ప్రత్యక్షమా...పరోక్షమా..?

19 Apr, 2019 04:44 IST|Sakshi

మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేషన్‌ మేయర్ల ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తు 

ప్రత్యక్షంగా ఎన్నికలు జరిపే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశాలు?

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేషన్‌ మేయర్లను నేరుగా ఎన్నుకునే విధానాన్ని తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందా..? ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్న విధానాన్ని అధ్యయనం చేయాలని సీఎం కేసీఆర్‌ పురపాలక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారా..? వారి నివేదిక సానుకూలంగా వస్తే ఈ ఎన్నికను ప్రత్యక్షంగా నిర్వహించేలా కొత్త మున్సిపల్‌ చట్టంలో పొందుపర్చనున్నారా..? అంటే అవుననే అంటున్నాయి ఉన్నతస్థాయి వర్గాలు. తుది నిర్ణయం దశకు ఇంకా రానప్పటికీ ప్రత్యక్ష పద్ధతిలో పురపాలక సంఘాలకు ఎన్నికలు జరిపితే ఎలా ఉంటుందనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. ఇటీవల మున్సిపల్‌ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చిందని సమాచారం.  

ఏకపక్షంగా వ్యవహరిస్తే ఎలా.. 
ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే గెలుపొందిన ప్రజాప్రతినిధులు ఏకపక్షంగా వ్యవహరించే అవకాశముంటుందని, రాజ్యాంగ పరంగా అవసరం అయినప్పుడు పదవి నుంచి తప్పించడం కష్టమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీ కార్పొరేటర్లు/కౌన్సిలర్లు ఎక్కువ సంఖ్యలో గెలిస్తే ఆధిపత్య పోరుతో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి ఆగిపోయే అవకాశం ఉందని కూడా భావిస్తోంది. ప్రస్తుత విధానంలో పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే పార్టీ ఫిరాయిం పులు, క్యాంపు రాజకీయాలకు అవకాశం ఇచ్చినవారమవుతామనే కోణాన్నీ పరిశీలిస్తోంది.

మున్సిపల్‌ వర్గాల సమాచారం ప్రకారం మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఎన్నికలు మినహా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మున్సిపల్‌ చైర్మన్లు, మేయర్ల ఎన్నికను పరోక్ష పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రత్యక్ష పద్ధతిని తీసుకువస్తే బాగుంటుందా..? ప్రస్తుత విధానంలోనే ఎన్నికలకు వెళ్దామా అన్న దానిపై త్వరలోనే సీఎం కేసీఆర్‌కు ఉన్నతాధికారులు ఓ నివేదిక ఇవ్వనున్నారు. దీన్ని పరిశీలించిన అనంతరం కేసీఆర్‌ తుది నిర్ణయం తీసు కున్న తర్వాతే కొత్త చట్టంలో పెడతారని, నూతన మున్సిపల్‌ చట్టం పూర్తయిన తర్వాతే పురపాలక సం ఘాల ఎన్నికల కసరత్తు ప్రారంభిస్తారని తెలుస్తోంది.  

చట్టం తర్వాతే ఎన్నికలు 
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 142 మున్సిపల్‌ పాలకవర్గాల పదవీకాలం జూన్‌తో ముగియనుంది. ఆ తర్వాత కొత్త చట్టానికి రాజముద్ర వేయించుకొని ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. చట్టం మనుగడలోకి వచ్చిన అనంతరం వార్డుల పునర్విభజన చేసిన తర్వాత మున్సిపల్‌ ఎన్నికలకు ప్రభుత్వం ముందడుగు వేసే సూచనలు కనిపిస్తున్నాయి.

జూన్‌ నాటికి రెడీ
పురపాలక చట్టం ముసాయిదాను చకచకా రూపొందిస్తున్న మున్సిపల్‌ శాఖ జూన్‌ నాటికి తుదిరూపు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఆలోపు వివిధ రాష్ట్రాలు, దేశాల్లో అమలవుతున్న చట్టాలను అధ్యయనం చేస్తోంది. కొత్త చట్టంలో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఉద్యోగులు, పాలకవర్గం సభ్యులకు సమష్టి బాధ్యతను అప్పగించాలనే అంశాన్ని పెట్టాలని దాదాపు నిర్ణయించింది. అదే సమయంలో నిధుల దుర్వినియోగం, విధి నిర్వహణలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా పాలకవర్గ సభ్యులపై వేటు వేసేలా చట్టంలో ప్రత్యేక సెక్షన్‌ను పొందుపరుస్తోంది.

మరిన్ని వార్తలు