ఇక మిడ్‌మానేరుకు ఎత్తిపోతలు!

5 Aug, 2019 02:21 IST|Sakshi
జూరాల ప్రాజెక్టు

నిండిన ఎల్లంపల్లి  

మిడ్‌మానేరుకు ఎత్తిపోసేందుకు ప్యాకేజీ–7 టన్నెల్‌ సిద్ధం  

9 లేదా 10న ప్రారంభించే అవకాశం

సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో 2 నెలలు ఆలస్యంగా అయినా కరువుతీరా వర్షాలు కురుస్తుండటంతో ప్రధాన జలాశయాలన్నీ జలకళతో ఉట్టిపడుతున్నాయి. కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల్లోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండగా గోదావరిలోనూ ప్రవాహాలు పెరుగుతుండటంతో అవన్నీ నిండుకుండలుగా మారుతున్నాయి. కడెం, దాని పరీవాహకంలో కురిసిన వర్షాలతో గోదావరి బేసిన్‌ లోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20.18 టీఎంసీలుకాగా 19.14 టీఎంసీల మేర నిల్వలు చేరుకున్నాయి. ఆదివారం అర్ధరాత్రి ప్రవాహా లు తగ్గాయి. గేట్లు ఎత్తడంపై అధికారులు సోమ వారం నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ఎల్లంపల్లి నుంచి నీటిని మిడ్‌మానేరు ప్రాజె క్టుకు ఎత్తిపోసే పనులకు ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది.

ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోసేందుకు కాళేశ్వరంలో భాగంగా ఉన్న ప్యాకేజీ–6 నందిమేడారం పంప్‌హౌస్‌లో మొత్తం 124.5 మెగావాట్ల సామర్థ్యంగల 7 మోటార్లలో ఐదింటిని ఇప్పటికే సిద్ధం చేశారు. ఎల్లంపల్లిలో లభ్యతగా ఉన్న నీటితో ఏప్రిల్‌లోనే 5 మోటార్లకు 0.25 టీఎంసీల నీటిని వినియోగించి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఎల్లంపల్లి నుంచి 1.1 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ, ఆ తర్వాత 9.53 కిలోమీటర్ల మేర 11 మీటర్ల వ్యా సంతో ఉన్న జంట టన్నెళ్ల ద్వారా ప్యాకేజీ–6 లోని సర్జ్‌పూల్‌ను నింపి లీకేజీలను పరిశీలించారు.

ఎత్తిపోతలకు ప్యాకేజీ–6 సిద్ధంగా ఉం డగా ప్యాకేజీ–7 పరిధిలో 11.24 కిలోమీటర్ల జంట టన్నెళ్ల నిర్మాణం రెండ్రోజుల కిందటే పూర్తయింది. ఈ టన్నెల్‌లోకి నీటిని వదిలి లీకేజీలు, ఇతరత్రా పరీక్షలను సోమవారం నుంచి మొదలు పెట్టనున్నారు. సోమవారం సాయం త్రం 4 గంటలకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మం డలం మేడారం రిజర్వాయర్‌ నుంచి గ్రావిటీ ద్వారా టన్నెల్‌లోకి నీటిని తరలించే షట్టర్ల వద్ద ఇంజనీరింగ్‌ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి షట్టర్లను ఎత్తనున్నారు. మరోవైపు పరీక్షలు చేస్తూనే ప్యాకేజీ–8లోని రామడుగు పంప్‌హౌస్‌కు నీటిని పంపనున్నారు. 

‘బాహుబలులు’ సిద్ధం.. 
ప్యాకేజీ–8లోని బాహుబలి మోటార్లకు మంగళవారం నుంచి ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నారు. ప్యాకేజీ–6 మోటార్లతో పోలిస్తే ప్యాకేజీ–8లోని మోటార్ల సామర్థ్యం 15 మెగావాట్ల మేర ఎక్కువ. ఒక్కో మోటారు సుమారు 15 మీటర్ల ఎత్తు అంటే 4 అంతస్తులు ఉంటుంది. ఈ మోటార్లు 115 మీటర్ల లోతు నుంచి 3,200 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నీటిని ఎత్తిపోస్తాయి. ఈ పంప్‌హౌస్‌లో మొత్తంగా 7 మోటార్ల నిర్మాణం చేయాల్సి ఉం డగా ఇప్పటికే ఐదింటిని సిద్ధం చేశారు. ఈ నెల 9 లేదా 10న ఎల్లంపల్లి నుంచి పూర్తిస్థాయిలో ఎత్తిపోతలు చేపట్టి ప్యాకేజీ–6, 7, 8ల ద్వారా నీటిని మిడ్‌మానేరుకు తరలించనున్నారు. 

కృష్ణా ఉగ్ర తాండవం... 
పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నది ఉగ్రరూపం చూపిస్తోంది. వాగులు, వం కలు నిండిపోవడం, వచ్చిన వరద వచ్చినట్లుగా ఆల్మట్టి, నారాయణపూర్‌లోకి చేరుతుండటంతో ఉధృతి పెరుగుతూనే ఉంది.  ఆల్మట్టిలోకి 2.45 లక్షల క్యూసెక్కులు (22 టీఎంసీలు) వస్తోంది. దీంతో ప్రాజెక్టు నుంచి 2.85 లక్షల క్యూసెక్కుల (25.90 టీఎంసీలు) నీటిని దిగవ నారాయణపూర్‌కు వదులుతున్నారు. నారాయణపూర్‌కు వచ్చిన నీటిని దిగువ జూరాలకు వదులుతున్నారు. జూరాలకు 2.33 లక్షల క్యూసెక్కులు (21 టీఎంసీలు) వస్తుండగా అంతే మొత్తంలో శ్రీశైలానికి వదులుతున్నారు. దీంతో శ్రీశైలానికి 2.20 లక్షల క్యూసెక్కుల (20 టీఎంసీలు) మేర నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులో నిల్వ 100 టీఎంసీలకు చేరింది.  

ఈ నాలుగు రోజుల్లోనే ప్రాజెక్టులోకి 66 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చి చేరింది. రోజుకు 20 టీఎంసీలకు తగ్గకుండా వరద కొనసాగుతుండటంతో వారం రోజుల్లోనే ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులో కనీస నీటిమట్టం 854 అడుగులను దాటిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ సైతం తాగు, సాగు అవసరాలకు నీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభు త్వం శ్రీశైలం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2,400 క్యూసెక్కుల మేర నీటిని వినియోగిస్తోంది. వరద ఇలాగే కొనసాగితే మరో 10 రోజుల్లో దిగువ నాగార్జున సాగర్‌కు నీటి ప్రవాహాలు మొదలయ్యే అవకాశం ఉంది. 

మరో 3 రోజులు వర్షాలు 
రాగల 48 గంటల్లో ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేం ద్రం తెలిపింది. గ్యాంగ్‌టక్, పశ్చిమ బెంగాల్, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్‌ ప్రాంతాల్లో 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి వైపు వంపు తిరిగి ఉందని సీనియర్‌ అధికారి రాజా రావు తెలిపారు. దీంతో సోమవారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.  హైదరాబాద్‌లోనూ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. స్వైన్‌ ఫ్లూ, డెంగీ, చికున్‌గున్యా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది.

 

మరిన్ని వార్తలు