ఎక్కడ చూసినా సర్కార్ భూములే!

23 Feb, 2015 04:07 IST|Sakshi
ఎక్కడ చూసినా సర్కార్ భూములే!

ఈ భూమి విలువ రూ.350 కోట్లు
ఇదిగో.. ఈ ఫొటోలో కనిపిస్తున్న భూమి విలువ రూ.350 కోట్లు.  అమీన్‌పుర్‌లోని 993 సర్వే నంబర్‌లో ఉంది. మొత్తం 110 ఎకరాలు. కబ్జా కబంధ హస్తాల నుంచి బయటపడి, ఇటీవలే ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కింది. కబ్జాదారులను బలవంతంగా  వెళ్లగొట్టారు. చైనా వాల్ మాదిరిగా చుట్టూ పటిష్టమైన గోడ కట్టారు.

 
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెతుకు సీమలో ఎక్కడ చూసినా.. ప్రభుత్వ భూములే కనిపిస్తున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ సమీక్షలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా యంత్రాంగం స్పందించి, ప్రభుత్వ భూముల గుర్తింపు వేట ఆరంభించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1 లక్షా 59 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించింది.
 
ఈ భూముల విలువ సుమారు రూ.75 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ప్రత్యేక చొరవతో అనతి కాలంలోనే ఇంత భారీస్థాయిలో ప్రభుత్వ భూమిని గుర్తించడమేగాక స్వాధీనం కూడా చేసుకున్నారు. అనంతరం వీటి వివరాలను ప్రభుత్వ రికార్డుల్లో పొందుపరిచి ప్రభుత్వానికి నివేదిక అందించారు. కంది గ్రామ సర్వే నంబర్ 400 సీరీస్‌లో 12 నంబర్లతో 200 ఎకరాలు.. నర్సాపూర్ పట్టణం 76 సర్వే నెంబర్‌లో 48 ఎకరాలు.. కాజిపల్లి పారిశ్రామికవాడ సర్వే నంబర్ 181లో 25 ఎకరాలు.. ముత్తంగి గ్రామంలో 25 ఎకరాలు.. రామచంద్రాపురంలో 60 ఎకరాలు ఇలా ఒక్కొక్క ఎకరాను లెక్కగట్టి చూస్తే మెదక్ జిల్లా వ్యాప్తంగా 1 లక్షా 59 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టు జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ నిర్ధారించారు.

దీని విలువ రూ.70 నుంచి రూ.75 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. గ్రేటర్ హైదరాబాద్‌కు సమీపంలోని పటాన్‌చెరు, గజ్వేల్, నర్సాపూర్, సంగారెడ్డి నియోజకవర్గాల్లోనే 60 శాతం ప్రభుత్వ భూములు ఉన్నాయి. ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకున్న 1 లక్షా 59 వేల ఎకరాల  భూమిలో 1,620 ఎకరాలు అత్యంత విలువైనదిగా, 3,500 ఎకరాలు జనావాసాలకు సమీపంలో ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పనికి వచ్చే విలువైన భూమిగానూ 16,551 ఎకరాలు పారిశ్రామిక వాడలకు, 35 వేల ఎకరాలు హెచ్‌ఎండీఏ అవసరాలకు, మిగిలిన భూమి వ్యవసాయానికి ఉపయోగపడేదిగానూ గుర్తించారు. ఈ భూములకు రెవెన్యూ రికార్డులు సరిగా లేకపోవడం, ఐఏఎస్ అధికారులకు రెవెన్యూ రికార్డులు, వాటి అమలు తీరుపై సమగ్రమైన పట్టు లేకపోవడం, పైగా రెవెన్యూ శాఖలోనే కింది స్థాయి అధికారులు కబ్జాదారులకు అండగా నిలబడటంతో ప్రభుత్వ భూమిపై ప్రైవేటు వ్యక్తులు పట్టుబిగిస్తూ వచ్చారు.
 
ఓ యజ్ఞమే జరిగింది...
ప్రభుత్వ భూముల గుర్తింపు వెనుక జాయింట్ కలెక్టర్ శరత్ ఓ యజ్ఞమే చేశారు. ఏడు రికార్డుల విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ముందుగా ప్రతి రైతుకు రెవెన్యూ సహకారాన్ని అందించారు. రికార్డులన్నీ భూ యజమానులకు అందేలా చేశారు. తరువాత ఒక్కో నియోజక వర్గాన్ని  లక్ష్యంగా చేసుకున్నారు. ఎంచుకున్న  నియోజకవర్గంలోని ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు, కబ్జాలో ఉన్నవారి వివరాలు, కబ్జాకు అనుకూలించిన పరిణామాలు తదితర వివరాలను ముందుగా సేకరించారు.

రెండో దశలో ‘మీరు ఆక్రమణలో ఉన్నది ప్రభుత్వ భూమి కాదు అని నిరూపించడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటో చూపించాలి’ అని ఆయా వ్యక్తులకు నోటీసులు పంపిచారు. ఈ తంతుతో భూ బకాసురుల బండారం బయటకు వచ్చింది. ఆధారాలు చూపిన వారిని వదిలేసి మిగిలిన వారిమీద పడ్డారు.  మూడో దశలో పోలీసుల సహకారం తీసుకొని నిర్ధారించిన ప్రభుత్వ భూముల చుట్టూ కంచె వేయించారు.

మరిన్ని వార్తలు