రుణాల పంపిణీలో తాత్సారం వద్దు

13 Jul, 2018 01:55 IST|Sakshi

నాబార్డ్‌ 37వ వ్యవస్థాపక దినోత్సవంలో గవర్నర్‌ నరసింహన్‌

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ రుణాల పంపిణీలో బ్యాంకులు తాత్సారం చేయొద్దని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. రుణాల పంపిణీ సకాలంలో జరిగితేనే పంటలసాగు ప్రక్రియ సులభతరమవుతుంద న్నారు. సూచించారు. గురువారం ఇక్కడ నాబార్డ్‌ కార్యాలయంలో జరిగిన 37వ వ్యవస్థాపక దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడంలో నాబార్డు కీలకపాత్ర పోషిస్తోందన్నారు. 

మహిళ, గిరిజన రైతులను ప్రోత్సహించాలని, ఆ మేరకు వినూత్న కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వాలు నీటిపారుదల ప్రాజెక్టులకు భారీ మొత్తంలో బడ్జెట్‌ కేటాయిస్తున్నా వ్యవసాయ అభివృద్ధికి అదేస్థాయిలో ప్రోత్సాహకాల రూపంలో ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయని, వీటిని క్షేత్రస్థాయిలో రైతాంగానికి తెలియజేయాలని, ఆమేరకు నిరంతరం శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు.

వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం వాడకాన్ని పెంచాలని, దీంతో తక్కువ సమయంలో అధిక దిగుబడి సాధించవచ్చని, ఖర్చు తగ్గి రైతులకు లాభాలు పెరుగుతాయన్నారు. నీటి గొడవలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటే వ్యవసాయ పురోగతి వేగంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.  కార్యక్రమంలో నాబార్డు తెలంగాణ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ పి.రాధాకృష్ణన్, ఏపీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ కె.సురేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు