మనస్పర్ధలు సర్దుకుంటాయ్‌

10 Jan, 2018 02:40 IST|Sakshi

కాంగ్రెస్‌ నేతల ఆరోపణపై గవర్నర్‌ నరసింహన్‌

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో ఏర్పడిన మనస్పర్ధలు త్వరలోనే సర్దుకుంటాయని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. కుటుంబ సభ్యుల మధ్య వచ్చే విభేదాల్లాంటివే ఇవికూడా.. వాటిని పైకి చెప్పనవసరంలేదని వ్యాఖ్యానిం చారు. ఢిల్లీలో మంగళవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సమావేశమైన ఆయన తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులపై నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై దృష్టిసారించామని త్వరలోనే అన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు. రాజ్‌భవన్‌లను ప్రజలకు మరింత చేరువ చేయడంపై హోం శాఖకు పలు సూచనలు చేసినట్టు తెలిపారు. గవర్నర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న కాంగ్రెస్‌ నేతల ఆరోపణలపై విలేకరులు ప్రశ్నించగా.. అపార్థాలతో బంధాలను విడగొట్టుకోలేమన్నారు.

ప్రధాని మోదీతో గవర్నర్‌ భేటీ
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి గవర్నర్‌ తీసుకెళ్లారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో ప్రధానితో అరగంటసేపు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని పరిస్థితులను ప్రధానికి వివరించినట్లు తెలిసింది. కేంద్రం ఇచ్చిన అనుమతులతో తెలంగాణలో కాళేశ్వరం, ఏపీలో పోలవరం ప్రాజెక్టుల పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు. రెండు రాష్ట్రాల్లోనూ శాంతిభద్రతల పరంగా ఎలాంటి సమస్యలు లేవని నివేదించారు.

మరిన్ని వార్తలు