త్యాగ‘ఫలం’ 

9 May, 2019 04:23 IST|Sakshi

మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు ప్రభుత్వం అండ 

ప్రతి కుటుంబానికి రూ.7.5 లక్షల పరిహారం 

సాక్షి, సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా చేయాలనే సీఎం కేసీఆర్‌ సంకల్పం నుంచి జీవం పోసుకున్నదే కాళేశ్వరం ప్రాజెక్టు. దీనిలో భాగంగానే సిద్దిపేట జిల్లాలో నిర్మించే కొమురవెల్లి మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న గ్రామస్తుల త్యాగాలను ప్రభుత్వం కొనియాడుతోంది. మీ త్యాగంతో బీడు బారిన తెలంగాణ భూములు జీవం పోసుకుంటున్నాయని.. త్యాగాలు చేసిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉం టుందని తెలిపింది.

మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్ల ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం పంపిణీ కార్యక్రమం చేపట్టింది. గత వారం రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వా సితుల గ్రామాల్లో నిర్వహిస్తున్నా రు. తాము నష్టపోయినా పర్వాలేదు.. అన్నదాతల ఆకలి చావులు, రైతుల కష్టాలు తీర్చేందుకు తాము భాగస్వామ్యం అవుతున్నందుకు ఆనందంగా ఉందని నిర్వాసితులు చెబుతున్నారు.  

కుటుంబానికి రూ.7.5 లక్షల పరిహారం..  
రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా ముంపునకు గురైన గ్రామస్తులకు పునర్‌ నివాసం, పునరోపాధి పథకం కింద ప్రభుత్వం ఆదుకుంటుంది. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ పరిధిలో రాంపూర్, లక్ష్మాపూర్, బ్రాహ్మణ బంజరుపల్లి, ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, పల్లెపహాడ్, సింగారం, ఎర్రవల్లి గ్రామాల్లో సుమారు 5 వేల కుటుంబాలు ఉన్నాయి. కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌ ముంపులో మామిడియాల, బైలాంపూర్, తానేదారుపల్లి గ్రామాల్లో 1,400 కుటుంబాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఒక్కో కుటుంబానికి రూ.7.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నారు. కుటుంబంలో 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు రూ.5 లక్షల చొప్పున అదనంగా అందిస్తున్నారు. వీటితోపాటు కుటుంబానికి 250 గజాల ఇంటి స్థలం కూడా ఇస్తున్నారు.  

పండుగ వాతావరణంలో పరిహారం పంపిణీ..  
పండుగ వాతావరణం మధ్య పరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల కలెక్టర్లు కృష్ణభాస్కర్, వెంకట్రామిరెడ్డిలతోపాటు ఆర్డీవోలు, తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు గ్రామాలకు వెళ్తున్నారు. భూములకు పరిహారంతోపాటు, ఇతర ఆర్థిక వనరులకు కూడా డబ్బులు చెల్లించడంతోపాటు గ్రామస్తులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు