నూరు శాతం అక్షరాస్యత సాధించాలి

15 Nov, 2018 01:23 IST|Sakshi

ఉపాధ్యాయులకు సూచించిన గవర్నర్‌ నరసింహన్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని గవర్నర్‌ నరసింహన్‌ అన్నా రు. పాఠశాలల్లో డ్రాపవుట్స్‌ను నివారించాల్సిన అవసరం ఉందని, దీనికోసం టీచర్లంతా విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి కౌన్సిలింగ్‌ ఇవ్వాలని సూచించారు. అప్పుడే నూరు శాతం అక్షరాస్యత సాధించగలమని అన్నారు. బుధవారం రాజ్‌భవన్‌ సంస్కృతి భవనంలో మహాత్మాగాంధీ డిజిటల్‌ మ్యూజియం ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో గవర్నర్‌ పాల్గొని ప్రసంగించారు.

మహా త్మాగాంధీ కలలను నెరవేర్చేందుకు టీచర్లు తమ వంతు బాధ్యత ను నిర్వర్తించాలని సూచించారు. క్లీన్‌ ఇండియా సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చా రు. అందుకు 2 వారాలకోసారి టీచర్లు, విద్యార్థులు కలిసి పాఠశాలను శుభ్రం చేయాలని, చెట్లను నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని తెలిపారు. బాలల దినోత్సవం నాడు చాక్‌లెట్లను పంచితే సరిపోదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులను నిర్వహించి విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని టీచర్లకు సూచించారు. అనంతరం పలు పాఠశాలలకు చెందిన చిన్నారులు గవర్నర్‌ను కలిసి పుష్పగుచ్ఛాలను అందించారు.

మరిన్ని వార్తలు