తెలంగాణలో ఎంట్రన్స్‌లన్నీ వాయిదా

1 Jul, 2020 01:18 IST|Sakshi

కరోనా కారణంగా ఎంసెట్‌ సహా సెట్‌లన్నింటినీ వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

సానుకూల పరిస్థితులొస్తేనే నిర్వహిస్తాం

‘వాయిదా పిల్‌’పై హైకోర్టుకు నివేదన

డిగ్రీ, పీజీ పరీక్షలపై మీ నిర్ణయమేంటి?

జూలై 9 నాటికి తెలియజేయాలని ధర్మాసనం ఆదేశం 

సాక్షి, హైదరాబాద్: ‌రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం నుంచి జరగాల్సిన అన్ని ప్రవేశపరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఎంసెట్, పాలిసెట్, ఐసెట్, ఈసెట్, పీజీ ఈసెట్, లాసెట్, పీజీ ఎల్‌పీసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్‌లను వాయిదా వేస్తున్నట్లు వెల్లడిం చింది. అలాగే ఇతర డిప్లొమా, టైప్‌రైటింగ్, షార్ట్‌ హ్యాండ్‌ కోర్సుల పరీక్షలను కూడా వాయిదా వేస్తు న్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌. చౌహాన్, జస్టిస్‌ బి. విజయసేన్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనానికి ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) బి.ఎస్‌. ప్రసాద్‌ నివేదించారు. అయితే డిగ్రీ, పీజీ పరీక్షల వ్యవహారంపై జేఎన్‌టీయూ చేసిన ప్రతిపాదనల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నదీ జూలై 9న జరిగే విచారణలోగా తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో పరీక్షలెలా?
కరోనా తీవ్రత కారణంగా ప్రవేశపరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ నారాయణగూడకు చెందిన బి.వెంకట నర్సింగ్‌రావు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సి. దామోదర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతుతోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన తరహాలోనే ప్రవేశపరీక్షల విషయంలోనూ నిర్ణయం తీసుకొనేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. దీనిపై ధర్మాసనం కల్పించుకొని జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌ విధిస్తారని పత్రికల్లో వార్తలు చదివామని, అదే జరిగితే పరీక్షలను నిర్వహించడం ఎలా వీలవుతుందని ప్రశ్నించింది.

పదో తరగతి పరీక్షలను రెండుసార్లు నిర్వహించాలని తాము ఆదేశిస్తే వీలుకాదని పరీక్షలనే రద్దు చేసిందని, ఈ పరీక్షల విషయంలో ఏం చేసేదీ స్పష్టం చేయాలని పేర్కొంది. అలాగే లాక్‌డౌన్‌ విధిస్తారో లేదో కూడా చెప్పాలని సూచించింది. ఇందుకు ఏజీ స్పందిస్తూ ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకొనేందుకు వీలుగా విచారణను వాయిదా వేయాలని కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది. తిరిగి మధ్యాహ్నం జరిగిన విచారణలో ఏజీ వాదనలు వినిపిస్తూ అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, కరోనాపై ప్రభుత్వం సమీక్షించి పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పుడే తిరిగి వాటిని నిర్వహిస్తుందని తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో మంత్రివర్గ సమావేశం జరగవచ్చని, ఆ భేటీలో ప్రభుత్వం లాక్‌డౌన్‌పై తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

డిగ్రీ, పీజీపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది..
జేఎన్‌టీయూ తరఫు న్యాయవాది వాదిస్తూ డిగ్రీ, పీజీ పరీక్షలపై తాము పంపిన ప్రతిపాదనల విషయమై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. డిగ్రీలో మొదటి, రెండో సంవత్సరం పరీక్షలను నిర్వహించకుండా మార్కుల ఆధారంగా ప్రమోట్‌ చేయాలని, ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలపై నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

యూజీలో ఏడు సెమిస్టర్‌ మార్కులు, ఎనిమిదో సెమిష్టర్‌ను కలిపి సగటు మార్కులను పరిగణనలోకి తీసుకొని గ్రేడ్‌ కేటాయించాలని సూచించామని కోర్టుకు తెలిపారు. ఇందుకు సమ్మతించని విద్యార్థులకు రాత పరీక్షలు నిర్వహించాలనే ప్రతిపాదనలపై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకోవాలన్నారు. దీంతో స్పందించిన ధర్మాసనం... ఉన్నత విద్యామండలి, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలనే ప్రతిపాదనపై ఏ నిర్ణయం తీసుకున్నదీ జూలై 9న జరిగే విచారణలో చెప్పాలని నోటీసులు జారీ చేసింది.

ఆగస్టులోనైనా సాధ్యమయ్యేనా?
రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం హైకోర్టుకు నివేదించిన నేపథ్యంలో కనీసం ఆగస్టులోనైనా ఈ పరీక్షలు జరుగుతాయా లేదా అనేదానిపై సందిగ్ధం నెలకొంది. వాస్తవానికి ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం మే 2న ఈసెట్, 4వ తేదీ నుంచి ఎంసెట్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం వాటిని వాయిదా వేసింది. జూలై ఒకటో తేదీ నుంచి తిరిగి నిర్వహించేలా షెడ్యూల్‌ జారీచేసింది. ఇప్పటికీ పరిస్థితులు అదుపులోకి రాని నేపథ్యంలో మరోసారి వాయిదా తప్పలేదు. దీంతో ఆగస్టులోనైనా జరుగుతాయో లేదోనని ఈ ప్రవేశ పరీక్షల కోసం ఎదురుచూస్తున్న 4.68 లక్షల మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటివరకు ఉన్న పరిస్థితులను చూస్తే ఆగస్టు 10 వరకు వీటిని నిర్వహించే అవకాశం లేదు. ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించే టీసీఎస్‌ షెడ్యూల్‌ ఆగస్టు 10 వరకు ఫిక్స్‌ అయి ఉండటమే ఇందుకు కారణం. జూలై 18 నుంచి 23 వరకు జేఈఈ మెయిన్స్, అదే నెల 26న నీట్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్, ఇతర పరీక్షలు ఉన్నాయి. వీటన్నింటినీ టీసీఎస్‌ సంస్థే నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 10వ తేదీ వరకు ఉమ్మడి ప్రవేశపరీక్షలు నిర్వహించే అవకాశం లేదని ఉన్నత విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అప్పటికీ కరోనా అదుపులోకి వస్తేనే పరీక్షలు జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ నెల రోజుల్లో కేసుల సంఖ్య పెరిగితే పరిస్థితి ఏమిటనే విషయంలో గందరగోళం నెలకొంది.

పరీక్ష లేకుండా ప్రవేశాలు కష్టమే..
ప్రవేశ పరీక్షలు నిర్వహించకుండా వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవేశాలు చేపట్టే అవకాశం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రవేశ పరీక్షల ద్వారానే వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవేశాలు చేపట్టాల్సి ఉంటుందని స్పష్టంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కచ్చితంగా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు వీటిని నిర్వహిస్తామనేది ఇప్పుడు చెప్పలేని పరిస్థితి ఉందని పేర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వంతో చర్చించిన తర్వాత టీసీఎస్‌తోనూ మాట్లాడి షెడ్యూల్‌ సిద్ధం చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఒకవేల కరోనా కేసులు అదుపులోకి రాకపోతే ఆ షెడ్యూల్‌ ప్రకారమైనా పరీక్షలు జరుగుతాయా.. లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేం అని స్పష్టంచేస్తున్నారు.

విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యమే..
యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి తరగతుల ప్రారంభం అసాధ్యమే. ఆగస్టు పదో తేదీ తర్వాత ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే వాటి ఫలితాలు వెల్లడించి, ప్రవేశాలు పూర్తి చేసేందుకు కనీసం నెల రోజల సమయం పట్టనుంది. దీంతో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో చేరిన విద్యార్థులకు సెప్టెంబర్‌ ఒకటో తేదీన కాకుండా అక్టోబర్‌లోనే తరగతులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అది కూడా కరోనా కేసులు అదుపులోకి వచ్చి ప్రవేశ పరీక్షలు నిర్వహించినప్పుడే సాధ్యమవుతుంది. లేకుంటే మరింత ఆలస్యం తప్పదు.

ఈసెట్‌ విద్యార్థులకు ఇబ్బందే..
పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తయి ఈసెట్‌ ద్వారా బీటెక్‌ ద్వితీయ సంవత్సరంలో చేరే (ల్యాటరల్‌ ఎంట్రీ) విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం వివిధ కోర్సుల్లో చేరే కొత్త విద్యార్థులకు సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి, ద్వితీయ సంవత్సరం, ఇతర విద్యార్థులకు ఆగస్టు 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈనెల 4న జరగాల్సిన ఈసెట్‌ కూడా వాయిదా పడింది. దీంతో ఆ విద్యార్థులు బీటెక్‌ ద్వితీయ సంవత్సరంలో చేరడం, ఆగస్టులో ప్రారంభమయ్యే తరగతులకు హాజరయ్యే అవకాశం కనిపించడంలేదు.

డిగ్రీ, ఇంజనీరింగ్‌ పరీక్షలు రద్దు?
కరోనా కారణంగా రాష్ట్రంలో డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ తదితర ఫైనల్‌ సెమిస్టర్‌ ఎగ్జామ్స్‌ నిర్వహణ సాధ్యం కాకపోవడంతో ఇక పరీక్షల రద్దుకే ప్రభుత్వం మొగ్గుచూపే ఆలోచనలో ఉంది. దీనిపై నేడో, రేపో తుది నిర్ణయం వెలువరిం చనుంది. ఇప్పటికే ఆయా కోర్సుల్లో గత సెమిస్టర్‌ గ్రేడ్స్‌ ఆధారంగా ఫైనల్‌ సెమిస్టర్‌లో గ్రేడింగ్‌ ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. మిగిలిన ఫస్టియర్, సెకండియర్‌ విద్యార్థులను ప్రమోట్‌ చేసినా, వారికి భవిష్యత్‌లో పరీక్షలు నిర్వహిస్తారా లేక గ్రేడింగ్‌ ఇస్తారా అనేది ప్రకటించనుంది. ఇంటర్‌ సప్లిమెంటరీపైనా స్పష్టత వచ్చే అవకాశముంది. 

ఆవేదనలో విద్యార్థులు..
ప్రవేశ పరీక్షల వాయిదాతో దాదాపు 4.68 లక్షల మంది విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడటంతో ఈ పరీక్షలకు ఇంకా ఎన్నాళ్లు సిద్ధం కావాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. జూలై 1వ తేదీ నుంచి నిర్వహించాల్సిన ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్ర విద్యార్థులు మొత్తంగా 4,68,271 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఎంసెట్‌కు 2,21,546 లక్షల దరఖాస్తులు రాగా, ఈనెల 6 నుంచి మూడు రోజులపాటు ఐదు సెషన్లలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి సెషన్‌లో 25వేల మందికి పరీక్షలు నిర్వహించేలా ప్రవేశాల కమిటీ ఏర్పాట్లు చేసింది. కానీ చివరి క్షణంలో పరీక్షలు వాయిదా పడటంతో విద్యార్థులు నిరాశలో పడ్డారు.   

మరిన్ని వార్తలు