ట్రిపుల్‌ ఐటీ పై పట్టింపేది? 

11 Jul, 2019 12:09 IST|Sakshi

‘చదువుల క్షేత్రం’పై చిన్నచూపు 

ఏడువేల మంది విద్యార్థుల క్యాంపస్‌కు.. 

ఏళ్లుగా ఇన్‌చార్జి వీసీ పాలనే 

సాక్షి, నిర్మల్‌: ఉత్తర తెలంగాణ పేదింటి విద్యార్థుల కలల చదువు.. కల్పతరువు.. నిర్మల్‌ జిల్లాలోని బాసర ట్రిపుల్‌ఐటీ. చదువులమ్మ కొలువుదీరిన చోట 272ఎకరాల విశాల ప్రశాంత వాతావరణంలో ఈ విద్యాక్షేత్రం కొలువైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా 2008లో ప్రారంభమైంది. మొత్తం ఏడువేల మంది విద్యార్థుల కలల ప్రపంచమిది. ఎన్నో ఆశలు, ఆశయాలతో వచ్చిన పేదింటి విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేరుస్తోంది.

అలాంటి రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌(ట్రిపుల్‌ ఐటీ) పై రాష్ట్ర సర్కారు చిన్నచూపు చూస్తోంది. ఏళ్లుగా ఈ ప్రత్యేక యూనివర్సిటీని ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్‌ పాలనతోనే నెట్టుకొస్తోంది. ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకున్నవారూ అరకొర పర్యవేక్షణే చేపడుతుండటంతో ఇక్కడి క్యాంపస్‌లో ఇష్టారాజ్యం నడుస్తోంది. అవినీతి, అక్రమాలకు నిలయంగా పలుమార్లు ఆరోపణలు ఎదుర్కొన్న ట్రిపుల్‌ఐటీలో తాజాగా కీచక చేష్టలూ వెలుగులోకి రావడం విద్యార్థుల తల్లిదండ్రులను కలవరపెడుతోంది. 

ఏళ్లుగా ఇన్‌చార్జి పాలన.. 
పేద పిల్లలను ఉన్నత స్థానాలకు చేర్చాలన్న వైఎస్‌ఆర్‌ ఆశయంతో ఏర్పడిందే ట్రిపుల్‌ఐటీ. తెలంగాణలో ఏకైక ట్రిపుల్‌ఐటీ బాసర ఆర్జీయూకేటీ. ఉన్న ఒక్క చదువుల క్షేత్రంపై ఏళ్లుగా వివక్ష కొనసాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. గడిచిన ఐదున్నరేళ్లుగా ట్రిపుల్‌ఐటీని ఇన్‌చార్జి వీసీలతోనే నెట్టుకొస్తుండటం గమనార్హం. శాశ్వత వీసీని నియమించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రత్యేక విశ్వవిద్యాలయంగా స్వయం ప్రతిపత్తి కలిగిన ట్రిపుల్‌ఐటీకి రెగ్యులర్‌ వీసీ ఉండాలన్న డిమాండ్‌ ఏళ్లుగా వస్తున్నా..కనీసం పట్టించుకోవడం లేదు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఇక్కడి క్యాంపస్‌పై శీతకన్ను కొనసాగుతోంది. ఇప్పటికీ ఇక్కడ రెగ్యూలర్‌ వీసీ నియామకంపై చర్చించకపోవడం గమనార్హం. గతంలో ఉస్మానియా వీసీగా పనిచేసిన సత్యనారాయణను ఇన్‌చార్జీగా నియమించారు. మూడేళ్లపాటు ఆయన పనిచేశారు. అనంతరం గతంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా పనిచేసి, ప్రస్తుతం ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శిగా ఉన్న అశోక్‌కు ఇన్‌చార్జి వీసీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన వీసీగా బాధ్యతలు స్వీకరించి దాదాపు రెండున్నరేళ్లు కావస్తోంది. 

పర్యవేక్షణ కరువై.. 
ఏడువేల మంది విద్యార్థులు ఉంటున్న బాసర ట్రిపుల్‌ఐటీకి రెండున్నరేళ్లు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ రెగ్యూలర్‌ వీసీని నియమించడం లేదు. ఏళ్లుగా ఇన్‌చార్జి పాలనే కొనసాగుతుండటంతో ఇక్కడి వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుత ఇన్‌చార్జి వీసీ అశోక్‌ ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శిగా బిజీగా ఉంటున్నారు. ఇటీవల తరచూ వివాదాల్లో ఇంటర్‌బోర్డు కూరుకుపోతుండటంతో ఆయన మరింతగా సంబంధిత శాఖపైనే పూర్తి దృష్టిపెడుతున్నట్లు సమాచారం.

దీని ప్రభావం ఆయన ఇన్‌చార్జిగా ఉన్న బాసర క్యాంపస్‌పై పడుతోంది. ఎప్పుడన్నా.. ఏదైనా ప్రత్యేక కార్యక్రమం ఉంటే తప్పా ఇన్‌చార్జి వీసీ క్యాంపస్‌కు రావడం లేదు. ఇక్కడి ఏఓ, రిజిస్ట్రార్‌ల పరిధిలోనే వర్సిటీ పాలన కొనసాగుతోంది. వైస్‌ చాన్స్‌లర్‌ పర్యవేక్షణ లేకపోవడంతో స్థానిక అధికారులు, అధ్యాపకుల్లో కొంతమంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  

ఏకంగా కీచక చేష్టలు.. 
ఉన్నత ఆశయాలతో క్యాంపస్‌లోకి అడుగుపెట్టిన విద్యార్థుల జీవితాలతో ఆడుకునే విషనాగుల్లాంటి అధ్యాపకులూ ఇక్కడ ఉన్నారు. పదోతరగతి వరకు బాగా చదువుకుని, ట్రిపుల్‌ఐటీలో ప్రవేశమే లక్ష్యంగా అత్యుత్తమ మార్కులు సాధించి వచ్చిన పేదింటి బిడ్డల జీవితాలతో ఆడుకునేవారు దాపురించారు. తాజాగా శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఘటన క్యాంపస్‌లో కొంతమంది అధ్యాపకుల వికృత చేష్టలకు అద్దం పట్టింది. కెమిస్ట్రీ విభాగాధిపతిగా ఉన్నతస్థానంలో ఉన్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రవి వరాల చేసిన పని అధ్యాపకవృత్తినే తలదించుకునేలా చేసింది. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థిని అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని సెల్‌ఫోన్‌లో అసభ్యంగా చాటింగ్‌ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు.

ఈ మేరకు ఆయనను విధుల నుంచి తొలగించడంతో పాటు కేసులనూ నమోదు చేశారు. ఇక ఇలాంటి కీచక చేష్టలతో పైశాచిక ఆనందం పొందుతున్న వారు మరికొందరు ఉన్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. దొరికితేనే దొంగ.. అన్న రీతిలో వీరు చేస్తున్న కథలు బయటపడక పోవడంతో గుట్టుగా ఉంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. గతంలోనూ ఓ అధ్యాపకుడు చేసిన నిర్వాకానికి ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. మొత్తం ఇప్ప టి వరకు ఏడుగురు విద్యార్థులు వివిధ కారణాల తో ఇక్కడి క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. 

అవినీతి, అక్రమాలకూ ఆస్కారం.. 
ట్రిపుల్‌ఐటీకి వివిధ సంస్థలు, ప్రభుత్వాల నుంచి వచ్చే ఉత్తమ పురస్కారాలను అందుకుంటున్న ఇన్‌చార్జి వీసీ ఇక్కడి అక్రమాలపై మాత్రం దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. విద్యార్థుల కోసం వచ్చే లాప్‌టాప్‌లు, యూనిఫాంలలో అవినీతి చోటు చేసుకుందన్న ఆరోపణలు ఏళ్లుగా వస్తూనే ఉన్నాయి. ఇక ఇక్కడ మెస్‌లలో లోపాలపైనా విద్యార్థులు చాలాసార్లు ఫిర్యాదులు చేశారు. తమకు అనుకూలురైన కాంట్రాక్టర్లతో పనులు చేయిస్తున్నారని, అన్ని విభాగాలనూ వారికే దక్కేలా చూస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.

ఇక అకాడమిక్‌ పరంగా కూడా ఇన్‌చార్జి వీసీ ఉండటంతో విభాగాధిపతులపై పర్యవేక్షణ కరువైంది. ఈక్రమంలో రవి వరాల వంటి వారు ఇష్టారాజ్యం ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. క్యాంపస్‌లో భద్రతపైనా భరోసా లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇదేవిషయంపై సోమవారం క్యాంపస్‌ను తనిఖీ చేసిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా మండిపడ్డారు.

ఇప్పటికైనా.. 
2008లో ప్రారంభమైన బాసర ట్రిపుల్‌ఐటీ లో ఎంతో మంది పేద విద్యార్థులు కొలువు లు సాధించారు. గ్రామీణ విద్యార్థులకు అ త్యుత్తమ సాంకేతిక విద్యను అందించే దిశగా పదో తరగతి ఉత్తీర్ణత కాగానే ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జీపీఏ కేటగిరీ వారీగా వారికి సీట్లను కేటాయిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం, మండలాలు, జిల్లాలు, రిజర్వేషన్‌ల ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి కౌన్సెలింగ్‌కు ఆహ్వానిస్తారు.

ఏటా కౌన్సెలింగ్‌లో హాజరైన విద్యార్థులు ప్రవేశాలు పొంది కళాశాలలో ఆరేళ్ల సమీకృత విద్యను అభ్యసిస్తున్నారు. ఆరేళ్ల ఇంజనీరింగ్‌ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు 2014 నుంచి చేపట్టిన ప్రాంగణ నియామకాల్లో ఉత్తమ కొలువులు సాధించారు. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌ జిల్లాల పేదింటి విద్యార్థుల కలగా భావించే ట్రిపుల్‌ఐటీపై ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిపెట్టా ల్సిన అవసరం ఉంది. ఇక్కడి విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపడంతో పాటు కీచక అధ్యాపకుల చేష్టలు ఇక ముందు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇందు కోసం అత్యుత్తమ రెగ్యులర్‌ వైస్‌చాన్స్‌లర్‌ను నియమించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులూ కోరుతున్నారు.   

>
మరిన్ని వార్తలు