ఊరు.. హుషారు

11 Jul, 2014 02:54 IST|Sakshi

ఇందూరు: కొత్త విధానంలో భాగంగా ముందుగా గ్రామాలవారీగా, ఆ తరువాత మండల, జిల్లా స్థాయిలో ప్రణాళికలు రూపొందించి పంపించాలని జిల్లా అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా పరిషత్ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు ఎవరికి వారు పనులలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని 718 గ్రామ పంచాయతీల సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు, మండల అభివృద్ధి అధికారులకు, జిల్లా స్థాయి అధికారులకు కూడా ఈ కార్యక్రమం గురించి అవే ఉత్తర్వులను పంపించారు. ఈ నెల 13నుంచి 18 వరకు గ్రామాలవారీగా, 19 నుంచి 23 వరకు మండలాలవారీగా, 24నుంచి 28 వరకు జిల్లా స్థాయిలో ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించేందుకు జిల్లా అధికారులు సమాయత్తమవుతున్నారు.

 ఏం చేస్తారు!
 గ్రామ, మండల, జిల్లా స్థాయిలో అభివృద్ధి ప్రణాళికలను తయారు చేసి ఇవ్వాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించిన ప్రభుత్వం, పలు అంశాలను సూచించింది. వీటి ఆధారంగా ప్రణాళికలను తయారు చేసుకోవాలని వివరించింది. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఉద్యోగం, ఉపాధి, రోడ్లు, మురుగుకాలువలు తదితర అంశాలపై సమగ్రంగా ప్రణాళికలను రూపొందించుకోవాలని తెలిపింది. వీటి కోసం గ్రామాలలో ప్రత్యేకంగా గ్రామసభలు నిర్వహించాలని, అక్కడి తీర్మానాలను ప్రణాళికలో చేర్చాలని పేర్కొంది.

గ్రామసభలను మొక్కుబడిగా కాకుండా, అందరూ హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులకు ఆదేశాలిచ్చింది. పక్కా గా అభివృద్ధి ప్రణాళికలను తయారు చేసే బాధ్యతలను గ్రామ సర్పంచ్, కార్యదర్శులతో పాటు ఎంపీడీఓలకు అప్పగించారు. వీటి ఆధారంగానే గ్రామలవారీగా అభివృద్ధి నిధులను ప్రభుత్వం కేటాయించనుంది.

 రిసోర్సు పర్సన్‌లతో అవగాహన
 గ్రామాలవారీగా అభివృద్ధి ప్రణాళికలను ఎలా తయారు చేయాలనే విషయంపై సర్పంచులకు, కార్యదర్శులకు అవగాహన కల్పించేందుకు రిసోర్సు పర్సన్‌లను నియమించుకోవాలని ప్రభుత్వం సూచించింది. గ్రామానికి ఒకరు, మండలానికి ఇద్ద రు చొప్పున రిసోర్సు పర్సన్‌లను అధికారులు నియమించనున్నారు. ఈ రిసోర్సు పర్సన్ లకు కూడా శిక్షణనిచ్చేందుకు జిల్లా స్థాయిలో 18 మంది మాస్టర్ ట్రైనర్స్‌ను నియమించారు. వీరు రిసోర్సు పర్సన్‌లకు శిక్షనిచ్చి గ్రామాలు, మండలాలకు పంపుతారు. గ్రామస్థాయివారు 12న, మండలస్థాయివారు 11న మాస్టర్ ట్రైనర్స్ ఆద్వర్యంలో శిక్షణ పొందుతారు. ఇందుకోసం డివిజన్‌లవారీగా అవగాహన సదస్సులు పెట్టడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. గ్రామాలలో రిసోర్సు పర్సన్‌లుగా పని చేసేందుకు విద్యావంతులు అయిన యువకులను ఎంపిక చేసే బాధ్యతలను ఎంపీడీఓలకు అప్పగించారు.

మరిన్ని వార్తలు