తీరని బడి గోస

19 Nov, 2018 17:14 IST|Sakshi
బడిలో నేలపై కూర్చొని చదువుకుంటున్న విద్యార్థులు  గోయగాం ఉన్నత పాఠశాల  

బెంచీలు లేక విద్యార్థుల అవస్థలు 

ముందుకు రాని దాతలు 

పట్టించుకోని ప్రభుత్వం 

కూర్చోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పిల్లలు

ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్నా ఆచరణలో కనిపించడం లేదు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కూర్చోవడానికి బెంచీలు లేక నేలపైనే కూర్చుంటూ నానా ఇబ్బందులు పడుతున్నారు. అటు ప్రభుత్వం బెంచీలు మంజూరు చేయదు. ఇటు దాతలెవరూ ముందుకు రాక పిల్లలు నానా తిప్పలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బెంచీలు మంజూరు చేసి విద్యార్థుల కష్టాలు తీర్చే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

కెరమెరి: సర్కారు బడులకు వచ్చే విద్యార్థులకు నేలబారు చదువులు తప్పడం లేదు. ఉన్నత పాఠశాలలకు ఆర్‌ఎంఎస్‌ఏ నిధులు ప్రతి ఏడాది వస్తున్నా బల్లలు సమకూర్చడంలో ప్రధానోపాధ్యాయులు శ్రద్ధ వహించడం లేదు. దీంతో ఏళ్లుగా వేలాది మంది విద్యార్థులకు నేలపై కూర్చొని విద్యనభ్యసించాల్సిన పరిస్థితులు దాపురించాయి. అనేక చోట్ల బల్లలు లేకపోవడంతో పరీక్షలు సైతం నేలపైనే కూర్చొని రాస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా విద్యార్థులకు మాత్రం సౌకర్యాలు సమకూర్చడంలో విఫలమవుతుంది.   
మండలంలో 86 ప్రభుత్వ పాఠశాలలు  
కెరమెరి మండలంలో మొత్తం 86 ప్రభుత్వ పాఠశాలుల ఉన్నాయి. వాటిలో 7 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, 2 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, 4 ప్రాథమికోన్నత, 63 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వాటిలో బాలురు 3033, బాలికలు 2919 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో యూపీఎస్‌ పాఠశాలల్లో 2014–15 లో 6, 7 తరగతుల వారికి మంజూరు కాగా 95 మంది ఉపయోగించుకుంటున్నారు.  కాగా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో అనుకున్న స్థాయిలో బల్లలు ఉండగా జిల్లా పరిషత్‌ పరిధిలోని ఏ ఒక్క పాఠశాలలో బల్లలు లేవు. గోయగాం, కెరమెరి ఉన్నత పాఠశాలలో సొంతంగా సమకూర్చగా, ఇతర బడుల్లో నేల పైనే చదువులు కొనసాగుతున్నాయి.
ఉన్నత పాఠశాలలకు సర్కారు నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా  రూ. 50 వేలు అందిస్తుండగా, ఈ సంవత్సరం ఆ నిధుల్లో కూడా కొంత కోత పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ప్రాథమిక పాఠశాలలకు నిధుల్ని రూ.10 వేల నుంచి రూ. 5 వేలకు తగ్గించారు. దీంతో ఎటూ పాలుపోక ప్రధానోపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే బల్లలు సమకూర్చాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
  
గిరిజన సంక్షేమ బడులకు ఓకే 
మండలంలోని రాంజీగూడ, అనార్‌పల్లి, హట్టి, మోడి, కేజీబీవీల్లో ఉన్నత పాఠశాలలుండగా  జోడేఘాట్, బాబేఝరిల్లో ప్రాథమిక ఆశ్రమాలు ఉన్నాయి. అందులో 1740 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి సరిపడేంత బల్లలను గిరిజన సంక్షేమ శాఖ సమకూర్చింది. కొన్ని పాఠశాలల్లో స్థలం లేక ఆరుబయటే ఉండగా జిల్లా పరిషత్‌ పాఠశాలల విద్యార్థులు మాత్రం నేలబారు చదువులు ఇంకెన్నాళ్లని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు