టెన్త్‌లో రెండు సార్లు, ఇంటర్‌లో మూడు సార్లు ఫెయిల్‌..

9 May, 2019 09:40 IST|Sakshi
కొచ్చెర్ల వేణు

సూర్యాపేటటౌన్‌ : పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు.. సూర్యాపేట పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొచ్చెర్ల వేణు. పదో తరగతిలో రెండు సార్లు, ఇంటర్‌ మొదటి సంవత్సరంలో మూడుసార్లు ఫెయిల్‌ అయ్యాడు. అయినా వెనుకడుగు వేయలేదు. ఎలాగైనా చదువును మధ్యలో అపేయకుండా కొనసాగించాలనే సంకల్ఫమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందంటున్నాడు. ఓ వైపు తండ్రి ఆర్థిక ఇబ్బందులు, అన్ని సార్లు ఫెయిల్‌ అయ్యావు.. ఇక ఏం చదువుతావులే అని అన్నప్పటికీ పట్టుదలతో చదివాడు. తండ్రి ఆర్థిక ఇబ్బందులతో చదువుకు డబ్బులు ఇవ్వకున్నా తాను సొంతంగా లేబర్‌ పని చేస్తూ వచ్చే డబ్బులతో కోచింగ్‌ తీసుకొని టెన్త్, ఇంటర్‌లో పాసయ్యాడు.

అక్కడి నుంచి వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్తూ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు.. సూర్యాపేటకు చెందిన కొచ్చెర్ల వేణు. తాను ఏ సబ్జెక్టులో ఫెయిల్‌ అయ్యాడో అదే సబ్జెక్టు టీచర్‌గా కొనసాగుతున్నాడు.  సూర్యాపేటకు చెందిన కొచ్చెర్ల రాములు,లక్ష్మమ్మ కుమారుడు కొచ్చెర్ల వేణు. అతని తోడ ఇద్దరు చెల్లెళ్లు, అక్క, అన్నయ్య ఉన్నారు.  తండ్రి రాములు సుతారి మేస్త్రీగా పని చేస్తూ పిల్లలను చదివించేవాడు. కాగా వేణు 7వ తరగతి చదువున్న సమయంలో తల్లి లక్ష్మమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో అప్పటి నుంచి వేణుకు కష్టాలు మొదలయ్యాయి. అప్పటికే వారి పెద్ద అక్కకు పెళ్లి చేశారు. ఇద్దరు చెళ్లెళ్లను ప్రభుత్వ హాస్టళ్లలో ఉంచి చదివిస్తున్నారు. సమయానికి ఇంట్లో వండి పెట్టేందుకు ఎవరూ లేకపోవడంతో వేణు, అతని అన్నయ్య ఇద్దరు కలిసి వండిపెట్టే వారు.  ఇంట్లో పనులు చూసుకుంటూ వేణు స్కూల్‌కు వెళ్లేవాడు.
 
ఫెయిల్‌ అయినా కుంగిపోలేదు

సూర్యాపేటలోని జెడ్పీ బాలుర పాఠశాలలో వేణు పదో తరగతి వరకు విద్యనభ్యసించాడు. 1982 మార్చిలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో వేణు మ్యాథ్స్, సైన్స్‌ సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యాడు. మళ్లీ సప్లమెంటరీ పరీక్ష రాసి సైన్స్‌ పాసయ్యాడు. మ్యాథ్స్‌ ఫెయిలయ్యాడు. 1983 మార్చిలో మళ్లీ పరీక్ష రాసి మ్యాథ్స్‌ ఉత్తీర్ణుయ్యాడు. అనంతరం ఇంటర్‌ విద్యకోసం సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చేరాడు. 1983–84లో ఇంటర్‌ ఫస్టియర్‌లో గణితం తప్పాడు. సప్లమెంట్‌ పరీక్ష రాసినా ఫలితం లేకపోయింది. 1984–85లో ఇంటర్‌ సెకండరియర్‌లో ప్రవేశించాడు. ఆ సంవత్సరం వార్షిక పరీక్షలో సెకండరియర్‌ ఉత్తీర్ణుయ్యాడు. కానీ, ప్రథమ సంవత్సరం గణితం మాత్రం పాస్‌ కాలేదు. ఎంసెట్‌ రాస్తే ఇంజనీరింగ్‌లో మంచి ర్యాంకు వచ్చింది. కానీ ఇంటర్‌లో పాస్‌ కాకపోవడంతో ర్యాంకు వచ్చినా నిష్పయోజనమైంది.
 
ఎఫ్‌సీఐ గోదాంలో పని చేస్తూ..
ఇంటర్‌ ఫెయిల్‌ కావడంతో చేసేదేమీ లేక రెండు సంవత్సరాల పాటు ఎఫ్‌సీఐ గోదాంలో లేబర్‌గా పనికి కుదిరాడు. పని చేస్తూనే  ఇంటర్‌లో తప్పిన సబ్జెక్టు కోసం ట్యూషన్‌కు వెళ్లేవాడు. ఇన్ని సార్లు ఫెయిల్‌ అయ్యావు ..ఇక ఏం చదువుతావు లే.. పనికి వెళ్లూ అని తన తండ్రి చెప్పినా నిరాశ చెందలేదు. పనికి వెళ్తూనే ఫెయిల్‌ అయిన సబ్జెక్టులో పాస్‌ అయ్యేందుకు పట్టుదలతో చదివిడు. ఒక సంవత్సరం ఉప్పలపహాడ్‌ సమీపంలోని సంగీత కెమికల్స్‌లో పని చేసేవాడు వేణు. అలా పని చేసూకుంటూ 1987 అక్టోబర్‌లో ఫెయిల్‌ అయిన సబ్జెక్టు పరీక్ష రాసి పాసయ్యాడు. అక్కడి నుంచి   వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1988లో సిటీ గవర్నమెంట్‌ డిగ్రీ కళాశాలలో చేరాడు. డిగ్రీ చేస్తూనే వివిధ కంపెనీల్లో పార్ట్‌టైం పని చేస్తూ తన చదువుకు అయ్యే ఖర్చులు వెళ్లదీస్తూ చదివాడు. 

గణితంలో ఫెయిల్‌ అయ్యాననే కసితో...
తాను టెన్త్, ఇంటర్‌లో మ్యాథ్స్‌ సబ్జెక్టులో ఫెయిల్‌ అయ్యాననే కసితో మ్యాథ్స్‌ను బాగా నేర్చుకుని అదే సబ్జెక్టులో బీఈడీలో చేరి విజయవంతంగా పూర్తి చేశాడు. 1994 డీఎస్సీలో ఎస్‌జీటీగా ఎంపికయ్యాడు. మొదటి ఉద్యోగాన్ని 1995లో ఆత్మకూర్‌(ఎం) మండలం కూరెళ్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాను. 2009లో స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్న తి వచ్చింది. ప్రస్తుతం పిల్లలమర్రి జెడ్పీహెచ్‌ఎస్‌లో గణితం స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.

పరీక్ష అనేది జీవితంలో ఒక భాగమే
పరీక్ష అనేది జీవితంలో ఒక భాగమే కానీ.. పరీక్షే జీవితం కాదు. ప్రతి ఓటమిని ఛాలెంజ్‌గా తీసుకోవాలి. మన బల, బలహీనతలను అంచనవేసుకొని ముందుకెళ్లాలి. ఎక్కడ అపజయం ఎదురైందో అక్కడే పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తాం. పరీక్ష ఫెయిల్‌ అయితే జీవితం అయిపోయిందనే భావన మన మనసులో ఉండకూడదు. –కొచ్చెర్ల వేణు, స్కూల్‌ అసిస్టెంట్ పిల్లలమర్రి జెడ్పీహెచ్‌ఎస్‌

మరిన్ని వార్తలు