సర్కారు బడి.. సమస్యల ఒడి

17 Dec, 2014 02:12 IST|Sakshi

 సాక్షి నెట్‌వర్క్ :సర్కారీ బడులు.. సమస్యలకు లోగిళ్లుగా మారాయి. ఈ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద, మధ్యతరగతి, బడుగు, బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులు అనేక సమస్యల నడుమ తమ చదువులు సాగిస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా.. కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నా...ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పరిస్థితిని తెలుసుకునేందుకు సాక్షి నెట్‌వర్క్ మంగళవారం పలు పాఠశాలలను విజిట్ చేసింది. ఈ సందర్భంగా అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.  ముఖ్యంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
 
 కొన్నిచోట్ల మరుగుదొడ్లు ఉన్నా నీటిసౌకర్యం లేకపోవడం, నిర్వహణ సరిగా లేకపోవడం, పైకప్పులు ఊడిపోవడంతో వాటిని వినియోగించుకునే పరిస్థితి లేదు. విద్యార్థుల సంఖ్య, తరగతులకు సరిపడా అదనపుగదులు లేకపోవడం  ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. చాలా పాఠశాలల్లో మంచినీటి వసతి కూడా లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆరు నుంచి పది తరగతులు చదివే విద్యార్థులకు పాఠశాలలో నీళ్లు లేక ఇంటి నుంచే బాటిళ్లలో నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక, ప్రహరీ లేని పాఠశాలల్లో విద్యార్థుల అవస్థలకయితే హద్దే లేదు.
 
 పశువులు, పందులు, కుక్కలతో సహవాసం చేస్తూ చదువుకోవాల్సిన పరిస్థితి.  క్లాసులు ముగిశాక  కొన్ని పాఠశాలలు అనేక కార్యకలాపాలకు వేదికలుగా మారుతున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయి. కనీసం మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు సరిగా చదువుపై దృష్టి పెట్టలేకపోవడం, డ్రాపవుట్స్ కావడం గమనార్హం. అయితే, జిల్లా నుంచి విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడయినా జిల్లాలోని సర్కారీ పాఠశాలల గతిని మార్చాలని అటు విద్యార్థి, ఇటు ఉపాధ్యాయ, ప్రజాసంఘాలు కోరుతున్నాయి.
 
 ఆలేరు నియోజకవర్గంలో 73 ఉన్నత, ప్రాథమికోన్నత 22, ప్రాథమిక పాఠశాలలు 223 ఉన్నాయి. 27,169 మంది విద్యార్థులు ఆయా పాఠశాలల్లో చదువుతున్నారు. అన్ని పాఠశాలల్లో ఈ ఏడాది బాలికలకు నాప్‌కిన్స్ అందలేదు. మరుగుదొడ్లు ఉన్నప్పటికీ నీటి సౌకర్యం లేదు. దీంతో  విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.  
 భువనగిరి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పేరుకుపోయాయి. మొత్తంగా 45 ఉన్నత, 30 ప్రాథమికోన్నత  , 136 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా మంచినీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, విద్యుత్, ప్రహరీ, వంటగదులు, ఫర్నిచర్, చాలీచాలని గదులు, నైట్‌వాచ్‌మెన్ స్వీపర్లు, అటెండర్ల సమస్య తీవ్రంగా ఉంది. పలుచోట్ల మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉన్నా వాటి నిర్వహణ లేదు. విద్యార్థినులకు నాప్‌కిన్స్ ఎక్కడా రాలేదు.
 మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 242మంది విద్యార్థులకుగానూ ఒకే ఒక మూత్రశాల ఉంది. దీనికి కూడా డోర్ లేదు. విద్యార్థులు ఆరు బయటకు వెళ్లలేక నానా ఇబ్బంది పడుతున్నారు.
 
 మునుగోడు, కొరటికల్‌లలోని ఉన్నత పాఠశాలల్లో మూత్రశాలలు ఉన్నప్పటికీ నిర్వహణలేక నిరుపయోగంగా మారాయి. చండూరులో నీటివసతి లేదు. సంస్థాన్ నారాయణపురంలోనూ సరిపడా మూత్రశాలలు లేవు.   కిందటి ఏడాది విద్యార్థులకు నెప్జల్ పథకం కింద నాప్‌కిన్స్ సరఫరా చేశారు. గత ఏడాది నుంచి ప్రభుత్వం సరఫరా చేయడం లేదు.
 దేవరకొండ నియోజకవర్గవ్యాప్తంగా పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఏ పాఠశాలలో కూడా విద్యార్థులకు నాప్‌కిన్లను అందించడం లేదు. దీనికి తోడు  తాగునీటి సదుపాయం లేకపోగా, మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. చింతపల్లి ఉన్నత పాఠశాలలో ప్రహరీ లేకపోవడం వల్ల పందులు పాఠశాలల్లోకే వస్తున్నాయి.
 
 నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మొత్తం 42  జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలున్నాయి. అన్నీ పాఠశాలల్లో సమస్యలే రాజ్యమేలుతున్నాయి. విద్యార్థులకు సరిపడా తరగతిగదులు లేవు.  పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, మూత్రశాలలున్నప్పటికి విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా లేవు. నిర్వాహణలోపంతో కంపుకొడుతున్నాయి. రెండేళ్లుగా విద్యార్థులకు నాప్‌కిన్స్ సరఫరా లేదు. కోదాడ నియోజకవర్గంలో 63 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మరుగుదొడ్లు, మూత్రశాలలు ఉన్నా, నీటి సౌకర్యం లేకపోవడంతో పాటు వాటిని శుభ్రం చేసేవారు కరువ య్యారు. విద్యార్థినులకు నాప్‌కిన్స్ ఇవ్వడం లేదు. కోదాడ పట్టణంలోని బాలికల ఉన్నతపాఠశాలలో  కొత్త గదుల నిర్మాణానికి ఉన్న మరుగుదొడ్లను కూల్చివేశారు.
 
 మిర్యాలగూడలో  విద్యార్థినులకు నాప్‌కిన్స్ కరువయ్యాయి. రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో మూ డేళ్ల క్రితం నాప్‌కిన్స్ ఇచ్చినా, వాటిని  పంపిణీ చేయలేదు. దీంతో అవి మూలకుపడిఉన్నాయి. బకల్‌వా డీ పాఠశాలలో 1220 మంది, బంగారుగడ్డ పాఠశాలలో 280 మంది విద్యార్థులుండగా ప్లేగ్రౌండ్, మ రుగుదొడ్లు సరిపడా లేవు. దామరచర్ల మండలంలో 9 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలు ఉండగా ఒక్క పాఠశాలలో కూడా బాల బాలికలకు ముత్రశాలలు గాని మరుగుదొడ్లు గానీ అందుబాటులో లేవు. తుంగతుర్తి నియోజకవర్గంలో మొత్తం 324 ప్రభు త్వ పాఠశాలలు ఉన్నాయి.  150 పాఠశాలలో మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. 108 పాఠశాలల్లో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉంది. 175 పాఠశాలలకు ప్రహారీ లేదు. వెలిశాల ఉన్నత పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో కొద్దిమంది ఆకతాయిలు పాఠశాల ఆవరణలోనే మద్యం సేవించి బెంబీలను విరగొట్టారు.
 
 నకిరేకల్ నియోజకవర్గంలో 60 జెడ్పీ ఉన్నత పాఠశాలలు నకిరేకల్‌లోని జెడ్పీహైస్కూల్‌లో 634మంది వి ద్యార్థులకు గాను 15 సెక్షన్లు కొనసాగుతుండగా, కేవలం 7 పక్కా గదులు మాత్రమే ఉన్నాయి.   బాలి కల జెడ్పీహైస్కూల్ ఆవరణలోని క్రీడామైదానం కంపచెట్లతో నిండిపోయింది.సూర్యాపేట నియోజకవర్గంలో ప్రాథమిక 175, ప్రా థమికోన్నత 27, ఉన్నత పాఠశాలలు 44 ఉన్నాయి. నియోజకవర్గంలోని ఏ పాఠశాలల్లో కూడా విద్యార్థులకు నాప్‌కిన్స్ అందించడం లేదు. అదే విధంగా పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరవయ్యాయి.   మరుగుదొడ్లు ఉన్నప్పటికీ నీటి సౌకర్యం లేక 60 శాతం వరకు పాఠశాలల్లో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. మరుగుదొడ్లు లేకపోవడంతో బాలికల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  
 
 నల్లగొండ పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 11 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో తాగునీటి సమస్య, మరుగుదొడ్లు, క్రీడామైదానం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూ డేళ్ల క్రితం వరకు ‘నెఫ్జల్’ ద్వారా నాప్‌కిన్స్ సరఫరా జరిగేది ప్రస్తుతం వాటి ఊసే లేదు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో 38 జెడ్పీ ఉన్నతపాఠశాలలు ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో అలంకారప్రాయంగా మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణం చేపట్టినప్పటికీ నిర్వహణలేక నిరుపయోగంగా ఉన్నాయి. విద్యార్థులు పా ఠశాలల నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు విద్యార్థినులకు నాప్‌కిన్స్ అందజేయలేదు.   
 

మరిన్ని వార్తలు