అప్రమత్తంగా ఉండండి.. ఆందోళన వద్దు

21 Mar, 2020 03:28 IST|Sakshi
శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటున్న గవర్నర్‌ తమిళిసై

‘కోవిడ్‌’పై రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై పిలుపు

22న రాజ్‌భవన్‌లో కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమం

సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణ సోదర సోదరీమణులారా చేతులు బాగా కడుక్కోండి, దూరాన్ని పాటించండి. ఇంట్లోనే ఉండండి. ‘కోవిడ్‌’లక్షణాలు ఉన్నట్లు అనుమానాలు వస్తే డాక్టర్‌ను సంప్రదించండి. అప్రమత్తంగా ఉండండి. కానీ ఆందోళన పడకండి. ప్రభుత్వం మీతో ఉంది’అని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ప్రజలకు భరోసా ఇచ్చారు. కోవిడ్‌ –19 ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె పిలుపునిచ్చారు. ప్రజలను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయని, ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును ప్రజలు పాటించాలని గవర్నర్‌ కోరారు.

కేవలం భారతదేశమే కాకుండా ప్రపంచం కూడా ఈ భయంకర పరిస్థితిని ఎదుర్కుంటోందన్నారు. గతంలో మన పెద్దలు యుద్ధాలను చూశారని, ప్రస్తుత తరం వైరస్‌ రూపంలో ‘బయో వార్‌’ను ఎదుర్కొంటున్నదని గవర్నర్‌ వ్యాఖ్యానించారు. ప్రజలు భయాందోళనకు గురి కాకుండా అప్రమత్తంగా, నైతిక స్థైర్యాన్ని కలిగి ఉండాలని గవర్నర్‌ తమిళి సై సూచించారు. ‘కోవిడ్‌’పై పోరులో వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, అధికారులు, ప్రజా రవాణా సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది చూపుతున్న చిత్తశుద్ధిని గవర్నర్‌ ప్రశంసించారు. ‘కోవిడ్‌’కు నివారణే చికిత్స అని, ఇళ్లలోనే ఉండి ఇంటి వద్ద నుంచే పనులు చేయాలని, విదేశాల నుంచి వచ్చే వారు 14 రోజుల సెల్ఫ్‌ క్వారంటైన్‌ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

22న రాజ్‌భవన్‌లో థ్యాంక్స్‌ గివింగ్‌
ప్రధాని మోదీ పిలుపుమేరకు ఈ నెల 22న ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. ‘కోవిడ్‌’ను అరికట్టేందుకు పోరాడుతున్న వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ నెల 22న సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తమిళిసై వెల్లడించారు. రాజ్‌భవన్‌లో పనిచేసే ఉద్యోగులకు రోజూ థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించి, ఉష్ణోగ్రతలు నమోదు చేస్తున్నామని, చేతులు శుభ్రం చేసుకోవడంపై తమ సిబ్బందికి అవగాహన కల్పించినట్లు గవర్నర్‌ వెల్లడించారు. 65ఏళ్లు పైబడిన వారిని బయటకు పంపకుండా చూసుకోవాలని, మురికివాడల్లో ఉండే వారు కూడా సబ్బుతో చేతులు కడుక్కునేలా అవగాహన కల్పించాలని గవర్నర్‌ సూచించారు. మీడియా సమావేశానికి వచ్చిన గవర్నర్‌కు రాజ్‌భవన్‌ వైద్య బృందం థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశారు.

మరిన్ని వార్తలు