సంక్షేమానికి మరుగుదొడ్డితో లింక్‌

20 Jun, 2019 15:45 IST|Sakshi

మరుగుదొడ్డి నిర్మించుకోని  వారికి రేషన్‌... పెన్షన్‌ కట్‌

ఈనెల 30లోపు నిర్మాణాలు  పూర్తి చేయాలి  

సాక్షి, నల్లగొండ : మరుగుదొడ్డి నిర్మించుకోకపోతే జూలై నుంచి సంక్షేమ పథకాలు కట్‌ అవుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌ మిషన్‌ గ్రామీణ పథకం కింద  గ్రామీణ ప్రాంతంలోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు మరుగుదొడ్డి నిర్మించాలని 2014 సంవత్సరంలో పథకాన్ని ప్రవేశపెట్టారు. నిర్మించుకున్న ప్రతి లబ్ధిదారునికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.12వేలు చెల్లిస్తారు. అయితే పథకం ఈనెల చివరి నాటికి పూర్తవుతుంది. దాంతో ఆ తర్వాత నిర్మించుకున్న మరుగుదొడ్డికి కేంద్ర నిధులు అందే అవకాశం లేదు. ఆ స్కీం సమయం పూర్తవుతున్నందున ఈలోపు నిర్మించుకుంటేనే ఇటు మరుగుదొడ్డి డబ్బులు వారి ఖాతాలో జమ కానున్నాయి. ఈనెల 30లోపు ఎవరైతే మరుగుదొడ్లు మంజూరై నిర్మాణం చేసుకోకుండా ఉంటారో వారికి రేషన్‌ కట్‌ చేయడంతో పాటు పెన్షన్, ఇతర సంక్షేమ రుణాలను నిలిపివేస్తామని  కలెక్టర్‌ హెచ్చరించారు. 

ఇంకా బహిరంగ ప్రదేశాల్లోనే మలవిసర్జన 
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు ఇంకా మరుగుదొడ్డి నిర్మించుకోకుండా బహిర్భూమికి వెళ్తున్నారు. సాంకేతికంగా ఎంత ముందుకు పోతున్నా ఇంకా  బహిర్భూమికి బయటికి వెళ్లడాన్ని పూర్తి స్థాయిలో నిలిపివేసి ప్రతి కుటుంబంలో మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. అందుకు రెండు ప్రభుత్వాలు నూటికి నూరు శాతం ఉచితంగా లబ్ధిదారునికి మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు డబ్బులు మంజూరు చేస్తున్నాయి. ఒక్కో మరుగుదొడ్డికి రూ.12వేలు చెల్లిస్తున్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం వాటా 60శాతం కింద రూ.7200, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటాకింద రూ.4800 చెల్లిస్తున్నాయి. లబ్ధిదారునికి పూర్తిగా ఉచితంగానే నిర్మించుకునేందుకు ప్రభుత్వాలు ఆర్థిక సహాయం అందజేస్తున్నాయి.

2014లో పథకం ప్రారంభం
స్వచ్ఛభారత్‌ మిషన్‌ గ్రామీణ పథకాన్ని 2014 సెప్టెంబర్‌లో ప్రారంభించారు.  మొదట నీటి పారుదల, పారిశుద్ధ్య శాఖల ఆధ్వర్యంలో ఈ మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత దాన్ని గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగించారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈ పథకం కింద 95601 మరుగుదొడ్లను మంజూరు చేశారు. అందులో ఇప్పటివరకు 76309 మరుగుదొడ్లు పూర్తయ్యాయి. ఇంకా 18847 మరుగుదొడ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి.  

ఎన్నిసార్లు హెచ్చరించినా పూర్తికాని నిర్మాణాలు 
 ఐదేళ్లుగా పథకం కింద మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి అధికారులు పదేపదే సమావేశాలు, సమీక్షలు నిర్వహించి చెప్తున్నప్పటికీ నిర్మాణాల్లో మాత్రం జాప్యం ఆగలేదు. ఇప్పటికే పూర్తి కావాల్సిన మరుగుదొడ్లు ఇంకా కొన్ని నిర్మాణ దశల్లోనే ఉన్నాయి. దీంతో ఇచ్చిన గడువుకూడా దగ్గర పడుతుండడంతో కలెక్టర్‌ గట్టి నిర్ణయాన్ని తీసుకున్నారు.

నిర్మాణంలో వెనుకబడిన మండలాలు
జిల్లాలో అత్యధికంగా అనుముల మండలంలో 2580 మరుగుదొడ్లు నిర్మాణంలో వెనుకబడి పోగా దేవరకొండ మండలంలో 2242, కనగల్‌ మండలంలో 1270, నిడమనూర్‌ మండలంలో 1698, పెద్దవూర మండలంలో 2653, త్రిపురారం మండలంలో 1441, వేములపల్లి మండలంలో వెయ్యి మరుగుదొడ్లు అసంపూర్తిగా ఉన్నాయి. అయితే చిట్యాల, దామరచర్ల మండలాలు నూటికి నూరుశాతం పూర్తి చేయగా, గుడిపల్లి మండలంలో ఒక్క మరుగుదొడ్డి పెండింగ్‌లో ఉంది. గుర్రంపోడులో పది, మిర్యాలగూడలో 35, నకిరేకల్‌లో 15, నార్కట్‌పల్లిలో 2, శాలిగౌరారంలో 25 మరుగుదొడ్లు మాత్రమే పెండింగ్‌లో ఉండగా 100 నుంచి వెయ్యిలోపు పెండింగ్‌లో ఉన్నాయి. 
 

మరిన్ని వార్తలు