సింగరేణి భూముల ‘క్రమబద్ధీకరణ’!

6 Sep, 2018 01:26 IST|Sakshi

125 గజాల్లోపు ఉచితం..ఆ పైన ఉంటే మార్కెట్‌ ధరకు 

 ఆరు నెలల్లో పరిష్కరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌: మంచిర్యాల జిల్లా మందమర్రి, నర్సపూర్, బెల్లంపల్లి మండలాల్లో ప్రభుత్వానికి ఇచ్చిన సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) భూముల క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మూడు మండలాల్లోని 789.24 ఎకరాల్లో కబ్జాలో ఉన్న పేదలకు భూములను క్రమబద్ధీకరించేందుకు రెవెన్యూ శాఖ బుధవారం జీవో నంబర్‌ 187 విడుదల చేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ జారీ చేసిన ఈ ఉత్తర్వుల్లో 125 గజాల లోపు ఉంటే ఉచితంగా, ఆపైన ఉంటే మార్కెట్‌ ధరను తీసుకుని క్రమబద్ధీకరించాలని పేర్కొన్నారు. 

క్రమబద్ధీకరణ మార్గదర్శకాలివీ.. 
- క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలు (పట్టణ ప్రాంతాల్లో), రూ.1.50 లక్షల (గ్రామీణ ప్రాంతాల్లో) లోపు ఉండాలి. 
125 గజాల్లోపు భూమి కోసం ఆధార్‌ కార్డు లేదా మరో ఇతర డాక్యుమెంట్‌తోపాటు కబ్జాలో ఉన్నట్టుగా ధ్రువీకరించేందుకు రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్, ఆస్తి పన్ను, విద్యుత్, నీటి తీరువా చెల్లింపు బిల్లులు,  ఇతర డాక్యుమెంట్లు దరఖాస్తుతోపాటు జత చేయాల్సి ఉంటుంది. 
ఆర్డీవోల నేతృత్వంలో తహసీల్దార్‌ మెంబ ర్‌ కన్వీనర్‌గా ఉండే కమిటీ దరఖాస్తులను పరిశీలించి క్రమబద్ధీకరణకు అర్హత ఉన్న వాటిని అసైన్‌ చేస్తుంది. ఈ ఉత్తర్వులు వెలువడిన 6 నెలల్లోపు క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. 
అసైన్‌ చేసిన రోజు నుంచి పదేళ్ల తర్వాతే అమ్ముకునే వెసులుబాటు లభిస్తుంది. 
125 గజాల కన్నా ఎక్కువ ఉన్న భూమి క్రమబద్ధీకరణకు ప్రస్తుతమున్న మార్కెట్‌ ధరలో 25 శాతం మొత్తాన్ని డీడీ లేదా చలాన్‌ రూపంలో చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని 2 వాయిదాల్లో 6 నెలల్లోపు చెల్లించాలి. అసైన్‌ చేసిన తర్వాత స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీలకు మినహాయింపు ఉంటుంది. 
-125 గజాలలోపు భూమి విషయంలో జిల్లా కలెక్టర్లకు అప్పీలు చేసుకోవచ్చు. ఆ పై మాత్రం సీసీఎల్‌ఏ కార్యా లయంలో అప్పీల్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు