పిల్లల సంరక్షణ మరింత కట్టుదిట్టం

27 Jan, 2019 04:06 IST|Sakshi

కార్పొరేట్‌ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో ఉద్యోగాలకు కఠిన నిబంధనలు

సాక్షి, హైదరాబాద్‌: బాలల సంరక్షణకు మరింత కఠిన చట్టాలను ప్రభుత్వం తీసుకొస్తోంది. పిల్లల హక్కులకు భంగం కలిగించే వారిని ఉపేక్షించకూడదని నిర్ణయించింది. ఇప్పటికే అమల్లో ఉన్న జువైనల్‌ జస్టిస్, పోక్సో తదితర చట్టాలను కట్టుదిట్టం చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా బాలల సంరక్షణ విధానా న్ని తీసుకొచ్చింది. ఈ మేరకు రూపొందించిన ముసాయిదా పత్రాలను కేంద్రం రాష్ట్రాలకు పంపింది. దీనిపై సలహాలు, సూచనలు అడిగింది. ఫిబ్రవరి 4 లోగా సమర్పించాలని కోరింది. పిల్లల సంరక్షణకు ప్రాధాన్యమిస్తూనే, పెద్దల బాధ్యతలను గుర్తుచేస్తూ పలు నిబంధనలు విధించింది. ఇకపై పిల్లల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలను ప్రతీ సంస్థపైనా పెట్టింది. ఉద్యోగ నియామకాల్లోనూ పిల్లల సంరక్షణ అంశాలను ప్రస్తావిస్తూ.. వారిపై వైఖరిని సైతం తెలుసుకోవాలని స్పష్టం చేసింది.

విచారించాకే నియామకం...
కార్పొరేట్‌ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఇతర వాణిజ్య సముదాయాల్లో ఉద్యోగాల నియామకాల సమయంలో బాలల సంరక్షణ విధానానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ఉద్యోగం కోసం వచ్చిన అభ్యర్థి వైఖరిని తెలుసుకునేందుకు అతని వ్యవహారాలపై అంతర్గత విచారణ చేపట్టాలి. పిల్లల పట్ల అతని శైలి ఏమిటనేది తెలుసుకున్న తర్వాత నియమించుకోవాలి. ఉద్యోగ అర్హత సాధించిన తర్వాత సదరు అభ్యర్థి నుంచి బాలల చట్టాలకు చెందిన అంగీకారాన్ని తీసుకున్న తర్వాతే విధుల్లో చేరాలి.

అవగాహనే కీలకం...
బాలలపై హింస, అత్యాచారాలు, దాడులను శూన్య స్థితికి తీసుకురావడమే బాలల సంరక్షణ విధాన లక్ష్యం. ఈ క్రమంలో పిల్లల చట్టాలపై అన్ని సంస్థలు అవగాహనలు చేపట్టేలా కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. దీనిలో భాగంగా పిల్లల సంరక్షణ విధానాన్ని అన్ని సంస్థలు అన్వయించుకోవాలి. చట్టంపై అవగాహన కల్పిం చేలా కార్యాలయాల్లో బోర్డులు ప్రదర్శించాలి.

పిల్లలంటే గౌరవం పెంపొందేలా... ఉద్యోగులు, కాంట్రా క్టు వర్కర్లు వ్యవహరించాలి. చైల్డ్‌లైన్‌ నంబర్‌ 1098ను అన్ని కార్యాలయాల్లో విధిగా ప్రదర్శించాలి. పిల్లలను శారీరకంగా, మానసికంగా హింసించడం, అసభ్యంగా ప్రవర్తించడం, బాలికల అక్రమ రవాణా వంటి చర్యలకు పాల్పడినట్లు గురిస్తే వెంటనే చైల్డ్‌లైన్‌ నంబర్‌కు ఫిర్యాదు చేసేలా అప్రమత్తత కలిగిం చాలి. రాష్ట్రాల అభిప్రాయాల సేకరణ తర్వాత ఈ బాలల సంరక్షణ హక్కుల విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.

మరిన్ని వార్తలు