రేపటి నుంచి రేషన్‌ బియ్యం 

25 Mar, 2020 03:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ప్రకటించిన 12 కిలోల రేషన్‌ బియ్యాన్ని గురువారం నుంచి లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 1.57 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని చౌక ధరల దుకాణాలకు సరఫరా చేయగా, మరో 1.60 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఇప్పటికే సరఫరా మొదలుపెట్టారు. ఈ ప్రక్రియ బుధ, గురువారం సైతం కొనసాగనుంది. గురువారం నుంచి గ్రామాల్లో సరఫరా చేసిన బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. అయితే చౌక ధరల దుకాణాల వద్ద ఇబ్బంది రాకుండా, జనాలు ఎగబడకుండా చర్యలు తీసుకోనున్నారు. గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా టోకెన్లు జారీ చేసి రేషన్‌ సరఫరా చేయనున్నారు. టోకెన్‌లో పేర్కొన్న తేదీనే లబ్ధిదారులు రేషన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బాధ్యతను గ్రామాల కార్యదర్శులు, మున్సిపల్‌ శాఖ అధికారులు తీసుకోనున్నారు. ఇక రాష్ట్రంలోని 87.59 లక్షల రేషన్‌ కుటుంబాల వారికి నిత్యావసర సరుకుల కొనుగోళ్లకై రూ.1,500 లబ్ధిదారుల ఖాతాల్లోనే వేయనున్నారు. దీనికి సంబంధించి లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను ఇప్పటికే పౌర సరఫరాల శాఖ ఆరంభించింది. నా లుగైదు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తికానుంది. ఆధార్‌ అధికారులతో సమన్వయం చేసుకుం టూ బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నారు. ఈ–కుబేర్‌ యాప్‌ను వాడనున్నారు.    

మరిన్ని వార్తలు