తెలంగాణ వారైనా స్థానికేతరులే

14 Oct, 2016 04:18 IST|Sakshi
తెలంగాణ వారైనా స్థానికేతరులే

కోరుకొండ సైనిక్ స్కూల్‌లో చదివితే అలాగే గుర్తింపు
 ఆందోళనలో పూర్వ విద్యార్ధులు

 
 మిర్యాలగూడ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏకైక కోరుకొండ సైనిక్ స్కూల్‌లో చదివిన తెలంగాణ విద్యార్థులు నాన్‌లోకల్ శాపగ్రస్తులుగా మిగిలారు. సొంత రాష్ట్రంలో ఉండి కూడా నాన్‌లోకల్‌గా ముద్రపడి ఉద్యోగాలకు అనర్హులుగా మిగిలారు. రాష్ట్ర  విభజన నాటికి కోరుకొండ సైనిక్ స్కూల్‌లో తెలంగాణ ప్రాంతం నుంచి సుమారుగా 500 మంది విద్యార్థులు 12వ తరగతి పూర్తి చేశారు. ఇందులో కొంత మంది ఉద్యోగాలు సాధించగా.. మరికొంత మంది ప్రైవేట్ ఉద్యోగాలు చేయడంతోపాటు ఉన్నత చదువులు చదువుతున్నారు.
 
 కానీ.. తెలంగాణ ప్రాంతంలో ఇటీవల ఉద్యోగాలకు నిర్వహించిన పోటీ పరీక్షల్లో మాత్రం విజయనగరం జిల్లా కోరుకొండలో చదివిన వారిని స్థానికేతరులుగా గుర్తించారు. తెలంగాణలో పుట్టి పెరిగిన వారు అయినప్పటికీ.. చదువురీత్యా ఉమ్మడి రాష్ట్రంలో కోరుకొండ స్కూల్‌లో చదవడం వల్ల స్థానికేతరులుగా గుర్తింపు ఇస్తున్నారు. దీంతో సైనిక్ స్కూల్‌లో చదివిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
 
 జీఓ జారీ చేస్తేనే తీరనున్న కష్టాలు
 విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్‌లో చదివిన తెలంగాణ విద్యార్థులను కూడా స్థానికులుగా పరిగణించడానికి ప్రభుత్వం ప్రత్యేక జీఓ జారీ చేయాల్సి ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు, వారి నివాసం, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, పుట్టిన తేదీ సర్టిఫికెట్ల ఆధారంగా లోకల్ సర్టిఫికెట్ జారీ చేయాలి. అందుకుగాను ప్రత్యేకంగా జీఓ జారీ చేయాలని..అలా చేస్తేనే  సైనిక్ స్కూల్ విద్యార్థులకు న్యాయం జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

 ప్రభుత్వం లోకల్‌గా గుర్తించాలి
 మాది తెలంగాణ. మా తల్లిదండ్రులు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఉంటారు. మేము మెరుగైన విద్య కోసం కోరుకొండ సైనిక్ స్కూల్‌లో ప్రవేశపరీక్ష ద్వారా సీటు సాధించా. ఆరు నుంచి 12వ తరగతి వరకు అక్కడే చదివా. కోరుకొండలో చదవడం వల్ల రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నాన్‌లోకల్‌గా పరిగణిస్తున్నారు. మా సొంత రాష్ట్రంలో మమ్మల్ని లోకల్‌గా గుర్తించాలి. - వినోద్‌కుమార్, బీటెక్ ఫైనల్ ఇయర్, మిర్యాలగూడ
 
 నాన్ లోకల్ అనడం అన్యాయం
 తెలంగాణ ప్రాం తానికి చెందిన వారమైనా విజయనగరం జిల్లా కోరుకొండలో చదడవం వల్ల నాన్‌లోకల్‌గా పరిగణించడం అన్యాయం. ఐదో తరగతి వరకు తెలంగాణాలోనే చదువుకున్నాం. సైనిక్ స్కూల్‌లో ప్రవేశపరీక్ష ద్వారా చేరి 12వ తరగతి వరకు చదివాం. దీంతో మమ్ములను తెలంగాణా వారు కాదని నాన్‌లోకల్‌గా పరిగణించడం సరికాదు. ప్రభుత్వం లోకల్‌గా గుర్తించి న్యాయం చేయాలి. - హరిహర భార్గవ, బీటెక్ ద్వితీయ సంవత్సరం, మిర్యాలగూడ

మరిన్ని వార్తలు