వినాశకర విధానాలతో ముందుకు వెళుతోంది

19 Mar, 2017 20:09 IST|Sakshi
వినాశకర విధానాలతో ముందుకు వెళుతోంది
హైదరాబాద్‌: పరిపాలన మీద ప్రభుత్వాలు దృష్టిపెట్టాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సూచించారు. మహాజన పాదయాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరైన సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసుకోవాలని.. లేదంటే సీపీఎం తయారుచేసిన ప్రజా సమస్యల ప్రణాళికలను పాటించండని సూచించారు. సమాజంలో అనేక మార్పులు రావాల్సిన పరిస్థితి ఉందన్నారు. అట్టడుగు వర్గాలు 93 శాతం ఉన్న తెలంగాణలో అభివృద్ధి ఫలాలు వారికే ముందు అందాల్సి ఉందని గుర్తు చేశారు.

వీర తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తిని మళ్లీ గుర్తు చేసుకోవాల్సిన సందర్బం వచ్చిందన్నారు. విభజన జరిగిన తరువాత కూడా తెలంగాణలో విధానాలు మారలేదని అన్నారు. ప్రజా ఆగ్రహానికి కేసీఆర్‌ నవ్వుతున్నారని.. ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురుచూసే రోజు దగ్గర్లోనే ఉన్నదని హెచ్చరించారు. నోట్ల రద్దు వ్యవహారం ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని.. వంద మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వినాశకర విధానాలతో ముందుకు వెళుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు కేంద్ర ప్రభుత్వం సృష్టించిన ఒక వైపరిత్యమని చెప్పారు. గుజరాత్ లోని అత్యధికంగా దొంగనోట్లు బయటపడ్డాయని పేర్కొన్నారు. బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్ ప్రారంభించిన ఈ పాదయాత్ర క్షేత్ర స్థాయిలో పనిచేసిందన్నారు. ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులే పాదయాత్ర విజయవంతం అవడానికి కృషి చేశాయన్నారు.
 
 
మరిన్ని వార్తలు