బతుకమ్మ చీరల వేళాయె

23 Sep, 2019 12:18 IST|Sakshi

నేడు ఖమ్మంలో పంపిణీకి  శ్రీకారం చుట్టనున్న మంత్రి పువ్వాడ అజయ్‌ 

సాక్షి, ఖమ్మం: దసరా పండుగను పురస్కరించుకొని మహిళా మణులకు ప్రభుత్వం చీరలను కానుకగా అందజేయబోతోంది. రేషన్‌కార్డుల లబ్ధిదారులను అర్హులుగా ఇప్పటికే ఎంపిక చేయగా..జిల్లాలోని 21 మండలాల్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. పౌర సరఫరాల శాఖ వారు ఇచ్చిన వివరాల ప్రకారం కలెక్టరేట్‌ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఆ మేరకు జిల్లాకు చీరలు అందాయి. మొత్తం 4,74,116మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ఇప్పటి వరకు 3.50లక్షల చీరలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో మిగతావి కూడా రానున్నాయి.

ఈ నెల 23వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు అంతా సిద్ధం చేశారు. వీటిని పర్యవేక్షించేందుకు ఇన్‌చార్జ్‌ అధికారులను సైతం నియమించారు. వారంతా ప్రతిరోజూ ఎన్ని చీరలను పంపిణీ చేశారనే వివరాలను కలెక్టరేట్‌కు సమాచారం అందించనున్నారు. జిల్లాలో గుర్తించిన లబ్ధిదారుల వివరాల ఆధారంగా పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలోని 21మండలాల పరిధిలోని తహసీల్దార్‌ కార్యాలయాలకు, అక్కడి నుంచి గ్రామాలకు సరఫరా చేశారు. జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సోమవారం (నేడు) ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ప్రారంభించనున్నారు.

అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యే అవకాశం ఉంది. మంత్రి ప్రారంభించిన అనంతరం జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులకు చీరలను పంపిణీ చేయనున్నారు. వీఆర్వోలు ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో చీరలను అందుబాటులో ఉంచగా రేషన్‌డీలర్, అంగన్‌వాడీ టీచర్ల ద్వారా పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులు వారి వెంట ఆధార్‌కార్డు లేదంటే ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది. 

మరిన్ని వార్తలు