కీలక శాఖల్లో అభివృద్ధి సంస్కరణలు

17 Oct, 2019 12:14 IST|Sakshi

సీఈజీఐఎస్‌తో ఆర్థిక, ప్రణాళిక శాఖల ఒప్పందం 

మంత్రి హరీశ్‌ సమక్షంలో సంతకాలు 

సాక్షి,హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా కీలక శాఖల్లో అభివృద్ధి సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు అభివృద్ధి పథంలో అవసరమైన రోడ్‌మ్యాప్‌లు తయారు చేసి సంస్కరణల ఫలితాలు అధ్యయనం చేసేందుకు గాను సెంటర్‌ ఫర్‌ ఎఫెక్టివ్‌ గవర్నెన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్టేట్స్‌ (సీఈజీఐఎస్‌)తో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖలు ఎంవోయూ కుదుర్చుకున్నాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ప్రణాళిక బోర్డు వైస్‌చైర్మన్‌ బి.వినోద్‌ కుమార్‌ల సమక్షంలో బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో త్రైపాక్షిక ఒప్పందంపై ఆయా శాఖలు, సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు.

ఈ ఒప్పందం ప్రకారం ఆర్థిక, సామాజిక అభివృద్ధి, ప్రజాధన వ్యయంలో నైపుణ్యం పెంచడమే లక్ష్యంగా చతుర్ముఖ వ్యూహం అవలంభించనున్నారు. పలు రంగాల్లో వస్తున్న ఫలితాలపై సమాచారాన్ని సేకరించడం, దాని ఆధారంగా పనితీరు మెరుగుపర్చుకోవడం, బడ్జెట్‌ రూపకల్పన, ప్రణాళికల అమలులో వ్యూహాత్మకంగా వ్యవహరించడం, కీలక శాఖల్లో సంస్కరణలు తీసుకొచ్చేలా రోడ్‌మ్యాప్‌లు తయారు చేసి ఆయా సంస్కరణల ఫలితాలను ఎప్పటికప్పుడు బేరీజు వేయడంలో ఇరు పక్షాలు కలసి పనిచేయనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్థిక సలహాదారు జీఆర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు, సీఈజీఐఎస్‌ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌. కార్తీక్‌ మురళీధరన్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు