పంచాయతీల్లోనూ ఎల్‌ఆర్‌ఎస్‌

24 Nov, 2019 03:58 IST|Sakshi

లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సర్కారు సూత్రప్రాయ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటివరకు నగరాలు, పట్టణాలకే పరిమితమైన అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకాన్ని (ఎల్‌ఆర్‌ఎస్‌) ఇకపై గ్రామ పంచాయతీల పరిధిలోనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అలాగే భవనాల క్రమబద్ధీకరణ పథకాన్ని (బీఆర్‌ఎస్‌) కూడా వర్తింపజేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ మేరకు గత రెండు రోజులుగా కసరత్తు చేస్తున్న పంచాయతీరాజ్‌శాఖ పథకం అమలు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసింది. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ ద్వారా ఆర్థిక వనరులను సమకూర్చుకోవచ్చని భావిస్తోంది. పట్టణాభివృద్ధి సంస్థలు, డీటీసీపీ అనుమతి ఇచ్చిన లేఅవుట్లలోని ధరలతో పోలిస్తే వాటిలో తక్కువ రేట్లకే ప్లాట్లు లభించడం, అవి అక్రమ లేఅవుట్లని తెలియకపోవడంతో చాలా మంది సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆ స్థలాలను కొనుగోలు చేశారు. ప్రభుత్వం తీసుకొనే తాజా నిర్ణయంతో వారికి ఊరట లభించనుంది.

ప్రయోగాత్మకంగా రెండేసి లేఅవుట్లు... 
పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించడం ద్వారా ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్న ప్రభుత్వం దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసేందుకు క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా జిల్లాకు రెండేసి అనధికార లేఅవుట్లను పరిశీలించి వాటి క్రమబద్ధీకరణలో సాధకబాధకాలు, ప్రభుత్వానికి లభించే ఆదాయం ఇతరత్రా అంశాలను మదింపు చేయనుంది. ఈ మేరకు శనివారం పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు.. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి, సిద్దిపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాల పంచాయతీ అధికారులు, డివిజనల్‌ పంచాయతీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పైలట్‌ ప్రాతిపదికన... ఎంపిక చేసిన లేఅవుట్లలో రోడ్లు, డ్రైనేజీ తదితర కనీస సౌకర్యాలు కల్పించారా? పది శాతం స్థానిక పంచాయతీలకు గిఫ్ట్‌ డీడ్‌ చేశారా? ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఎంత మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ కింద పెనాల్టీని నిర్ధారించవచ్చనే దానిపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో జరిగే పల్లె ప్రగతి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశముంది.

ఆ మేరకు ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌పై మార్గదర్శకాలను జారీ చేసే వీలున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 68 మున్సి పాలిటీల్లో 173 గ్రామ పంచాయతీలను విలీనం చేశారు. అలాగే ఇప్పటికే మనుగడలో ఉన్న 42 పురపాలికల్లో 131 గ్రామ పంచాయతీలను విలీ నం చేశారు. వాటిలో హెచ్‌ఎండీఏ మినహా 43 మున్సిపాలిటీల పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం కింద స్థలాల/లేఅవుట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. తాజాగా పంచాయతీల్లోనూ ఈ పథకం అమలుకు కHదలిక మొదలు కావడంతో పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో లేని అక్రమ లేఅవుట్లలో స్థలాలు కొన్న వారికి ఉపశమనం కలగనుంది. అలాగే గ్రామ పంచాయతీల పరిధిలో 300 చద రపు మీటర్ల విస్తీర్ణంలో జీ+2 అంతస్తుల వరకే భవనాలకు అనుమతి జారీ చేస్తుండగా ఈ నిబంధనలు ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు బీఆర్‌ఎస్‌ కింద క్రమబద్ధీకరించుకునే వీలు కలగనుంది.

పీఆర్‌ చట్టంతో వెసులుబాటు... 
వాస్తవానికి స్థలాలు, భవనాల క్రమబద్ధీకరణ అధికారం పురపాలకశాఖకే ఉండేది. అయితే గతేడాది సర్కారు చేసిన కొత్త పంచాయతీరాజ్‌ చట్టంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ దీన్ని వర్తింపజేసేలా పంచాయతీరాజ్‌ శాఖకు అధికారం లభించింది. సెక్షన్‌ 113 ప్రకారం అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించే వెసులుబాటు ఉండటంతో దీనికి అనుగుణంగా పంచాయతీరాజ్‌శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గతంలో దీనిపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించగా తాజాగా రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌రావు ఈ పథకం అమలుపై అధికారులతో సమావేశం నిర్వహించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా