ఖరీఫ్‌ నేర్పిన పాఠం

17 Sep, 2019 09:46 IST|Sakshi
భీంగల్‌ మండల కేంద్రంలోని సొసైటీ వద్ద యూరియా కోసం రైతుల రద్దీ (ఫైల్‌)

గత రబీ సీజన్‌ కంటే ఈసారి రబీకి రెట్టింపు కేటాయింపులు

ప్రస్తుత యూరియా కొరత అనుభవాల దృష్ట్యా ముందు జాగ్రత్త

ఆర్థికంగా బలమైన సొసైటీల్లో అదనపు నిల్వలు

ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో యూరియా పంపిణీలో ఎదురవుతున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. పక్షం రోజుల్లో ప్రారంభం కానున్న రబీ సీజన్‌లో ఎరువుల పంపిణీకి ముందుజాగ్రత్త పడుతోంది. గతేడాది రబీ సీజన్‌లో ఎరువుల కేటాయింపుల కోసం పంపిన ప్రతిపాదనలకు దాదాపు రెట్టింపు నిల్వలు కేటాయించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

సాక్షి, నిజామాబాద్‌: గత ఏడాది 2018 రబీ సీజన్‌లో 36,720 మెట్రిక్‌ టన్నుల యూరియా కేటాయించాలని ప్రతిపాదించగా.. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఎదురైన అనుభవాల రీత్యా రబీ సీజన్‌లో ఏకంగా 71,537 మెట్రిక్‌ టన్నుల యూరియా కేటాయించాలని వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అంటే గతేడాది కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో కేటాయింపుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే గత రబీ సీజన్‌లో జిల్లాకు ఏ మేరకు యూరియా వచ్చిందనే అంశంపైనా లెక్కలు తీస్తున్నారు.

ఎరువులు : 1.21 లక్షల మెట్రిక్‌ టన్నులు.. రబీ సీజన్‌లో మొత్తం 1.21 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు కేటాయించాలని కోరుతూ ప్రభుత్వానికి పంపించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 71,537 టన్నుల యూరియాతో పాటు, 8,621 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 7,570 మెట్రిక్‌ టన్నుల ఎంఓపీ, 958 మెట్రిక్‌ టన్నుల ఎస్‌ఎస్‌పీ, 33,045 టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు కేటాయించాలని కోరుతున్నారు.

ముందస్తు నిల్వలు..
ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో సహకార సంఘాలు ఎరువుల విషయంలో అలసత్వం వహించడంతో యూరియా కొరతకు కారణమైంది. సహకార సంఘాలు ముందస్తుగా నిల్వలు చేసుకోకపోవడంతో ఒక్కసారిగా వచ్చిన డిమాండ్‌కు సరిపడా ఎరువులను సరఫరా చేయడం ఇబ్బందిగా మారింది. రెండు బస్తాల యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడాల్సి వచ్చింది. వ్యవసాయ పనులన్నీ మానుకుని రోజంతా క్యూలైన్లో నిలబడితే రెండు బస్తాల యూరియా దొరకడం కష్టంగా మారింది. దీంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం విదితమే. పాసుపుస్తకాలను, చెప్పులను క్యూలో పెట్టి అనేక పాట్లు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో రబీ సీజన్‌లో ఇలా పరిస్థితులు ఎదురుకాకుండా ముందు జాగ్రత్త పడాలని నిర్ణయించింది. ఇందుకోసం సహకార సంఘాల్లో ఎరువుల నిల్వలు ముందుగానే అందుబాటులో ఉంచేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ఆర్థికంగా బలంగా ఉన్న సహకార సంఘాలు, వరి విస్తీర్ణం అధికంగా ఉండే ప్రాంతాల సహకార సంఘాల్లో ముందస్తుగా నిల్వలు తెప్పించుకుని పెట్టుకోవాలని నిర్ణయించారు. జిల్లాలో ఒక్క ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌ మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల వరి విస్తీర్ణం అధికంగా ఉంటుంది. దీంతో ఈ సహకార సంఘాల్లో ఎరువుల నిల్వలుంచాలని నిర్ణయించారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో కూడా ఇలాగే ముందస్తు నిల్వలు తెప్పించి పెట్టుకోవాలని వ్యవసాయశాఖ సహకార సంఘాల పాలకవర్గాలకు ఆదేశాలు జారీ చేసినా.. పలు సంఘాలు పెడచెవిన పెట్టడంతో యూరియా కొరత తీవ్రమైందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

82 వేల హెక్టార్లలో వరి అంచనా...
ఈ రబీ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 82 వేల హెక్టార్లలో వరి పంట సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. 13 వేల హెక్టార్లలో ఎర్రజొన్న, ఆరు వేల హెక్టార్లలో మొక్కజొన్న, పది వేల హెక్టార్లలో శనగ, మరో ఆరు వేల హెక్టార్లలో బాజ్రాతో పాటు నువ్వు, కూరగాయలు, పప్పుదినుసు వంటి పంటలు సాగవుతాయి. ఈసాగు విస్తీర్ణానికి అవసమైన ఎరువులను తెప్పించేందుకు ప్రతిపాదనలు తయారు చేసింది. 

మరిన్ని వార్తలు