారిని తీసుకెళ్లి ప్రైవేటులో చేర్పించారు. విచిత్రం ఏంటంటే.. ఆ ప్రైవేటు ఆస్పత్రికి తరలించేందుకు స్వయంగా 108 సిబ్బంది ఒకరు సాయం అందించడం. క్షతగాత్రుడిని ఎమర్జెన్సీలోకి తరలించిన వెంటనే ఆస్పత్రి యాజమాన్యం అందించిన రూ.5వేల కవర్‌ను తీసుకుని అక్కడినుంచి జారుకున్నట్లు సమాచారం. ఈ ఒక్క సంఘటన చాలు 108 సిబ్బంది అత్యవసర సమయంలో ఉన్నవారిని ప్రైవేటు ఆస్పత్రులకు ఎలా తరలిస్తున్నారో చెప్పడానికి.

వైద్యసేవల ముసుగులో జిల్లాలో దళారీ రాకెట్‌ వ్యవస్థ నడుస్తోంది. దళారీ వైద్య వ్యవస్థలో అంబులెన్స్‌ నిర్వాహకులే ప్రధానపాత్ర పోషిస్తూ ప్రజలను దోపిడీకి గురిచేస్తున్నారు. ఈ దళారీ వ్యవస్థను జిల్లాకేంద్రంలోని సూపర్‌స్పెషాలిటీ, మల్టీస్పెషాల్టీ ఆసుపత్రులుగా చెప్పుకునే నిర్వాహకులే పెంచిపోషిస్తున్నారంటే అతిశయోక్తి కలగక మానదు. ఈ దందా ఒకటికాదు.. రెండుకాదు.. ఏకంగా పదేళ్లుగా కొనసాగుతుండడంతో అంబులెన్స్‌ నిర్వాహకులు తమను ఎవరూ ఏమిచేయలేరు.. అన్నట్లు మారింది. వీరితోపాటు ప్రైవేటు హాస్పిటల్‌ నిర్వాహకులూ వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకునే వైద్యాధికారులను సైతం తమ కనుసన్నల్లోకి తిప్పుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పదేళ్లుగా వేళ్లూనుకుపోయిన ఈ దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ చికిత్స పేరుతో ప్రజల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారు.

అంబులెన్స్‌లే దళారీలు..
జిల్లా కేంద్రంలో హంగుఆర్భాటాలతో నడిపిస్తున్న ప్రైవేటు హాస్పిటల్స్‌ యాజమాన్యాలకు అంబులెన్స్‌ నిర్వాహకులు దళారులుగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవస్థలో రెండు రకాలు. మొదటిది రోగాలబారిన పడిన వారిని నమ్మించి ప్రైవేటు కార్పొరేట్‌ హాస్పిటల్‌లో చేర్పించడం. రెండోది ప్రమాదంలో గాయపడి.. ఆపదలో ఉన్నవారికి మాయమాటలు చెప్పి భారీగా కమీషన్లు ఇచ్చే ఆస్పత్రుల్లో చేర్పించడం. ఉన్నట్టుండి తీవ్ర కడుపునొప్పి రావడం, గుండెపోటు, విషం తాగిన వంటి కేసులు స్థానిక అంబులెన్స్‌లను ఆశ్రయిస్తుంటారు.

వీరి ఆపద, ప్రమాదస్థాయిని ఆసరాగా చేసుకుని ఆ స్థాయి ఆస్పత్రికి తరలిస్తుంటారు. మంచి డాక్టర్‌ ఉన్న ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తానని చెప్పి ‘మీ ప్రాణాలకు ఢోకాలేదు..’ అని నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. ఇలా ప్రజలను నమ్మించి ఎక్కువ కమీషన్లు వచ్చే హాస్పిటల్‌లో చేర్పిస్తారు. బాధితులతో అంబులెన్స్‌ అక్కడికి చేరుకోగానే హాస్పిటల్‌ వద్ద డాక్టర్, నర్సు, బాయ్స్‌తో కలిసి హంగామా చేస్తుంటాడు. వాహనం ఆగడంతోనే బాధితులను స్ట్రచ్చర్‌పై వేసి లోనికి పంపించి ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న ప్రకారం కమీషన్‌ జేబులో వేసుకుని కనిపించకుండా వెళ్లిపోతారు.

అంబులెన్స్‌ల హవా..
ప్రైవేటు ఆసుపత్రుల సంఖ్య పెరగడంతోపాటు వారిలో పోటీ నెలకొనడంతో ఈ మధ్యకాలంలో అంబులెన్స్‌ల దళారీ వ్యవస్థ మొదలైంది. గ్రామీణ ప్రాంతాల నుంచి కేసులను తీసుకువచ్చిన అంబులెన్స్‌ నిర్వాహకులకు కమీషన్లు ఇచ్చేవారు. కొన్ని  కార్పొరేట్‌ ఆస్పత్రులకు మాత్రమే సొంత అంబులెన్స్‌లు ఉండేవి. ఇవి కూడా అనుబంధంగా మాత్రమే నడిచేవి. ఇపుడు ప్రతి హాస్పిటల్‌కు ఒకటి, పెద్ద ఆస్పత్రులకు నాలుగైదు అంబులెన్స్‌లు ఉంటున్నాయి. వీటితోపాటు మండల హెడ్‌క్వార్టర్స్‌లో కూడా అంబులెన్స్‌లో ఏర్పాటు చేస్తున్నారు.

అయితే.. ఎక్కువ కేసులు తమ హాస్పిటల్‌కే పంపించాలని అంబులెన్స్‌ వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎక్కువ సంఖ్యలో కేసులు తీసుకువస్తే ఒక కొత్త అంబులెన్స్‌ వాహనం గిఫ్టుగా ఇస్తామని ఒప్పందం చేసుకుంటున్నారు. ఈ ఒప్పందం కారణంగానే డ్రైవర్లుగా ఉన్న వారు అంబులెన్స్‌ ఓనర్లు అయ్యారు. జిల్లాలో మూడు వందలకుపైగా ప్రైవేటు అంబులెన్స్‌లు ఉన్నాయి. వీటిలో సగం కంటే ఎక్కువ జిల్లా కేంద్రంలో ఆయా ఆస్పత్రుల పేర్లతో కనిపిస్తుంటాయి.

ప్రభుత్వాస్పత్రి చుట్టూ..
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రి చుట్టు ప్రజలను భయాందోళనకు గురిచేసేలా ప్రైవేటు అంబులెన్స్‌లు మోహరిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి ప్రహారీ గోడ చుట్టు కనీసం 50వరకు ప్రైవేటు అంబులెన్స్‌లు ఏర్పాటు చేసుకుని నిర్వాహకులు రోగులకోసం వార్డుల్లో తిష్టవేసి తిరుగుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి ఏదైనా సీరియన్‌ కేస్‌ వచ్చిందంటే చాలు వారిని ప్రైవేటుకు తరలించుకుపోయే చర్యలు చేపడుతున్నారు. అందుబాటులోనే మంచి డాక్టర్‌ ఉన్నాడని, తక్కువ ఖర్చులో చేపిస్తామంటూ కమీషన్ల కోసం మాయమాటలతో వారిని ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్చుతున్నారు.

ఫిర్యాదులు అందితే చర్యలు: బాలక్రిష్ణ, 108 ఐదు జిల్లాల ఇన్‌చార్జి, ప్రోగ్రాం మేనేజర్‌
108 సిబ్బంది క్షతగాత్రులను ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లినట్లు ఫిర్యాదులు అందితే విచారణ చేపట్టి  చర్యలు తీసుకుంటాం. తప్పనిసరిగా అందుబాటులో ఉన్న ప్రభు త్వ ఆస్పత్రికి మాత్రమే తీసుకువెళ్లాలి.  బా ధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండి బంధువులు ప్రైవేటుకు తీసుకువెళ్లాలని కోరితే  ఉన్నతాధికారుల అనుమతితోనే ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకుపోతుంటారు. ప్రైవేటుకు వెళ్లాలని సూచించడం.. ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదులు ఏమీ అందలేదు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా