అచ్చతెలుగులో ఆరంభం.. ముగింపు

12 Jun, 2014 02:34 IST|Sakshi
అచ్చతెలుగులో ఆరంభం.. ముగింపు

గవర్నర్ ప్రసంగాన్ని సావధానంగా విన్న శాసనసభ్యులు
 సాక్షి, హైదరాబాద్: ‘మాన్యశ్రీ శాసన సభాపతి, మాన్యశ్రీ శాసన మండలి అధ్యక్షులు, గౌరవ శాసన సభ్యులు, మండలి సభ్యులు అందరికీ నా శుభాభివందనములు’ - ఈ మాటలు మరెవరివో కాదు... మన గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌వే. తెలంగాణ అసెంబ్లీ ఉభయసభలను ఉద్దేశించి బుధవారం ఆయన చేసిన ప్రసంగం ఇలా అచ్చ తెలుగులో మొదలై.. చివర్లో మళ్లీ తెలుగులోనే ముగించారు. గతంలో ఉమ్మడి రాష్ర్టంలో గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగించిన ప్రతిసారీ విపక్షాలు తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపాయి. ప్రసంగ ప్రతులు చించడం, కుర్చీలు, మైకులు విరగ్గొట్టడం వంటివి కూడా చోటుచేసున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని స్వయం పాలన లక్ష్యాన్ని సాకారం చేసుకున్న ఆనందంలో ఉన్న ప్రజాప్రతినిధులంతా గవర్నర్ ప్రసంగాన్ని సావధానంగా విన్నారు.

ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్‌గా ఉన్న ఇదే నరసింహన్‌ను గతంలో ‘గో బ్యాక్’ అన్న తెలంగాణ నేతలు ఇప్పుడు ఆయనకు వినయంగా, గౌరవపూర్వకంగా సహకరించారు. గవర్నర్‌కు కుడివైపున స్పీకర్ మధుసూదనాచారి, ఎడమవైపున మండలి చైర్మన్ విద్యాసాగర్‌రావు ఆసీనులయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించిన నరసింహన్ 20 నిమిషాలపాటు రాష్ర్ట ప్రభుత్వ లక్ష్యాలు, ప్రాధాన్యతలను వివరించారు. ‘తెలంగాణ రాష్ట్ర ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సమావేశానికి అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజు చరిత్రాత్మక శుభదినం’ అని గవర్నర్ ప్రసంగం తెలుగులో ప్రారంభమైంది. ‘భారత రాజ్యాంగానికి లోబడి తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతిపౌరునికీ సమానహోదా, రక్షణ కల్పిస్తామని నేను హామీ ఇస్తున్నాను. సర్వజన హితాయ...సర్వజన సుఖాయ - ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం-ఆశయం.. జైహింద్’ అని తెలుగులోనే ఆయన ప్రసంగం ముగిసింది. గతంలో 30 పేజీలకుపైగా ఉండే గవర్నర్ ప్రసంగ పత్రం ఈసారి 16 పేజీలకే పరిమితమైంది. నరసింహన్ ప్రసంగం చాలా సరళంగా, సూటిగా ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

ఇదీ గవర్నర్ ప్రసంగం తీరు
  రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ అభివృద్ధికి ఎటువంటి ఢోకా ఉండదనే భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.  మెల్‌బోర్న్, వియన్నా, వాంకోవర్, టొరెంటో వంటి అంతర్జాతీయ నగరాల మాదిరి భాగ్యనగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.  శాంతిభద్రతల విషయంలో రాజీపడబోమని ప్రకటించారు. లండన్, న్యూయార్క్ సిటీల వలే నగరం మొత్తం సీసీ కెమెరాలను అమర్చి ‘సేఫ్‌సిటీ’గా తీర్చిదిద్దుతామన్నారు.
  రాజకీయ అవినీతిని నిర్మూలిస్తామని, పరిశ్రమలకు ఇబ్బందులు కలగకుండా సీఎం కార్యాలయంలో ‘ప్రత్యేక ఛేజింగ్ విభాగం’ ఏర్పాటు చేస్తామని చెప్పడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేశారు.
  గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత, రుణాల మాఫీ ఏమైందని తెలుగుదేశం సభ్యులు ఎర్రబెల్లి, రేవంత్‌లు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నించగా.. ముందు మీ చంద్రబాబును అడగండి అని మంత్రి జగదీశ్వర్‌రెడ్డితో పాటు టీఆర్‌ఎస్ శాసనసభ్యులు బదులిచ్చారు.

మరిన్ని వార్తలు