పశువుల కాపరిని... పసిపాపల వైద్యుడ్ని అయ్యా....

9 Dec, 2014 11:15 IST|Sakshi
పశువుల కాపరిని... పసిపాపల వైద్యుడ్ని అయ్యా....

సర్కారు దవాఖానాల ప్రక్షాళన

నరకకూపాలుగా ఉన్న  సర్కారు దవాఖానాలను సమూలంగా ప్రక్షాళన చేస్తానని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. మెదక్ జిల్లా మోమిన్ పేట మండల పరిధిలోని మేకవనంపల్లిలో నిర్మించిన మేథడిస్టు చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో  మాట్లాడుతూ అభివృద్ధి చర్యల్లో భాగంగా జిల్లా ఆస్పత్రికి రూ.25 కోట్ల చొప్పున, ఇతర ఆస్పత్రులు ఒక్కోదానికి రూ.కోటి చొప్పున  నిధులు మంజూరు చేస్తున్నామన్నారు.

క్షేత్రస్థాయిలోని ఆస్పత్రులలో నిద్రిస్తేనే సమస్యలు తెలుస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి దళిత, గిరిజన పక్షపాతి అన్నారు. వచ్చే ఐదేళ్లలో రూ.50వేల కోట్లతో దళితులు, రూ.25వేల కోట్లతో బీసీలు, రూ.15వేల కోట్లతో గిరిజనులు, రూ.15వేల కోట్లతో మైనార్టీల అభివృద్ధికి నిధులు ఖర్చు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం అమలు చేయనున్న పలు పథకాల గురించి వివరించారు.  

పశువుల కాపరిని... పసిపాపల వైద్యుడ్ని అయ్యా....
పశువుల కాపరియైన తాను పసిపాపల వైద్యుడ్ని అయ్యానని ఆయన చిన్నప్పటి స్మృతులను రాజయ్య గుర్తుచేసుకున్నారు. పట్టుదల, అత్మవిశ్వాసం, క్రమశిక్షణలతో ఎదైనా సాధించవచ్చన్నారు.  పొరుగు వారిని నిండు మనసుతో ప్రేమించాలని ఆయన కోరారు.

మోమిన్‌పేటలో 30పడకల ఆస్పత్రికి హామీ
మోమిన్‌పేట మండల కేంద్రంలో ఉన్న ఆరు పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వసతులు అంతంత మాత్రంగానే ఉన్నందున రోగులకు వైద్యం పూర్తి స్థాయి లో అందడం లేదని స్థానిక ఎమ్మెల్యే సంజీవరావు, ఎంపీపీ నిఖితారెడ్డిలు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా  వెంటనే స్పందించిన ఆయన  30పడకల ఆస్పత్రి మంజూరుకు హామీ ఇచ్చారు. అందుకు రూ.1.20కోట్లు ఆవసరమవుతాయని, వెంటనే మంజూరు చేస్తానని పేర్కొన్నారు. 

అంతకు ముందు చర్చిలో మినీ క్రిస్ట్‌మస్ సందర్భంగా కేక్‌ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సీ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య,  మండల పరిషత్ ఉపాధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, మార్కెటు కమిటీ  చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ శంకర్, ఎంపీటీసీ సభ్యులు భాస్కర్, రాములమ్మ, చర్చి నిర్మాణ కర్త సంజీవరావు,పాస్టరు పద్మాకర్, నాయకులు సంగారెడ్డి, లక్ష్మయ్య, నరేందర్‌రెడ్డి, మహంత్‌స్వామి, లక్ష్మారెడ్డి, చంద్రయ్య,  ఆనందం, ప్రతాప్‌రెడ్డి, చెన్న తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు