కలెక్టరేట్‌ ఎదుట టీ–మాస్‌ మహాధర్నా

23 Jan, 2018 19:43 IST|Sakshi
మహాధర్నాలో మాట్లాడుతున్న బండారు రవికుమార్‌

ఆదిలాబాద్‌అర్బన్‌ : ప్రజా సమస్యల పరిష్కా రం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ సామాజిక, ప్రజాసంఘాల ఐక్యవేదిక(టీమాస్‌) రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు బండారు రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట టీమాస్‌ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఆయా ప్రాంతాల నుంచి మహిళలు ఖాళీ బిందెలు, గ్యాస్‌ సిలెండర్లతో భారీ సంఖ్యలో ర్యాలీగా కలెక్టరేట్‌కు తరలివచ్చారు. ఈ సందర్భంగా రవికుమార్‌ మా ట్లాడుతూ జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నెల రోజులు సర్వే చేశామన్నారు. బోథ్‌ నియోజకవర్గంలో 102 గ్రామాల్లో సర్వే చేసి 65 రకాల సమస్యలు గుర్తించినట్లు వివరించారు. 1976లో గుర్తించి పెండింగ్‌లో ఉంచిన గ్రామాలను ఏజెన్సీ గ్రా మాలుగా ప్రకటించాలన్నారు. సర్వే ద్వారా గుర్తించిన సమస్యలు పరిష్కరించాలని మండలాధికారులకు వినతిపత్రాలు ఇచ్చామని తెలి పారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాది గూడ, సిరికొండ మండలాల్లోని ఏజెన్సీ గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొందని తెలిపా రు. జిల్లా కేంద్రంలోని వార్డుల్లో అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు. జిల్లాలో డ్వాక్రా గ్రూపులకు అభయహస్తం పథకం కొనసాగించాలని, వడ్డీలేని రుణాలను అన్ని గ్రూపులకు ఇవ్వాలని, ఆదివాసీల పోడుభూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, పంట పెట్టుబడి రూ.8 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జేసీ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీమాస్‌ జిల్లా కన్వీనర్‌ బండి దత్తాత్రి, లంక రాఘవులు, దర్శనాల మల్లేష్, అశోక్, పూసం సచిన్, ప్రభాకర్, కిరణ్, గంగన్న, మయూరిఖాన్, వెంకట్, రఘువీర్‌ యాదవ్, దత్తు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.   
 

మరిన్ని వార్తలు