‘అందుకనే.. మళ్లీ అధికారాన్నిచ్చారు’

19 Jan, 2019 12:27 IST|Sakshi

అసెంబ్లీలో గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగం..

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు. రెండోసారి అధికారం కట్టబెట్టిన రాష్ట్ర ప్రజల బతుకుల్లో సుఖశాంతులు వెల్లివిరిసే బంగారు తెలంగాణ నిర్మిస్తామని ఉద్ఘాటించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తరపున అసెంబ్లీలో ఆయన శనివారం ఏంమాట్లాడారంటే..

నీటి పారుదల రంగానికి గడిచిన నలుగున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 77  వేల 777 కోట్ల ఖర్చు చేసింది. రాబోయే కాలంలో లక్షా 17 వేల కోట్ల అంచనా వ్యయంతో పనులు చేస్తుంది. సమైక్య రాష్ట్రంలో ఉద్దేశ్యపూర్వకంగా ధ్వంసం చేసిన చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ సత్ఫలితాలనిచ్చింది. ఇప్పటికే నాలుగు దశల్లో 20 వేల 171 చెరువుల పునరుద్ధరణ చేయడం జరిగింది. 

తెలంగాణ వచ్చేనాటికి తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొని ఉంది. ఈ సంక్షోభాన్ని తెలంగాణ తొమ్మిది నెలల్లోనే అధిగమించింది. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు 28 వేల మెగావాట్ల స్థాపిత సామర్థ్యం గల కొత్త విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. 1080 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న భద్రాద్రి పవర్ ప్లాంట్‌లో ఈ ఏడాది నుంచే ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.

తెలంగాణ ఏర్పడే నాటికి 7,778 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం మాత్రమే ఉంటే ప్రస్తుతం16 వేల 503 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం అందుబాటులో ఉంది. నా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. కేసీఆర్‌ నాయకత్వంలోని ప్రభుత్వం అనేక రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా పురోగమిస్తోంది. అందువల్లనే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసం ప్రకటిస్తూ తీర్పునిచ్చారు.

ఈ విజయాన్ని నా ప్రభుత్వం వినమ్రంగా స్వీకరిస్తూ.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చర్యలు ప్రారంభించింది. ప్రస్తుత పద్ధతిలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగిస్తూ..  సొంత ఇంటి స్థలం ఉన్న పేదలకు గృహ నిర్మాణం కోసం ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తాం. రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ భృతి లక్ష రూపాయల వరకు రైతు రుణ మాఫీ చేస్తాం. 

ఎస్సీ ఎస్టీ జనాభా సమగ్ర అభివృద్ధి కోసం..  ప్రత్యేక పథకాల రూపకల్పన కోసం వేసిన కమిటీ ఇచ్చిన నివేదికను నా ప్రభుత్వం అమలు చేస్తోంది. చట్టసభల్లో బీసీలకు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం పోరాటం చేస్తోంది. ఎస్టీలకు 10 శాతం, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీ తీర్మానం చేసింది.. ఈ రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తోంది. ఎస్సీ వర్గీకరణ కోసం కూడా కేంద్రం పై పోరాటం చేస్తుంది. రైతులకు గిట్టుబాటు ధర రావడం కోసం పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం, ఐకెపి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ యూనిట్లు పనిచేస్తాయి. సందర్భోచితంగా ఐకేపీ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 

గత నాలుగున్నరేళ్లలో మేనిఫెస్టోలో లేని ఎన్నో ప్రజోపయోగ పథకాలను ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అదేవిధంగా రాబోయే ఐదేళ్లలో రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలకు అనుగుణంగా నూతన లక్ష్యాలు, ప్రణాళికలు, పథకాలను నిర్దేశించుకుంటూ నా ప్రభుత్వం పురోగమిస్తుంది. ప్రజల బతుకుల్లో సుఖశాంతులు వెల్లివిరిసే బంగారు తెలంగాణ నిర్మాణానికై ప్రజలు అందించిన ఈ అపూర్వ విజయం పునాదిగా నా ప్రభుత్వం మరోసారి పునరంకితం అవుతుందని ఈ ఉభయ సభల సాక్షిగా నిండు విశ్వాసంతో ప్రకటిస్తున్నాను. జైహింద్‌.

మరిన్ని వార్తలు