కొత్త మున్సిపల్‌ చట్టం ఆమోదానికి గవర్నర్‌ బ్రేక్‌

23 Jul, 2019 14:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వ నూతన మున్సిపల్‌ చట్టం ఆమోదానికి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ బ్రేక్‌ వేశారు. చట్ట సవరణ బిల్లుకు సంబంధించి కొన్ని అంశాలపై గవర్నర్‌ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కాగా మున్సిపల్‌ చట్టానికి తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లులో కలెక్టర్లకు ప్రజా ప్రతినిధులను తొలగించే అధికారంపై గవర్నర్‌ అభ్యంతరం తెలిపారు. అంతేకాకుండా మున్సిపల్‌ ఎన్నికలు తేదీలను కూడా ప్రభుత్వమే నిర్ణయించడంపై అభ్యంతరం చెబుతూ బిల్లును వెనక్కి పంపారు. గవర్నర్‌ చేసిన సూచనలపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మళ్లీ ఆర్డినెన్స్‌ జారీ చేసింది. 

కాగా కొత్త మున్సిపల్‌ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధుల ఉమ్మడి భాగస్వామ్యంతో మున్సిపల్‌పాలనను పరుగులు పెట్టించేలా ఈ చట్టాన్ని రూపొందించింది. ఓవైపు బాధ్యతలను గుర్తు చేస్తూనే మరో వైపు సంస్కరణలను ప్రవేశపెడుతూ రూపొందించిన ఈ చట్టంలో జిల్లా కలెక్టర్లను సూపర్‌బాస్‌లను చేసింది. మున్సిపల్‌పగ్గాలన్నీ వారికే అప్పగించి ప్రజాప్రతినిధుల పనితీరుపై ఓ కన్నేసి ఉంచేలా నిబంధనలను తీసుకొచ్చింది.

చదవండి: జవాబుదారిలో భారీ మార్పులు

తేడా వస్తే చైర్‌పర్సన్‌తోపాటు సభ్యులను సస్పెండ్‌ చేసే అధికారాలను కట్టబెట్టింది. హరిత మున్సిపాలిటీల కోసం బడ్జెట్‌లో 10% నిధులను ప్రత్యేకంగా కేటాయించడంతో పాటు.. నాటిన వాటిలో 85% మొక్కలు బతక్కపోతే సంబంధిత వార్డు మెంబర్, అధికారిపై కొరడా ఝళిపించనుంది. పాలకవర్గాలకు ఎన్నికలు, వాటి పనితీరు సమీక్ష, పాలన పర్యవేక్షణ, పట్టణ ప్రణాళిక నియమ నిబంధనలు, ఉద్యోగులకు ఏకీకృత సర్వీస్‌ రూల్స్, నైపుణ్య పెంపుదల కోసం స్వయం ప్రతిపత్తితో కూడిన సంస్థ ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణ బోర్డుల ఏర్పాటు వంటి అంశాలతో శాసనసభ, మండలి ఆమోద ముద్ర వేసిన విషయం విదితమే. మరోవైపు నూతన పురపాలక చట్టంపై విపక్షాలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.

మరిన్ని వార్తలు