బాధ్యులపై  చర్యలు చేపట్టారా? 

2 Jul, 2019 03:47 IST|Sakshi

ఇంటర్‌ ఫలితాల వ్యవహారంపై గవర్నర్‌ అసంతృప్తి  

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ మార్కుల వ్యవహారంలో తలెత్తిన తప్పిదాలపై గవర్నర్‌ నరసింహన్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్యా శాఖలపై సోమవారం గవర్నర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్‌ ఫలితాల వ్యవహారంలో చోటుచేసుకున్న పరిణామాలపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మార్కుల్లో పొరపాట్లకు కారణమైన బాధ్యులను గుర్తించారా? ఏం చర్యలు చేపట్టారని ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా బోర్డు కార్యదర్శి అశోక్‌ కోర్టు క్లీన్‌ చీట్‌ ఇచ్చిందని పేర్కొన్నప్పటికీ అసంతృప్తిగానే ఆ అంశాన్ని ముగించినట్లు సమాచారం. అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా పక్కా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగాలని ఆదేశించినట్లు తెలిసింది.

విద్యా సంబంధ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు సమాచారం. అలాగే పాఠశాల విద్య, ఉన్నత విద్య కార్యక్రమాలపైనా సమీ క్షించి, నాణ్యత ప్రమాణాల పెంపు కోసం చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇంజనీరింగ్‌ ఫీజుల వ్యవహారంపై అడిగినట్లు సమాచారం. సమావేశంలో ఉన్నత విద్య మం డలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, కళాశాల విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్లు ప్రొఫెసర్‌ లింబాద్రి, వెంకటరమణ, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్య కమిషనర్‌ విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.బాధ్యులపై 
చర్యలు చేపట్టారా? 
 

మరిన్ని వార్తలు