గుర్తింపు పత్రాలిస్తేనే కాలేజీలకు ‘ఫీజు’!

18 Jan, 2019 01:19 IST|Sakshi

రీయింబర్స్‌మెంట్‌ పథకంలో సర్కారు మార్పులు

కఠినతరం కానున్న నిబంధనలు.. ఉపకార దరఖాస్తుల గడువులోగా గుర్తింపు రెన్యువల్‌ కావాల్సిందే

ఆ తర్వాత గుర్తింపు పత్రాలిచ్చినా పరిగణించేది లేదు

2018–19లో ఇప్పటికీ కన్ఫర్మ్‌ కాని కాలేజీలు 770

సాక్షి, హైదరాబాద్‌: పోస్టుమెట్రిక్‌ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పథకాన్ని ప్రభుత్వం కఠినతరం చేస్తోంది. ఈ పథకం ద్వారా అవకతవకలకు కళ్లెం వేసేందుకు చర్యలు చేపట్టింది. అన్ని సౌకర్యాలతోపాటు విద్యార్థులకు సరైన బోధన అందించే కాలేజీలకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వనుంది. ఇందులో భాగంగా ప్రతి కాలేజీ సకాలంలో గుర్తింపు పత్రాలు సమర్పిస్తేనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని వర్తింప జేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,274 ఇంటర్మీడియెట్, డిగ్రీ, ఇంజనీరింగ్, వృత్తి విద్య, పీజీ కాలేజీలున్నాయి. వాటిలో 6,005 కాలేజీలు ఈ–పాస్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాయి. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో భాగంగా కాలేజీలు ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి కాలేజీల గుర్తింపు ధ్రువీకరణ పత్రాన్ని అప్‌లోడ్‌ చేయాలి. కానీ ఇప్పటివరకు 5,504 కాలేజీలే గుర్తింపు పత్రాలను సమర్పించాయి. మరో 770 కాలేజీలు వాటిని సమర్పించాల్సి ఉంది.

దరఖాస్తు గడువుకు లింకు...
2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇప్పటికే రెండుసార్లు దరఖాస్తు స్వీకరణ గడువును పొడిగించిన సంక్షేమ శాఖలు ఈ నెల 31తో స్వీకరణ నిలిపివేయనున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 13 లక్షల మంది విద్యార్థులు దరకాస్తు చేసుకోవచ్చని సంక్షేమశాఖలు అంచనా వేశాయి. ఇందులో భాగంగా ఇప్పటివరకు 11.8 లక్షల మంది విద్యార్థులు ఈ–పాస్‌ వెబ్‌సైట్‌లో దరకాస్తులు సమర్పించారు. ఈ నెలాఖరులోగా విద్యార్థులంతా దరఖాస్తులు సమర్పిస్తారని సంక్షేమ శాఖాధికారులు భావిస్తున్నారు. ఉపకార వేతనాలు, ఫీజు

రీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తుల స్వీకరణ
ముగిసే నాటికి కాలేజీలన్నీ తప్పకుండా గుర్తింపు పత్రాలను సమర్పించేలా నిబంధన పెట్టాలని అధికారులు నిర్ణయించారు. వెబ్‌సైట్‌లో కన్ఫర్మ్‌ కాని కాలేజీల్లో చదివే విద్యార్థులకూ ఇప్పటివరకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వగా తాజాగా ఈ నిబంధనను కఠినతరం చేశారు. ఈ ఏడాది జనవరి 31లోగా గుర్తింపు పత్రాలు సమర్పించాలని, ఆ తేదీ తర్వాత వచ్చే గుర్తింపు పత్రాలను పరిగణనలోకి తీసుకోవద్దని యోచిస్తున్నారు. దీంతో గుర్తింపు కాలేజీలకే ఫీజు పథకం నిధులు విడుదలవుతాయి.

ఏమిటీ ‘కన్ఫర్మ్‌’...
ప్రతి విద్యా సంవత్సరంలో ప్రతి కాలేజీ గుర్తింపును రెన్యూవల్‌ చేసుకోవాలి. సంబంధిత యూనివర్సిటీలు, బోర్డుల నుంచి ఈ గుర్తింపు పత్రాలు పొందాలి. అందుకు ఆయా కాలేజీలు వసతులు, బోధన సిబ్బంది, విద్యార్థులకు కల్పించే సౌకర్యాల వివరాలను లిఖితపూర్వకంగా సమర్పించాలి. యూనివర్సిటీ/బోర్డు అధికారుల తనిఖీల్లో పరిస్థితి ఆధారంగా గుర్తింపు పత్రాన్ని ఇస్తారు. ఈ గుర్తింపు పత్రంతోపాటు తగిన వివరాలను విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో ఈ–పాస్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. వాటిని సంక్షేమాధికారులు పరిశీలించి ఆ కాలేజీని వెబ్‌సైట్‌లో కన్ఫర్మ్‌ చేస్తారు.

ప్రస్తుత పరిస్థితి ఇదీ...
– రాష్ట్రంలో 2,824 ఇంటర్‌ కాలేజీలుండగా అన్ని కాలేజీలూ బోర్డు నుంచి గుర్తింపు పత్రాలు పొంది వెబ్‌సైట్‌లో కన్ఫర్మ్‌ కేటగిరీలోకి వచ్చేశాయి.
– ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 790 డిగ్రీ, పీజీ, డిప్లొమా కాలేజీలుండగా వాటిలో 596 కాలేజీలే కన్ఫర్మ్‌ అయ్యాయి. 194 కాలేజీలు ఇంకా పెండింగ్‌ జాబితాలో ఉన్నాయి.
– కాకతీయ విశ్వవిద్యాలయంలో 464 కాలేజీలకుగాను 400 కాలేజీలే ఖరారయ్యాయి.
– జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో 317 ఇంజనీరింగ్, వృత్తివిద్యా కాలేజీలకుగాను 263 కాలేజీలే గుర్తింపు పత్రాలు సమర్పించాయి.
– ఎస్‌బీటీఈటీ పరిధిలో 200 కాలేజీలకుగాను 31 కాలేజీలు ఇంకా గుర్తింపు పత్రాలు సమర్పించాల్సి ఉంది.
– మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో 179 కాలేజీలకుగాను 108 కాలేజీలే కన్ఫర్మ్‌ అయ్యాయి.
– పాఠశాల విద్యాశాఖ పరిధిలో 199 డీఈడీ, బీఈడీ కాలేజీలకుగాను 178 కాలేజీలే గుర్తింపు పత్రాలు ఇచ్చాయి.

మరిన్ని వార్తలు