పాపం... జూనియర్‌ డాక్టర్లు

19 Feb, 2018 02:46 IST|Sakshi

      స్టైపెండ్‌ పెంపుపై ప్రభుత్వ నిర్లక్ష్యం

      మన రాష్ట్రంలోనే తక్కువగా ఉన్న భృతి  

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ వైద్య రంగంలో కీలకంగా వ్యవహరిస్తున్న జూనియర్‌ డాక్టర్లు, రెసిడెంట్‌ డాక్టర్ల పరిస్థితి దుర్భరంగా మారుతోంది. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా స్టైపెండ్‌ పెంచకపోవడంతో రోజువారీ జీవనం కష్టమవుతోంది. అరకొర  స్టైపెండ్‌  డబ్బులతో వీరు ఇబ్బందులు పడుతున్నారు. చేసే పనికి, ప్రభుత్వం ఇచ్చే  స్టైపెండ్‌కు పొంతన ఉండటం లేదు. జూనియర్‌ డాక్టర్లు, రెసిడెంట్‌ డాక్టర్ల నుంచి ఎక్కువ సేవలు పొందుతున్న ప్రభుత్వం మిగిలిన రాష్ట్రాల కంటే తక్కువ స్టైపెండ్‌ ఇస్తోంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తమ స్టైపెండ్‌ను పెంచాలని జూనియర్‌ డాక్టర్లు, రెసిడెంట్‌ డాక్టర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రతి రెండేళ్లకోసారి  స్టైపెండ్‌ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అయినా అమలు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 

స్టైపెండ్‌ తక్కువ.. జాప్యం ఎక్కువ.. 
వైద్య విద్యలో ఎంబీబీఎస్‌ కోర్సు తర్వాత మరో ఏడాది సదరు విద్యార్థులు సీనియర్‌ వైద్యుల పర్యవేక్షణలో సేవలు అందిస్తారు. పీజీ, సూపర్‌ స్పెషాలిటీ పీజీ వారు సైతం ఇలాగే సేవలు అందిస్తారు. ఇలా హౌస్‌ సర్జన్లు, జూనియర్‌ డాక్టర్లు, రెసిడెంట్‌ డాక్టర్లుగా పేర్కొనే వీరి సేవలను వినియోగించుకుంటున్నందుకు ప్రభుత్వం నెలవారీగా స్టైపెండ్‌  ఇస్తుంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలో ఈ స్టైపెండ్‌ చాలా తక్కువగా ఉంటోంది. దీని చెల్లింపులోనూ జాప్యం జరుగుతోంది. తెలంగాణలోనూ స్టైపెండ్‌ను ఒకసారి పెంచారు. 2016 నుంచి కొత్త స్టైపెండ్‌ అమల్లోకి వచ్చింది. 2018 జనవరి నుంచి పెంచిన స్టైపెండ్‌ అందించాల్సి ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. ప్రతి రెండేళ్లకోసారి 15 శాతం చొప్పున పెంచాలని నిర్ణయించారు. దీనిని 40 శాతానికి పెంచాలని జూనియర్‌ డాక్టర్లు కోరుతున్నారు.  

కర్ణాటక, కేరళలో అధికం.. 
జూనియర్‌ డాక్టర్లకు ఇచ్చే స్టైపెండ్‌  కర్ణాటక, కేరళలో ఎక్కువగా ఉంది. సూపర్‌ స్పెషాలిటీ మూడో సంవత్సరం వారికి కేరళలో రూ.50 వేలు, కర్ణాటకలో రూ.54 వేలు ఉంది. హౌస్‌ సర్జన్లకు కేరళలో రూ.20 వేలు ఉంది. తెలంగాణలోనే తక్కువ స్టైపెండ్‌  ఉండటంతో జూనియర్‌ డాక్టర్లు, రెసిడెంట్‌ డాక్టర్ల జీవనం ఇబ్బందిగా ఉంటోంది. కుటుంబ ఖర్చులు భరించే పరిస్థితి లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసేందుకు కొందరు మొగ్గుచూపుతున్నారు. ఇది ప్రభుత్వ ఆస్పత్రులలోని వైద్య సేవలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.  

మరిన్ని వార్తలు