ఖాళీగానే కొత్త పుష్కరిణి !

20 Feb, 2018 16:15 IST|Sakshi
పాత కొనేరులో స్నానాలు ఆచరిస్తున్న భక్తులు, వృథాగా ఉన్న నూతన కోనేరు

పాత కోనేరులోనే భక్తుల స్నానాలు

కోట్లు వెచ్చించినా నిరుపయోగమే

పట్టించుకోని అధికారులు

కొండగట్టు(చొప్పదండి): భక్తుల కొంగుబంగారంగా నిలుస్తున్న కొండగట్టు అంజన్న కొండపై అడుగడుగునా సమస్యలే ఎదురవుతున్నాయి. రూ.1.21కోట్లతో నిర్మించిన కొత్త పుష్కరిణిలో నీళ్లు లేక పాత కోనేరులోనే భక్తులు స్నానాలు చేస్తున్నారు. మరికొందరైతే తాగునీటి నల్లా వద్ద మగ్గులతో పట్టుకొని స్నానాలు కానిచ్చేస్తున్నారు. ఇదంతా అధికారులు చూస్తున్నా కొత్త పుష్కరిణిలో నీళ్లు నింపేందుకు చర్యలు తీసుకోవడం లేదు. కోట్లు వెచ్చించి నిర్మించినా మూడేళ్లుగా నిరుపయోగంగానే పడి ఉంటుంది.  

నల్లాలే దిక్కు
కొండగట్టులో నూతన పుష్కరిణిని ప్రారంభించకపోవడంతో భక్తులు పాత కోనేరుతోపాటు తాగునీటి నల్లాల వద్ద స్నానాలు చేస్తున్నారు. మరికొందరు సమీపంలో టెండరు స్నానాల గదుల్లోకి వెళ్తున్నారు. అంతేకాకుండా పాత కోనేరులోనైనా నీటిని ఎప్పటికప్పుడు తొలగించడం లేదు. దీంతో కొన్ని రోజులుగా అందులో నీరు మురికిగా మారింది. అయినా అధికారులు స్పందించడం లేదు.  

కొత్త కోనేరు ప్రముఖులకేనా?
కొత్త కోనేరును వినియోగంలోకి తెచ్చేందుకు నీటి సమస్య ఉందంటున్న అధికారులు ప్రముఖులు వస్తే మాత్రం ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. భక్తులకు పాత కోనేరు..ప్రముఖులకు కొత్త కోనేరు రీతిన వ్యవహరించడంపై ఆలయ అధికారులపై విమర్శలు వస్తున్నాయి.   

చిన్నచూపు
అంజన్న ఆలయంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది. ఎంపీ కవిత ఆలయ అభివృద్ధికి చెప్పిన మాటలు నీటిమూటలుగా మారాయి. యాదాద్రి, వేములవాడ తరహాలోనే కొండగట్టును అభివృద్ధి చేయాలి. రూ.500కోట్లు కేటాయించి, ఐఏఎస్‌ అధికారిని నియమించాలి.   
మేడిపెల్లి సత్యం, కాంగ్రెస్‌ నాయకుడు   

గత ప్రభుత్వంలోని అభివృద్ధే..
గత ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధే. ప్రస్తుతం ఎలాంటి పనులు చేయలేదు. కనీసం కొత్త కోనేరులో నీరు సైతం నింపడం లేదు. ఆదాయం పెరుగుతున్నా భక్తులకు కనీస అవసరాలు తీర్చడం లేదు. ఇప్పటికైనా పాత కోనేరులో నీరు పరిశుభ్రంగా ఉండేలా చూడాలి.   
గాజుల శంకర్‌గౌడ్, ఆలయ మాజీ పాలకవర్గం డైరెక్టర్‌  

 

మరిన్ని వార్తలు