అన్నివేళల్లో అందుబాటులో ఉండాలి

3 Aug, 2019 08:02 IST|Sakshi

గ్రూప్‌–1 సర్వీస్‌ అధికారులకు గవర్నర్‌ ఉద్బోధ

విధి నిర్వహణలో ప్రజలతో మమేకమవ్వాలని సూచన

రాష్ట్రాభివృద్ధికి పూర్తి శక్తి సామర్థ్యాలతో కృషిచేయాలని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పును తీసుకొచ్చేందుకు గ్రూపు–1 అధికారులు అన్నివేళల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ సూచించారు. ప్రజల సమస్యలు, బాధలను అర్థం చేసుకోవడానికి అధికారులు కృషి చేయాలని.. వారి సమస్యలకు శాశ్వత పరిష్కారాలను కనుగొనడంలో సానుభూతిని ప్రదర్శించాలన్నారు. బంగారు తెలం గాణ సాధనకు ఇది అత్యావశ్యకమని చెప్పారు. శుక్ర వారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో రాష్ట్ర గ్రూపు–1 సర్వీసు అధికారుల ఫౌండేషన్‌ కోర్సు ముగింపు కార్యక్రమంలో గవర్నర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ప్రభుత్వాధికారులు ప్రజానుకూలంగా ఉండరనే భావన సమాజంలో ఉందని.. దానిని దూరం చేసేందుకు అధికారులు తమ విధి నిర్వహణలో ప్రజలతో మరింత మమేకమై పని చేయాలని సూచించారు.

అన్ని వర్గాలకు సేవ చేయాలి.. 
బలమైన సామాజిక మాధ్యమాలు, శక్తివంతమైన పౌర సమాజం, జాగరూకతతో కూడిన ప్రజలున్న ప్రస్తుత పారదర్శక ప్రపంచంలో వ్యక్తిగత సామర్థ్యం, నిబద్ధత, ఇతర అంశాలు మరింత మెరుగుపర్చుకోవడం ద్వారా ప్రజానుకూల అధికారులుగా ఎదగాలని గవర్నర్‌ ఆకాంక్షించారు. సమాజంలోని అన్ని వర్గాలకు, ముఖ్యంగా బడుగులు, పేదలకు సేవ చేయడానికి అధికారులు కృషి చేయాలని సూచించా రు. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కారణంగా అధికారులు ప్రజలతో మమేకమై స్నేహపూర్వకంగా ఎదిగేందుకు కావాల్సిన అరుదైన అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు.
 
విధులకే పరిమితమవ్వొద్దు.. 
అధికారులు కేవలం తమ విధులకే పరిమితం కాకూడదని గవర్నర్‌ చెప్పారు. రాష్ట్రం బహుముఖంగా అభివృద్ధి చెందేందుకు అధికారులు తమ పూర్తి శక్తి సామర్థ్యాలను ఉపయోగించాలన్నారు. స్వాగతోపన్యాసం చేసిన ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డీజీ బీపీ ఆచార్య మాట్లాడుతూ కొత్తగా గ్రూప్‌–1 సర్వీసుల్లో చేరిన అధికారులు రాష్ట్రాభివృద్ధికి తమను తాము పునరంకితం చేసుకునేలా ఫౌండేషన్‌ కోర్సును నిర్వహించామన్నారు. కార్యక్రమంలో భాగంగా శిక్షణ పూర్తిచేసుకున్న అధికారులకు గవర్నర్‌ సర్టిఫికెట్లు అందజేశారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన డీఎస్సీ నూకల ఉదయ్‌రెడ్డికి, రాతపరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన డీపీవో పేరిక జయసుధకు ఆయన జ్ఞాపికలు అందజేశారు. అలాగే యువ అధికారుల హౌస్‌ జర్నల్‌ సొసైటీ రూపొందించిన ‘సవ్వడి’జర్నల్‌ను, ఐఏఎస్‌ అధికారిణి రజనీ శేఖరీ సిబాల్‌ రచించిన ‘ఫ్రాగ్రెంట్‌ వర్డ్స్‌’పుస్తకాన్ని గవర్నర్‌ ఆవిష్కరించారు.   

>
మరిన్ని వార్తలు