సాంకేతిక సహాయకుల అధికారాల కోత

25 Jun, 2020 06:50 IST|Sakshi

వీరి బాధ్యతలు ఇంజనీర్లకు బదలాయింపు

ఇప్పటికే ఎఫ్‌ఏలను తొలగించి వారి విధులు

పంచాయతీ కార్యదర్శులకు అప్పగింత

ఇంజనీరింగ్‌ పనుల నుంచి టీఏ, ఈసీ, ఏపీవోలకు ఉద్వాసన

సాక్షి, హైదరాబాద్ ‌: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌)లో కీలకంగా వ్యవహరిస్తున్న సాంకేతిక సహాయకుల (టెక్నికల్‌ అసిస్టెంట్లు) అధికారాలకు ప్రభుత్వం కత్తెర వేసింది. ఇంజనీరింగ్‌ పనులను దాదాపుగా తొలగించి కేవలం కూలీలతో సంబంధం ఉన్న పనులకే పరిమితం చేసింది. చెరువుల్లో పూడికతీత, కొత్త ఫీడర్‌ చానళ్ల నిర్మాణం, కొత్త ఫీల్డ్‌ చానళ్ల ఏర్పాటు, కాల్వల్లో మట్టి తొలగింపు, చెక్‌ డ్యామ్‌లలో పూడికతీత, గ్రామ పంచాయతీల్లో వైకుంఠధామం నిర్మాణ పనుల నుంచి వీరిని తప్పించింది. ఈ పనులను నేరుగా ఇంజనీరింగ్‌ అధికారి (ఎన్‌ఈవో)కి అప్పగించింది. పంచాయతీరాజ్‌శాఖ పరిధిలో పనిచేసే మండల ఇంజనీరింగ్‌ అధికారి పోస్టును ఇటీవల ఎన్‌ఈవోగా నిర్వచిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇకపై ఉపాధి పనులను పూర్తిస్థాయిలో వీరే పర్యవేక్షించనున్నారు. ఇప్పటివరకు ఉపాధి హామీ పథకం కింద చేపట్టే ప్రతి పని అంచనా వ్యయం, కూలీలు చేసే పని మదింపు, ఎంబీ రికార్డు టెక్నికల్‌ అసిస్టెంట్లు చూస్తున్నారు. ఆపై మండల స్థాయిలో ఉండే ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌ (ఈసీ) చెక్కు జారీ చేస్తున్నారు. వీరిరువురిపై ఏపీవో అజమాయిషీ చేసేవారు. అయితే, తాజాగా టెక్నికల్‌ అసిస్టెంట్‌ సహా ఈసీ, ఏపీవో పనులకు కూడా కోత పడింది. ఇంజనీరింగ్‌ పనుల గుర్తింపు, అంచనా ప్రతిపాదనలు, ఈ–మస్టర్‌ తయారీ, ఎంబీ రికార్డు మొదలు చెక్కు జారీ చేసే విధులను ఎన్‌ఈవో, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లకు ప్రభుత్వం కట్టబెట్టింది. తద్వారా కోట్ల విలువైన పనుల నుంచి ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న టీఏ, ఈసీ, ఏపీవోలను వ్యూహాత్మకంగా తప్పించింది. ఆ మేరకు ఎన్‌ఈవోలకు ప్రత్యేక లాగిన్‌ ఐడీని కూడా జారీ చేసింది. 

క్షేత్ర సహాయకుల దారిలో.. 
ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించి సమ్మెబాట పట్టిన 7,500 మంది క్షేత్ర సహాయకుల (ఫీల్డ్‌ అసిస్టెంట్లు)పై ప్రభుత్వం వేటు వేసింది. పనితీరును గ్రేడింగ్‌ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎఫ్‌ఏలు మార్చి మాసంలో ఆందోళన బాట పట్టారు. వీరి ఆందోళనకు ఏ మాత్రం వెరవని ప్రభుత్వం.. అదే నెల చివరి వారంలో ఎఫ్‌ఏలకు ఉద్వాసన పలికింది. మేం మళ్లీ విధుల్లో చేరుతాం మొర్రో అని మండల కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టినా పట్టించుకోకుండా..వీరి విధులను గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. తాజాగా తమ విధుల్లోనూ కోత పెడుతుండడంతో టెక్నికల్‌ అసిస్టెంట్లలోనూ ఆందోళన నెలకొంది.

గడువులోగా చేయాల్సిందే
ఉపాధి హామీ పనులను నిర్ణీత గడువులోపు పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు వేదికలు, కల్లాలను నాలుగు నెలల్లో నిరి్మంచాలని స్పష్టం చేసింది. వైకుంఠధామం, డంపింగ్‌ యార్డుల నిర్మాణాలను రెండు నెలల్లోపు పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా మార్గదర్శకాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీ రోడ్లు, కాల్వలను, అంతర్గత రోడ్లను ప్రతి రోజూ క్లీన్‌ చేయాలని స్పష్టం చేశారు. హరితహారం కింద ప్రతిపాదించిన ప్రకృతి వనాలను సాధ్యమైనంత త్వరగా నిరి్మంచాలని ఆదేశించారు. ఇప్పటివరకు ట్రాక్టర్లను సమీకరించుకోని పంచాయతీలు.. ఈ నెలాఖరులోపు కొనుగోలు చేయాలన్నారు. కాగా, గ్రామీణ ఉపాధి హామీని వ్యూహాత్మకంగా వాడుకోవాలని నిర్ణయించిన సర్కారు.. గ్రామ పంచాయతీల్లో చేపట్టాల్సిన ఇంజనీరింగ్‌ పనులను ఆయా శాఖలు గుర్తించాలని సూచించింది. తద్వారా అభివృద్ధి పనులకు నరేగా నిధులను విరివిగా వాడుకోవాలని యోచిస్తోంది.   

మరిన్ని వార్తలు