భూ క్రమబద్ధీకరణకు రంగం సిద్ధం

9 Jan, 2015 10:20 IST|Sakshi

చెన్నూర్: భూ క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం మార్గదర్శకాలనూ విడుదల చేసింది. జీవో ఎంఎస్ నం.58, 59 గత ఏడాది డిసెంబర్‌లో జారీ చేసింది. వారం రోజులు గడవకముందే ప్రభుత్వ భూ ఆక్రమణదారులపై కేసు నమోదు చేయడంతో ప్రభుత్వ భూకబ్జాదారుల గుండెల్లో దడ మొదలైంది. గతంలో కొందరు రియల్టర్లు అధికారుల అండదండలతో ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా కబ్జా చేసి విక్రయించారు. దీంతో వేలాది ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. ఫలితంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించుకునేందుకు భూమి లేని దుస్థితి ఏర్పడింది. కబ్జాదారుల భరతం పట్టేందుకు భూ క్రమబద్ధీకరణ పటిష్టంగా నిర్వహించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులపై కొరడా ఝలిపించేందుకు సన్నద్ధమవుతున్నారు.

వేలాది ఎకరాలు వెలుగులోకి..
భూ క్రమబద్ధీకరణతో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు వెలుగులోకి వస్తాయి. చెన్నూర్ పట్టణంలో జాతీయ రహదారి నిర్మాణంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా ఆక్రమణలకు పాల్పడ్డ అక్రమార్కులు బండారం బయటపడనుంది. ఆక్రమణదారుల వద్ద భూములు కోనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్న వారూ ఇబ్బందుల పాలు కానున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ఇల్లు నిర్మించుకున్న వారు సైతం అన్ని ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండి మార్కెట్ విలువ ప్రకారం భూమి ధర నుంచి 50, 75 శాతం చెల్లించాల్సి ఉంది. దీంతో ప్రభుత్వ భూములు కొనుగోలు చేసిన వారు రెండు విధాలుగా నష్టాపోవాల్సి వస్తుంది. రాయల్టీ చెల్లించనట్లయితే ఆ కట్టడాలతో సహా ఆక్రమించుకుంటామని ప్రభుత్వం ప్రకటించడంతో నిర్మాణదారులు లబోదిబోమంటున్నారు.
 
ఎంతటి వారైనా వదిలేది లేదు..

ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్న వారు ఎంతటి వారైనా వదిలేది లేదు. గడువులోగా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోవాలి.  పట్టణ సమీపంలోని 869 సర్వే నంబర్‌లో ఎకరం భూమిని ఆక్రమించుకున్న తబస్సమ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఆమె కట్టుకున్న అక్రమ కట్టడాలను తొలగిస్తాం. ప్రభు త్వ భూమిని ఆక్రమించుకున్న ప్రతీ వ్యక్తిపై చర్యలు తీసుకుంటాం. - హన్మంతరావు, తహశీల్దార్, చెన్నూర్.

మరిన్ని వార్తలు