ఉద్యాన జోన్‌గా ...

22 Jun, 2014 23:59 IST|Sakshi
ఉద్యాన జోన్‌గా ...

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  హైదరాబాద్ ప్రజల అవసరాలను తీర్చేందుకు కొత్త ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాను ఉద్యాన జోన్‌గా వృద్ధి చేయాలని భావిస్తోంది. నగరజీవికి కావాల్సిన కూరగాయలు, పండ్లు, పాలు, పూలతోపాటు ఇతరాలను జిల్లా నుంచే సమకూర్చేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా రైతాంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళిక సైతం తయారవుతోంది. మహానగరం చుట్టూ 60 కిలోమీటర్ల మేర ఉద్యాన, పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలని గతవారం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశం లో నిర్ణయించారు. దీంతో నగరవాసుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులు పెంచేందు కు ఉద్యాన, పాడి పరిశ్రమలను అభివృద్ధి చేయాలని సర్కారు భావిస్తుండడంతో ఉద్యాన రైతులకు త్వరలో మంచిరోజులు రానున్నాయి.
 
ఆశయం పాతదైనా.. ఆచరణ కొత్తగా..
వాస్తవానికి జిల్లాలో వేలాది ఎకరాల్లో పరిశ్రమలు పెట్టడంతో వ్యవసాయ రంగం దెబ్బతిన్నది. దీంతో ప్రత్యేక అగ్రికల్చర్ జోన్ ఏర్పాటుచేసి రైతులకు ఉపాధి కల్పించాలని గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయించారు. ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో ఈ మహత్తర ఆశయం అటకెక్కింది. తాజాగా కొత్త రాష్ట్రం ఏర్పాటు కావడం.. హైదరాబాద్ అవసరాల దృష్ట్యా మళ్లీ ఈ ఆశయం తెరపైకొచ్చింది. ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించిన నేపథ్యంలో.. తాజాగా ఉద్యాన జోన్ ఏర్పాటుకు యంత్రాంగం ప్రణాళికలు రూపొందిస్తోంది.
 
‘పొరుగు’ ఉత్పత్తుల దిగుమతిని తగ్గించేందుకు..

హైదరాబాద్ మహానగరానికి అవసరమైన కూరగాయలు, పండ్లు, పూలతోపాటు పాల ఉత్పత్తులన్నీ ప్రస్తుతం పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి దిగుమతి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పన్నుల భారంతో వినియోగదారులు ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోంది. తాజాగా వీటిని చవకగా అందించేందుకు ప్రస్తుత సర్కారు చర్యలు చేపట్టింది. స్థానిక ఉత్పత్తులపై పెద్దగా పన్ను భారం ఉండకపోవడంతోపాటు ఇక్కడి రైతులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ఈ జోన్ ఉపకరిస్తుందని భావిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 12వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులేవీ లేకపోవడంతో రైతులు ఎక్కువగా మెట్ట పంటలు, ఉద్యాన పంటల్నే సాగుచేస్తున్నారు.
 
ఈ పంటలకు జిల్లా పరిధిలోని నేలలు అనువైనవి కూడా. భారీ రాయితీలతో ఏర్పాటుచేసే ఈ జోన్ కింద జిల్లాలో కనిష్టంగా 50వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని గత వారం జరిగిన సమావేశంలో ఉద్యాన శాఖ అధికారులను సీఎం  ఆదేశించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి గతవారం చేవెళ్ల మండలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్యాన పంటల తీరును పరిశీలించి వెళ్లారు.

మరిన్ని వార్తలు