సమరమే

18 May, 2015 01:08 IST|Sakshi
సమరమే

సర్కారు నిర్లక్ష్యం వీడకుంటే ఉద్యమిస్తాం: ఉద్యోగ సంఘాల హెచ్చరిక
రాష్ట్రం వచ్చినా ఉద్యోగుల రాత మారదా?
మా సమస్యలంటే సీఎంకు, సర్కారుకు పట్టింపే లేదు
ముఖ్యమైన పోస్టులన్నింట్లోనూ ఆంధ్రా అధికారులే
కొత్త రాష్ట్రంలోనూ వారికిందే పనిచేయాల్సి వస్తోంది
ఉద్యోగుల విభజనలో ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
సర్కారు తీరుతో మా ఆత్మాభిమానం దెబ్బతింటోంది
సొంత రాష్ట్రంలోనే మాకు విలువ లేకుండా పోయింది
ఉద్యమ సమయంలో ఒకలా, ఇప్పుడింకోలా
సీఎం, మంత్రుల మాటతీరు
కమలనాథన్ కమిటీని తక్షణం రద్దు చేయాలి
ఉద్యోగులను టీ, ఏపీ ప్రభుత్వాలే విభజించాలి
ఏపీకి కేటాయించిన టీ ఉద్యోగులను రప్పించాలి
{పభుత్వానికి ఉద్యోగ సంఘాల డిమాండ్లు
 
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత కూడా ఉద్యోగులకు వేధింపులు తప్పడం లేదంటూ ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కనీస పట్టింపు కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఉద్యమ సమయంలో ఎవరికి వ్యతిరేకంగా పోరాడామో ఇప్పుడు వారి కిందే పనిచేయాల్సి వస్తోంది. ఉద్యోగుల విభజనలో ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణం’’ అంటూ మండిపడ్డారు.

ప్రభుత్వ తీరు ఉద్యోగుల ఆత్మగౌరవానికి భంగం కలిగించేదిగా ఉందంటూ ధ్వజమెత్తారు. నిర్లక్ష్య వైఖరి వీడకపోతే పోరాటం తప్పదంటూ హెచ్చరించారు. ‘మన రాష్ట్రం మన ఉద్యోగులు’ పేరిట తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆదివారం సమావేశం నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యోగులను ఏపీకి కేటాయించడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉద్యోగులను విభజిస్తున్న కమలనాథన్ కమిటీని తక్షణం రద్దు చేయాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన తెలంగాణ ఉద్యోగులను తిరిగి వెనక్కు రప్పిం చాలి’’ అని వారంతా ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.

సహాయ నిరాకరణ, సకలజనుల సమ్మె వంటి అద్భుత పోరాటాలు చేసిన ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్రంలో విలువ లేకుండా పోయాయని గ్రూప్ 1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ ఆవేదన వెలిబుచ్చారు. ఉద్యోగుల విభజన పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ‘‘కమలనాథన్ కమిటీని బూచిగా చూపిస్తున్నారు తప్ప ఈ విషయంలో ప్రభుత్వపరంగా ఎలాంటి చొరవా లేదు. ఉద్యోగులను రక్షించుకునే బాధ్యత ప్రభుత్వంపై లేదా?’’ అని ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్లక్ష వైఖరి వీడకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వంతో మాట్లాడి, ఆంధ్రాకు కేటాయించిన తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలంగాణ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు.
 
ఆ రెండు తప్ప మరేమీ పట్టవా: రఘు
విద్యుత్, ఆర్టీసీ మినహా మరే ప్రభుత్వ రంగాన్నీ సర్కారు పట్టించుకోవడం లేదని విద్యుత్ జేఏసీ నేత రఘు విమర్శించారు. ప్రభుత్వ పెద్దలు తెలంగాణ వచ్చేదాకాఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడుతున్నారని పబ్లిక్ సెక్టార్ ఫెడరేషన్ అధ్యక్షుడు సుధీర్‌బాబు ఆక్షేపించారు. హైదరాబాద్‌లో సీమాంధ్రుల కాలుకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానన్న కేసీఆర్‌కు దేవీప్రసాద్ ఓటమి గుణపాఠం కావాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పన్నుతో తీస్తానన్నందుకు కేసీఆర్‌కు వెన్నుపోటు మిగిలిందన్నారు.

ఉద్యోగుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కావడం లేదని తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ అన్నారు. ముఖ్యమైన పోస్టుల్లో ఆంధ్రా అధికారులే ఉన్నారని, తెలంగాణకు ఎంతమాత్రమూ ప్రాధాన్యత లేదని మండిపడ్డారు. దీనిపై ఉద్యోగులు ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. నాటి గిర్‌గ్లానీ, జయభారత్‌రెడ్డి కమిటీల నుంచి నేటి కమలనాథన్ కమిటీ దాకా ప్రతి ఒక్కరూ తెలంగాణ ఉద్యోగులకు అన్యాయమే చేస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

కమల్‌నాథన్ కమిటీని వెంటనే రద్దు చేసి ఉద్యోగుల విభజనను తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘‘స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలి. జోనల్, మల్టీ జోనల్, జిల్లా క్యాడర్‌తో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఏ రాష్ట్రం వారైతే ఆ రాష్ట్రానికి కేటాయించాలి’’ అని తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార స్వామి, ఆర్థిక కార్యదర్శి పవన్ కుమార్ గౌడ్ కోరారు.

మరిన్ని వార్తలు