ఆ క్లాజు వద్దు

24 Jul, 2019 01:13 IST|Sakshi

మున్సిపల్‌ బిల్లుకు గవర్నర్‌ సవరణ!

ఎన్నికల షెడ్యూల్‌ ఖరారు అధికారం ప్రభుత్వం ఉంచుకోవడంపై అభ్యంతరం

ఆ క్లాజు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వెల్లడి

షెడ్యూల్‌ ఖరారు ఈసీకే ఇస్తూ బిల్లు సవరించాలని సూచన

సవరణతో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన సర్కారు?

అధికారికంగా స్పందించని రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్‌

సాక్షి, హైదరాబాద్‌ : నూతన పురపాలికల బిల్లుపై గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అభ్యంతరం వ్యక్తంచేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఓ క్లాజును  బిల్లు నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేశారు. పురపాలక ఎన్నికల షెడ్యూల్‌ ఖరారు చేసే అధికారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కట్టబెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం తన దగ్గరే ఉంచుకోవడం సరికాదని పేర్కొన్నారు. పురపాలక ఎన్నికల షెడ్యూల్‌ ఖరారు చేయడం రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోని అంశమని, ఈ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన దగ్గరే ఉంచుకుంటే ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నిబంధన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243కి విరుద్ధమని తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఈ బిల్లుకు గవర్నర్‌ ఓ సవరణ సూచించారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు కూడా ధ్రువీకరించాయి.

గోప్యతతో గందరగోళం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కొత్త పురపాలికల బిల్లును ఈనెల 19న రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలో ఆమోదించిన తర్వాత గవర్నర్‌ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపించింది. అయితే, మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ ఖరారు చేసే అధికారాలను తిరిగి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అప్పగిస్తూ బిల్లుకు సవరణ చేయాలని గవర్నర్‌ సూచించారు. దీంతో బిల్లుకు సవరణ జరిపేందుకు మళ్లీ రాష్ట్ర శాసనసభ ఆమోదం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శాసనసభను ప్రొరోగ్‌ చేస్తూ ఇప్పటికే ప్రకటన జారీ చేసిన నేపథ్యంలో, మళ్లీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వరకు వేచిచూడక తప్పదు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ సూచన మేరకు మున్సిపల్‌ బిల్లుకు మార్పులు జరిపి అత్యవసర పరిస్థితుల రీత్యా ఆర్డినెన్స్‌ రూపంలో కొత్త పురపాలికల చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందనే చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం గోప్యత పాటిస్తుండటంతో కొంత గందరగోళం నెలకొంది. గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సంబంధాలకు సంబంధించిన సున్నిత విషయం కావడంతో దీనిపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు గవర్నర్‌ కార్యాలయం గానీ అధికారికంగా స్పందించలేదు.

ఆదివారమే సవరణ బిల్లుకు ఆమోదం
ఓ సవరణతో బిల్లును గవర్నర్‌ నరసింహన్‌ గత ఆదివారమే ఆమోదించారని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ ‘సాక్షి’కి తెలిపారు. అయితే, కొత్త పురపాలికల బిల్లును ఆమోదించారా? లేక సవరణతో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర వేశారా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు. వాస్తవానికి తాను కోరుకున్న సవరణతో బిల్లును నేరుగా గవర్నర్‌ ఆమోదించడానికి వీలు లేదు. సదరు సవరణను శాసనసభ ఆమోదించిన తర్వాతే గవర్నర్‌ దానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. వచ్చేనెలలో కొత్త పురపాలికల చట్టం ద్వారానే మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్‌ సూచించిన సవరణతో ఆర్డినెన్స్‌ రూపంలో కొత్త పురపాలికల చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం గోప్యంగా ఆర్డినెన్స్‌ సైతం జారీ చేసిందని ఊహాగానాలు వచ్చాయి. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించకపోవడంతో అసలు విషయం తెలియడంలేదు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు