యాదగిరీశుడి సన్నిధిలో గవర్నర్‌

11 Feb, 2019 10:03 IST|Sakshi
స్వామివారి దర్శనం అనంతరం ఆలయం వెలుపలికి వస్తున్న గవర్నర్‌ నరసింహన్‌

తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ కుటుంబ సమేతంగా ఆదివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో వారికి ఘన స్వాగతం పలికారు. వేద పండితులు చతుర్వేదాలు పఠిస్తూ 30 నిమిషాల పాటు మహాదాశీర్వచనం చేశారు. రాష్ట్ర, దేశం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానని గవర్నర్‌ తెలిపారు. ఈసారి నాకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.  

యాదగిరికొండ (ఆలేరు) : రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు ఆదివారం యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు గవర్నర్‌ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో గర్భాలయ ద్వారం వద్ద పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామిఅమ్మవార్లకు సతీసమేతంగా సువర్ణ పుష్పార్చనగావించారు.  అనంతరం ఆయనకు ఆలయ అర్చకులు వేద పండితులు చతుర్వేదాల పఠనంతో సుమారు 30 నిమిషాల పాటు మహాదాశీర్వచనం చేశారు.

గవర్నర్‌ పర్యటన సాగిందిలా..
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలోకి ఆయన సాయంకాలం 5ః50  నిమిషాలకు వచ్చారు.అక్కడి నుంచి  5ః53 గంటలకు ఆయన గర్భాలయంలోకి ప్రవేశించారు.అక్కడ ఆయన సుమారు 20నిమిషాల పాటు గర్భాలయంలోని స్వామివారి చెంత పూజల్లో పాల్గొన్నారు. అనంతరం 6ః08 గంటలకు వెలుపలికి వచ్చారు.  అక్కడినుంచి ఆలయ ముఖ మండపంలోని హుండీలో గవర్నర్‌ సతీమణి సుమారు రూ.5వేలు సమర్పించారు.   6ః15 గంటల నుంచి ఆశీర్వచనం ప్రారంభం చేశారు. సుమారు 30 నిమిషాల పాటు ఈ మహాదాశీర్వచనం చేశారు.  6ః45 గంటల వరకు వేద పండితులు, ఘనాపాఠీలు, ఆలయ అర్చకులు కలిసి చతుర్వేదాలు, తిరుప్పావై పాశురాల పఠనంతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది.
  
భారీ బందోబస్తు
భువనగిరి అర్భన్‌ : గవర్నర్‌ రాక సందర్భంగా పోలీస్‌ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. వసంత పంచమిని పురస్కరించుకుని ఆయన సతీసమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తిరిగి వెళ్లే వరకు రహదారుల వెంట జడ్‌ ఫ్లస్‌ కేటగీరితో బందోబస్తును ఏర్పాటు చేశారు. యాదాద్రి నుంచి అవుషాపూర్‌ వరకు భద్రత కల్పించారు. వాహనాలు అదుపు చేసేందుకు అక్కడక్కడ ట్రాఫిక్‌ పోలీసులు నియమించారు.

వివాదాలకు తాగులేకుండా  ప్రథమపౌరుడి పర్యటన సాఫీగా ముగియడంతో అధికా రయంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.  గవర్నర్‌ పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే సునీతామహేందర్‌రెడ్డి, కలెక్టర్‌ అనితారాంచంద్రన్‌ , ఆర్డీఓ భూపాల్‌రెడ్డి, ఏసీపీలు  మనోహర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, డీసీపీ రాంచంద్రారెడ్డి, ఈఓగీతారెడ్డి, ఆలయ ప్రధానార్చకులు కారంపూడి నరసింహాచార్యులు, ఏఈఓ రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు