71 కాదు 68 మున్సిపాలిటీలే!

8 May, 2018 01:08 IST|Sakshi

  కొత్త పురపాలికలపై సర్కారు ఉత్తర్వులు 

  తొలుత 71 పురపాలికల ఏర్పాటుకు ప్రతిపాదనలు 

  చివరి క్షణంలో మూడింటి పేర్లు ఉపసంహరణ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 68 కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. 71 కొత్త పురపాలికల ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత నిర్ణయించినప్పటికీ చివరి క్షణంలో మూడు మున్సిపాలిటీల విషయంలో వెనక్కి తగ్గింది. గత మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 71 కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు కోసం రాష్ట్ర పురపాలక శాఖ చట్టాల సవరణ కోసం బిల్లును ప్రవేశపెట్టగా, ఆ మేరకు కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు కానున్నాయని అన్ని పత్రికల్లో కథనాలొచ్చాయి. అయితే, ఈ బిల్లును ఆమోదించడానికి ముందు.. చివరి క్షణంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. 

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోనే మూడు.. 
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 13 కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు తొలుత బిల్లులో ప్రతిపాదించగా, ఆ తర్వాత ఆ జాబితా నుంచి మూడు మున్సిపాలిటీల పేర్లను ప్రభుత్వం తొలగించింది. దీంతో 68 కొత్త పురపాలికల ఏర్పాటుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. అయితే, చివరి క్షణంలో ఈ బిల్లులో జరిపిన ఈ మార్పుల వివరాలను ప్రభుత్వం శాసనసభలో మీడియాకు అందజేయకపోవడంతో కొత్తగా 71 పురపాలికలు ఏర్పాటు కానున్నాయని ప్రచారం జరిగింది. బిల్లుకు అసెంబ్లీ, గరవ్నర్‌ల ఆమోదం లభించిన తర్వాత పురపాలక శాఖ చట్టాల సవరణలు జరుపుతూ ఆ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో 68 కొత్త పురపాలికల జాబితా మాత్రమే ఉండటంతో ఈ విషయం బయటపడింది. ఈ ఉత్తర్వులను జీవోల వెబ్‌సైట్‌లో పొందపర్చకపోవడంతో ఈ విషయం వెలుగులోకి రావడానికి ఆలస్యమైంది.  

ఆమోదానికి ముందే సవరణలు: శాసనసభ కార్యదర్శి 
శాసనసభలో బిల్లును ఆమోదించడానికి ముందు సవరణలు జరిపామని శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు ధ్రువీకరించారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో కొత్తగా జవహర్‌నగర్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, నిజాంపేట, కొంపల్లి, దుండిగల్‌ కొత్త పురపాలికలుగా ఏర్పాటు కానుండగా, బాచుపల్లి, ప్రగతినగర్, బౌరాంపేట్‌లను పురపాలికలుగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలను ప్రభుత్వం విరమించుకుంది.  

మరిన్ని వార్తలు