పీహెచ్‌డీ స్థాయిని దిగజార్చొద్దు

9 Aug, 2018 03:10 IST|Sakshi
సమీక్షలో పాల్గొన్న గవర్నర్‌ నరసింహన్, డిప్యూటీ సీఎం కడియం, పాపిరెడ్డి తదితరులు

అడ్డగోలుగా ప్రవేశాలు చేపట్టవద్దు 

వైస్‌ చాన్స్‌లర్లు, రిజిస్ట్రార్లకు గవర్నర్‌ నరసింహన్‌ ఆదేశం 

ఏ వర్సిటీలో ఎంత మంది..ఎన్నేళ్లుగా పీహెచ్‌డీలు చేస్తున్నారు

సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వండి 

ఐదేళ్లకు మించితే ప్రవేశాలు రద్దు చేయండి 

వర్సిటీల పనితీరుపై సమీక్షలో గవర్నర్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘‘డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) సాధారణ డిగ్రీ కాదు. భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడే ఓ పరిశోధన. అలాంటి పీహెచ్‌డీ స్థాయిని దిగజార్చవద్దు. కొన్ని యూనివర్సిటీలు ఇష్టారాజ్యంగా ప్రవేశాలు చేపడుతున్నాయి. అడ్డగోలుగా ప్రవేశాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాంటి వాటన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెట్టండి’’ అని యూనివర్సిటీల వైస్‌ చాన్స్‌లర్లు, రిజిస్ట్రార్లను గవర్నర్‌ నరసింహన్‌ ఆదేశించారు. ‘‘ఇప్పటివరకు ఏ యూనివర్సిటీ ఎన్ని పీహెచ్‌డీలు ప్రదానం చేసింది, ప్రస్తుతం ఏ యూనివర్సిటీలో ఎంతమంది పీహెచ్‌డీలు చేస్తున్నారు, వారు ఎన్నేళ్లుగా చేస్తున్నారు’’అన్న సమగ్ర వివరాలను సేకరించి తనకు నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డికి సూచించారు.

నాలుగైదేళ్లకు మించి పీహెచ్‌డీకి సమయం ఇవ్వడానికి వీల్లేదని, ఐదేళ్లు దాటిన వారి ప్రవేశాలను రద్దు చేయాలని, అలాంటి వారు ఎందరు ఉన్నారో తేల్చాలని వైస్‌ చాన్స్‌లర్లను ఆదేశించారు. పీహెచ్‌డీ ప్రవేశాలను కూడా నెట్, స్లెట్‌ ప్రతిభ ఆధారంగా చేపట్టేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. యూనివర్సిటీల పనితీరుపై వైస్‌ చాన్స్‌లర్లు, రిజిస్ట్రార్లతో బుధవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి గవర్నర్‌ సమీక్షించారు. 

ఇష్టారాజ్యంగా వ్యవహరించొద్దు.. 
పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధించి యూనివర్సిటీలు ఒకే రకమైన నిబంధనలు అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, ఇకపై అలాంటి వాటిని సహించబోనని గవర్నర్‌ తేల్చిచెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నిబంధనల ప్రకారమే ప్రవేశాలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు. యూనివర్సిటీల్లో బాలికలపై ఆకృత్యాలు జరక్కుండా పక్కా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహిళా హాస్టళ్ల పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, వారికి భద్రత కల్పించాలని సూచించారు. మహిళా ప్రొఫెసర్‌ నేతృత్వంలో కమిటీ, గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. 

సంతృప్తిగా ఉన్నా 
సమీక్ష అనంతరం గవర్నర్‌ నరసింహన్‌ విలేకరులతో మాట్లాడారు. ‘విశ్వవిద్యాలయాల అచీవ్‌మెంట్స్‌ ఎలా ఉన్నాయి సార్‌?’అని విలేకరులు అడగ్గా ‘చాలా హ్యాపీ. ఇంతకంటే ఇంకేం అచీవ్‌మెంట్‌ కావాలి’అని పేర్కొన్నారు. విద్యలో నాణ్యత పెంచేందుకు బయోమెట్రిక్‌ హాజరు విధానం అమలు చేయాలన్నారు. విద్యార్థులకు అవసరమైన కొత్త కోర్సులను ప్రవేశ పెట్టాలని, అవి ఉపాధి అవకాశాలు పెంచేలా ఉండాలన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు, ఇతర విద్యార్థులతో కలసి గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి కృషి చేయాలని వీసీలకు సూచించామని తెలిపారు.

ఉన్నత విద్య పటిష్టానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని కితాబిచ్చారు. సమావేశంలో చర్చించిన పలు అంశాలను కడియం వెల్లడించారు. ప్రస్తుతం పీహెచ్‌డీ ప్రవేశాల్లో గందరగోళం నెలకొందని, నెట్, స్లెట్, సెట్‌లలో మెరిట్‌ సాధించిన వారికే యూజీసీ నిబంధనల మేరకు ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గైడ్స్‌ సమర్థతను పరిగణనలోకి తీసుకోవాలని గవర్నర్‌ సూచించారని చెప్పారు. విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య, కళాశాల, సాంకేతిక విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్, శాతవాహన యూనివర్సిటీ ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ చిరంజీవులు, ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్లు ప్రొఫెసర్‌ లింబాద్రి, ప్రొఫెసర్‌ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

అలాంటి కాలేజీలపై దయాదాక్షిణ్యాలు వద్దు 
యూనివర్సిటీల్లో ప్రస్తుతం ఉన్న కోర్సులు సమాజానికి ఏ మేరకు ఉపయోగపడుతున్నాయో సమీక్షించి తగిన మార్పులు చేయాలని గవర్నర్‌ సూచించారు. అవి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేలా ఉండాలన్నారు. బోధనలో నాణ్యత ప్రమాణాలు పెంచాలని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కొనసాగే కాలేజీల్లో పక్కాగా నాణ్యత ప్రమాణాలు ఉండాల్సిందేనని, నాణ్యత ప్రమాణాలు లేని, మెరుగైన విద్యను అందించని కాలేజీలపై దయాదాక్షిణ్యాలు అక్కర్లేదని, అలాంటి వాటిని మూసేయాలని ఆదేశించారు.

ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా యూనివర్సిటీలు తమ సేవలను అందించి నిధులను సమీకరించుకోవాలన్నారు. వచ్చే ఏడాది విద్య, వైద్యానికి ప్రభు త్వం ఎక్కువ మొత్తంలో నిధులను కేటాయించనుందని పేర్కొన్నారు. న్యాక్‌ గుర్తింపు, 12 ఎఫ్, 12బీ స్థాయి కోసం అన్ని యూనివర్సిటీలు కృషి చేయాలని ఆదేశించారు. కామన్‌ అకడమిక్‌ కేలండర్‌ అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నత విద్యా మండలి యూజీసీ తరహాలో వ్యవహరించాలని సూచించారు. ఆర్‌జీయూకేటీ, వెటర్నరీ యూనివర్సిటీకి అభినందనలు తెలిపారు. 

మరిన్ని వార్తలు