పర్యాటక కేంద్రం కలేనా?

2 Apr, 2018 08:27 IST|Sakshi
గేట్లు తెరిచిన కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు (ఫైల్‌)

కోయిల్‌సాగర్‌ వద్ద కనీస సౌకర్యాలు కరువు

ఇక్కట్ల పాలవుతున్న పర్యాటకులు

దేవరకద్ర రూరల్‌ :  దేవరకద్ర మండలంలోని కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చాలని పర్యాటకులు కోరుతున్నారు. ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేక పర్యాటకులు ఇబ్బందిపడుతున్నారు. కనీసం తాగడానికి నీరు కూడా దొరకడం లేదని అంటున్నారు. ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చాలని ఏళ్లుగా కోరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని, దీనివల్ల ఎండకు ఇబ్బందిపడుతున్నామని అభిప్రాయపడుతున్నారు. నిత్యం వందల మంది పర్యాటకులు ఇక్కడి వస్తున్నారు. కుటుంబంతో ప్రశాంతంగా గడిపేందుకు అనువుగా లేకపోవడంతో కొంత అసౌకర్యానికి గురవుతున్నారు. పక్కనే ఉన్న గెస్ట్‌హౌజ్‌ కూడా శిథిలావస్థకు చేరింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమైనా సమస్యలపై దృష్టి పెట్టాలని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.  

1947లో నిర్మాణం..
కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టును 1947నుంచి 1955 మధ్యకాలంలో నిర్మించారు. 12వేల ఎకరాలకు సాగునీటిని అందించాలన్న లక్ష్యంతో అప్పట్లో ప్రాజెక్టు రూపకల్పన చేశారు. కేవలం వర్షంపైనే ఆధారపడి ఉంది. రెండు గుట్టల మధ్య, ధన్వాడ, కోయిలకొండ, దేవరకద్ర మండలాల పరిధిలో విస్తరించి ఉంది. 1955లో అప్పటి కేంద్రం వ్యవసాయ శాఖ మంత్రి కె.ఎం.ఖర్జు ప్రాజెక్టు నీటిని మొట్టమొదటిసారి కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టుకు విడుదల చేశారు.  

నెరవేరని మంత్రి హామీ.  
గత ఏడాది కోయిల్‌సాగర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ హాజరయ్యారు. కోయిల్‌సాగర్‌ను పర్యాటక కేంద్రంగా మార్చడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ హామీగానే ఉండిపోయింది. ఈ విషయంలో ఎమ్మెల్యే  స్పందించాలని పర్యాటకులు, ప్రజలు కోరుతున్నారు.

ఇలాంటి పరిస్థితి బాధాకరం  
కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు వద్ద పర్యాటకులకు అనుగుణంగా అన్ని వసతులు కల్పించాలి. గత కొన్నేళ్లుగా అక్కడ పర్యాటకులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదు. జిల్లాలో పేరెన్నిక గన్న ప్రాజెక్టు వద్ద ఇలాంటి పరిస్థితి ఉండడం బాధాకరం.     – అయ్యపురెడ్డి, దేవరకద్ర  

పాలకులు స్పందించాలి  
ఈ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చే విషయంలో పాలకులు వెంటనే స్పందించాలి. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది. ప్రతి ఏటా పర్యాటక కేంద్రంగా మారుస్తామని చెబుతున్నారు కానీ, ఆచరణ మాత్రం శూన్యం. ఈ విషయంలో నిర్లక్ష్యం ఉండరాదు.   – ప్రభాకర్, దేవరకద్ర  

మరిన్ని వార్తలు